'చంద్రబాబు... అసెంబ్లీలో బొమ్మలా కూర్చుంటారు'
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు మరోసారి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత శోభానాగిరెడ్డి మండిపడ్డారు. శనివారం శోభానాగిరెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ... విభజన బిల్లుపై వారిరువురు ఎలాంటి సవరణ ప్రతిపాదనలు ఇవ్వలేదని, కానీ వారివారి పార్టీ ఎమ్మెల్యేలతో ఇప్పించారని ఆమె ఆరోపించారు.
ఈ విధంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు దశలవారిగా ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర విభజనపై ఇంత గొడవ జరుగుతున్న చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో బొమ్మలాగా కూర్చుంటున్నారని శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రెండు కళ్ల సిద్దాంతాన్ని వదలిపెట్టాలని బాబుకు శోభానాగిరెడ్డి హితవు పలికారు. విభజన బిల్లుపై ఓటింగ్ జరుపుతామని సీఎం కిరణ్ స్పష్టమైన ప్రకటన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనపై కిరణ్, చంద్రబాబులు అనుసరిస్తున్న వైఖరిపై వారి చొక్కాలు పట్టుకుని నిలదీయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబుకు శోభానాగిరెడ్డి సూచించారు.