ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం చర్చలు | Chief Minister's Discussion with Employees Union | Sakshi
Sakshi News home page

ఉద్యోగ సంఘాలతో త్వరలో సీఎం చర్చలు

Published Thu, Oct 3 2013 1:03 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Chief Minister's Discussion with Employees Union

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె చేపట్టిన ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి స్థాయిలో త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. సమ్మె విరమణ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, త్వరలో ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలవనున్నామని ఉన్నతస్థాయి అధికార వర్గాల సమాచారం. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే మూడుసార్లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామంటూ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె విరమించబోమని ఉద్యోగ సంఘాలు ఉపసంఘానికి తేల్చిచెప్పాయి.
 
 విభజన సమస్య రాజకీయపరమైందని, అందువల్ల ఉపసంఘం స్థాయిలో చర్చలతో పరిష్కారం లభించే అవకాశం లేదని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. సీఎం స్థాయిలో చర్చలు జరిపితే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి హామీ ఇప్పించడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం ఉద్యోగ సంఘాల నేత ల్లో వ్యక్తమవుతోంది. అందుకు అనుగుణంగా సీఎం స్థాయి లో చర్చలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులనూ చర్చల్లో భాగస్వాములను చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రాథమికంగా చర్చలు జరపడం ఈ కసరత్తులో భాగమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోం శాఖ అధికారులను చర్చల్లో పాల్గొనమని ఆహ్వానిస్తూ సీఎస్ లేఖ రాయనున్నారని సమాచారం. సీఎం స్థాయి చర్చల్లో.. తాము ఆశించిన విధంగా హామీ లభిస్తే సమ్మె విరమణ గురించి ఆలోచిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. స్పష్టమైన హామీ లభించని పక్షంలో సమ్మె కొనసాగించడానికి వెనకాడే ప్రసక్తే లేదంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement