సీఎంకు అవ్వా కావాలి.. బువ్వా కావాలి
విభజన బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ ప్రకటించిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి తిరస్కరణ నోటీసును ప్రవేశపెట్టారని, ఆ తీర్మానానికి ప్రాధాన్యం లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. తెలంగాణ ప్రజలు భయాందోళనలకు లోనుకావొద్దని, 15 రోజుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందని ఆయన చెప్పారు. సీమాంధ్రలో రాజకీయ లబ్ధి కోసమే సీఎం ఈ ఎత్తు వేశారని, ఇమేజీ పెంచుకోవడానికి నోటీసు డ్రామా ఆడారని మండిపడ్డారు. సీమాంధ్ర ప్రజలను సీఎం మభ్యపెట్టారని, ఆయనకు పదవీ కావాలి, సీమాంధ్రలో రాజకీయ భవిష్యత్తు కూడా కావాలని డిప్యూటీ సీఎం అన్నారు. సీఎంకు అవ్వా కావాలి, బువ్వా కావాలని, వ్యక్తిగత ఉనికిని కాపాడుకోవడానికే ఈ స్వార్థానికి దిగారని వ్యాఖ్యానించారు.
సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డ్రామాలు ఆడారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. నాయకుడు అనేవాడు రాష్ట్రానికి నాయకుడుగా ఉండాలి తప్ప ఓ ప్రాంతానికి మాత్రమే నాయకుడిగా వ్యవహరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ.. బిల్లును అడ్డుకున్నామని, విజయం సాధించామని ముఖ్యమంత్రి వర్గం ప్రకటనలు చేయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరించినట్లు ప్రకటించిన తర్వాత ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కల సాకారం కాబోతోందని అన్నారు. కిరణ్ తన స్వార్థం కోసమే ఇంత కాలం డ్రామాలాడారని దామోదర ఆరోపించారు. ముఖ్యమంత్రి వద్ద 'బాల్ లేదు... బ్యాట్ లేదు' అని వ్యాఖ్యలు చేశారు.