కిరణ్.. మరో డ్రామా: దామోదర రాజనర్సింహ
సీమాంధ్రలో ఇమేజ్‌ను పెంచుకునేందుకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను పిచ్చోళ్లను చేసేందుకు యత్నించారని, అందులో భాగంగానే విభజన బిల్లు తిరస్కరణ తీర్మానం పేరుతో మరోడ్రామాకు తెరదీశారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. గురువారం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత మంత్రులు బసవరాజు సారయ్య, జి.ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముత్యంరెడ్డి, ఆత్రం సక్కు, కె.శ్రీధర్, సీహెచ్.లింగయ్య, ప్రతాప్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డిలతో కలిసి సీఎల్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం దామోదర మీడియాతో మాట్లాడారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నైతిక విలువలు, చిత్తశుద్ధి లేని వ్యక్తి అని, జన్మతః ఆయన కుట్రదారుడని దామోదర ధ్వజమెత్తారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ముగిసిందన్నారు.
సీఎంసహా సీమాంధ్ర మంత్రులంతా 48 రోజులుగా రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ కిరణ్ ఒక ప్రాంతానికే నాయకుడిగా వ్యవహరించారని నిప్పులు చెరిగారు. బొంబాయిని యూటీ చేయాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానిస్తే పార్లమెంట్ దానిని తిరస్కరించిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళితే పార్లమెంట్ చేసిందే రైటని తీర్పిచ్చిందని తెలిపారు. మన రాష్ట్ర అసెంబ్లీ విషయంలోనూ అదే జరుగుతుంది. ఏదిఏమైనా 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.