రాజీనామా.. కిరణ్ కొత్త డ్రామా : శోభానాగిరెడ్డి
* వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ధ్వజం
* ముందే చేసుంటే ఈ పరిస్థితి వచ్చేదా
* ఒకవైపు సహకరిస్తూ.. మరోవైపు ధిక్కరిస్తున్నట్లు నాటకాలు
* అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాలేదంటూ బాబు మొసలి కన్నీళ్లు
* ముందు బాబు కాళ్లు పట్టుకుని విభజన అనుకూల లేఖను వెనక్కు తీసుకోండి
* టీడీపీ నేతలకు సలహా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు పక్కా రూట్ మ్యాప్‌తో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. రెండు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో రాజీనామా అంటూ కొత్త డ్రామాకు తెరదీశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి దుయ్యబట్టారు. సీడబ్ల్యూసీ సమావేశం మొదలుకొని విభజన బిల్లు అసెంబ్లీకి తీసుకురావడం, ఎలాంటి ఆటంకం లేకుండా చర్చ జరిపించి తిప్పి పంపడంతో పాటు విభజనకు కావాల్సిన సమగ్ర సమాచారాన్ని కేంద్రానికి చేరవేసింది కిరణ్ కాదా? అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టిద్దామన్నప్పుడు ఆయన కూడా రాజీనామా చేసుంటే విభజన ప్రక్రియ ఇక్కడివరకు రాకపోయేది, తామంతా కూడా అభినందించేవారమని శోభానాగిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు..
* రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్సార్‌సీపీ ప్రతీ ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటోంది. రాజీనామాలు చేయడం, రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇచ్చాం. నిరాహారదీక్షలు చేయడం, సమైక్యతీర్మానం చేయాలని అసెంబ్లీలో పట్టుబట్టడం సహా ఎన్నో కార్యక్రమాలు చే శాం. పార్టీ అధ్యక్షుడు జగన్ నేతృత్వంలో విజయమ్మతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును కేంద్రానికి పంపొద్దని విన్నవించాం.
* రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం జాతీయపార్టీల నాయకులను గతంలో కలిసి మద్దతు కూడగట్టిన మా పార్టీ అధ్యక్షుడు జగన్... బిల్లు పార్లమెంటుకు రానున్న నేపథ్యంలో వారిని మరోసారి కలిసి మద్దతు కోరనున్నారు.
* పాకిస్థాన్, చైనాలు ఆక్రమణలకు పాల్పడుతున్నా, బాంబు పేలుళ్లు జరిగినా, భారీ తుపాన్లు విరుచుకుపడినా స్పందించని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడం కోసం మాత్రం ఎందుకంత తొందరపాటు ప్రదర్శిస్తోంది?
* తెలుగుదేశం పార్టీ నేతలు ఢిల్లీలో ఎవరెవరివో కాళ్లు పట్టుకునే బదులు చంద్రబాబు కాళ్లు పట్టుకొని విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఉపసంహరింపచేయాలి. కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టి, తెలుగువారంటే నవ్వుకునేలా చేస్తున్నారు.
* విభజన బిల్లులో లోపాలున్నప్పుడు అసెంబ్లీలో ఎందుకు చర్చించారని, ముందే తిప్పి పంపొచ్చుకదా? అని దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ నేతలు అడుగుతున్న ప్రశ్నకు సీఎం కిరణ్, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి.
* తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు బిల్లులో లోపాలున్నాయని కిరణ్ చెప్పేంత వరకు తెలియలేదా? సభలో తనకు మాట్లాడే అవకాశం రాలేదంటూ మళ్లీ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
* సీఎం కిరణ్ నిజంగా కేంద్రాన్ని వ్యతిరేకించి మౌనదీక్షకు కూర్చుంటే ఆయనతోపాటే పీసీసీ అధ్యక్షుడు ఎందుకు కూర్చుంటారు?
* రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ పెట్టే అభ్యర్థుల గెలుపునకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి.. కేంద్రాన్ని ఎదిరిస్తున్నానంటూ ప్రచారం చేసుకుంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు.
* ఆంధ్రజ్యోతి పత్రిక జగన్‌పై గాలి వార్తల దుష్ర్పచారం చేస్తోంది. పత్రికలు ప్రజల విశ్వాసం చూరగొనాలే తప్ప, కోల్పోయేలా వార్తలు రాయకూడదు.
* ఒకవైపు నేతలెవరినీ జగన్ సరిగా పట్టించుకోరని, ఎవరితో మాట్లాడరని, సబ్బంహరిని కూడా పట్టించుకోలేదంటూ వార్తలు రాస్తూ.. మరోవైపు మళ్లీ సబ్బంహరిని జగన్ వేడుకున్నట్లు వార్తలు రాయడం ఆంధ్రజ్యోతికి సిగ్గుచేటు.