రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం ప్రయత్నాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
సీఎం కిరణ్‌పై శోభానాగిరెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం ప్రయత్నాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం అనంతరం బయటకొచ్చి ‘అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా’ అని చెప్పిన వ్యక్తి కిరణ్ కాదా? అని ప్రశ్నించారు. విభజన ప్రకటన వచ్చిన పదిరోజుల వరకు బయటకు రాకపోతే... ‘సీఎం కనిపించడం లేదు’ అంటూ ప్రజలు పత్రికల్లో ప్రకటనలు వేసిన తర్వాత బయటకొచ్చి తాను సమైక్యవాదినంటూ చెప్పుకున్న వ్యక్తి కిరణ్ అంటూ దుయ్యబట్టారు. అలాంటి వ్యక్తికి జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు.
ఆమె శుక్రవారం లోటస్‌పాండ్ వద్ద మీడియాతో మాట్లాడారు. తాను సమైక్యవాదినంటున్న కిరణ్ విభజన ప్రకటనను ఎందుకు నిలుపుదల చేయలేకపోయారని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ పార్టీలో సీఎంగా ఉన్న మీ మాటకు కూడా విలువలేదా? అయితే అలాంటి పార్టీలో మీరెందుకున్నారు? సీఎం పదవిని పట్టుకొని ఇంకా ఎందుకు వేలాడుతున్నారు?’’ అని కిరణ్‌ను ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. తమ పార్టీ ఎప్పుడూ విభజనను కోరుకోలేదని, అఖిలపక్ష సమావేశంలో కూడా ఒక తండ్రిలా న్యాయం చేయమని కోరామని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రం న్యాయం చేసే పరిస్థితి లేనందున సమైక్యంగా ఉంచమని డిమాండ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు.