జల జగడాలతో జాతుల వైరాలు | dileep reddy opinion on Water disputes | Sakshi
Sakshi News home page

జల జగడాలతో జాతుల వైరాలు

Published Fri, Oct 21 2016 1:26 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

జల జగడాలతో జాతుల వైరాలు - Sakshi

జల జగడాలతో జాతుల వైరాలు

సమకాలీనం
గాలిలాగే నీరు కూడా మానవాళి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన సహజ వనరు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగానే ఎక్కడి నీటిపై అక్కడి వారికి హక్కులు సంక్రమిస్తాయనే వాదనని ఇటీవల మానవహక్కుల కార్యకర్తలతోపాటు, ఆ సంస్థలు కూడా ముందుకు తెస్తున్నాయి. వారు వినియోగించుకోగా మిగిలినవి నది దిగువకు వస్తాయనేది ఆలోచన. దీంతో, నది దిగువ ప్రాంతపు హక్కులు, నికర జలాలు, మిగులు జలాలు, దామాషా వాటా... తదితర పదాలకు కాలం చెల్లిందనేది వారి వాదన.

జలజగడాలు విశ్వవ్యాప్తం. అంతటా ఉన్నాయి, ఇక్కడా ఉన్నాయి. అవసరా లకన్నా జలవనరులు తక్కువున్నపుడు తగవులు తప్పవు. గోదావరి గొడవల కన్నా, కృష్ణా కిరికిరి ఎక్కువుండటానికి అదే కారణం. కృష్ణాలో డిమాండ్ ఎక్కువ, నీటి లభ్యత తక్కువ కావడం అంతర్రాష్ట్ర జలవివాదాలకు ఆజ్యం పోస్తోంది. సమస్య కన్నా పరిష్కారం సంక్లిష్టమైనపుడు పర్యవసానాలూ బాధాకరమే! కృష్ణానది నీటి పంచాయితీలు ఎడతెగని సమస్యగా పరిణమి స్తున్నాయి. ఇప్పుడు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పు రెండు తెలుగు రాష్ట్రాలకు మింగుడు పడటంలేదు. ఎందుకంటే, తీర్పు అను కూలంగా లేదనేది ఒక బాధయితే, సదరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇంకా బాధను కలిగిస్తున్నాయి! తీర్పును అన్వయించుకుంటున్న తీరులోని స్వీయ అపరిపక్వత బాధకు మరింత కారణమౌతోంది. వెరసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీరని అసంతృప్తితో రగులుతున్నాయి. ఆపత్కా లంలో ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే ప్రతికూ లంగా వ్యవహరించిందనే కోపం ఇద్దరికీ ఉంది. ఇక సుప్రీంకోర్టు తలుపు తట్టడమే తరుణోపాయమంటున్నాయి దాదాపు రెండు ప్రభుత్వాలు.

ఇది వరకే సుప్రీం ధర్మగంటను మోగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్తి ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఫలితంగా, నీటి తాజా పంపకాలకు సంబం ధించి ట్రిబ్యునల్ ఇచ్చిన అంతిమ అవార్డు (29 నవంబర్-2013) ఇంకా ‘గజెట్’రూపం పొందలేదు. నిర్దిష్ట అభ్యంతరాలతో ఉమ్మడి ఏపీ సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ వేసింది. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అమలుకు ప్రాతి పదిక అయ్యేది ఆ తీర్పే! సదరు తీర్పుకై నిరీక్షించడమా? ఈ లోపున్నే మరో మారు కోర్టు మెట్లెక్కడమా? ఇదీ ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న ప్రశ్న. ట్రిబ్యునల్ తాజా తీర్పు ప్రతిని చూసి, నిపుణులతో లోతుగా చర్చించి వ్యూహాత్మకంగా అడుగేయాలనుకుంటున్నట్టు ప్రభుత్వాలు సంకేతాలిస్తు న్నాయి. కృష్ణా పరీవాహక ప్రాంతాలైన నాలుగు రాష్ట్రాల్నీ కలిపి పంపకాల పునరాలోచన చేయాలన్న తెలుగు రాష్ట్రాల ప్రతిపాదనను ట్రిబ్యునల్ తోసి పుచ్చి, ‘ఇది కొత్తగా ఏర్పడ్డ మీ రెండు రాష్ట్రాల వ్యవహారమే’ అని తేల్చడంతో వారికి పాలుపోవటం లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రివర్ వ్యాలీ అథా రిటీల ఏర్పాటు డిమాండ్ తెరపైకి వస్తోంది. సుస్థిరాభివృద్ధి నమూనాలో ప్రతిపాదించినట్టు ప్రకృతిగతమైన సహజ పద్ధతుల్లో ఎక్కడి నీరక్కడ నిల్వ చేయడం, ప్రత్యామ్నాయ జలవనరుల్ని మెరుగుపరచడం, సంప్రదాయ పరి జ్ఞానాన్ని వినియోగించడం అన్న పంథాలో వెళితే తప్ప పరిష్కారాలు దొరక వన్నది జల వ్యవహారాల నిపుణుల భావన.
 
రాజకీయాంశం ప్రభావితం చేసిందా?
కృష్ణా ట్రిబ్యునల్ ఇప్పుడిచ్చిన తీర్పు నిజానికి నీటి కేటాయింపులకు సంబం ధించి కాదు. తాజా వివాద పరిష్కారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలా? మొత్తం కృష్ణా పరివాహక ప్రాంతాలయిన మహారాష్ట్ర, కర్ణాటక సహా నాలుగు రాష్ట్రాల్ని కలిపి చేయాలా? అనే అంశాన్ని తేల్చింది. మహారాష్ట్ర, కర్ణాటకకు ఇదివరకే చేసిన నీటి కేటాయింపుల్ని ముట్టు కోవద్దు, తాజా వివాదాన్ని విభజనతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ, ఏపీలకే పరిమితం చేయండంటూ కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్‌కిచ్చిన (25 ఆగస్టు 2014) అఫిడవిట్టే ఈ తీర్పును ప్రభావితం చేసిందనే అభిప్రాయముంది. సదరు అఫిడవిట్ ఇప్పించడంలో ఆ రెండు రాష్ట్రాల రాజకీయ లాబీలు గట్టిగా పనిచేశాయి. మహారాష్ట్రలో అధికార పక్షంగా, కర్ణాటకలో అధికారం ఆశిస్తున్న పార్టీగా బీజేపీ నాయకత్వం అఫిడవిట్టు ఇప్పిచ్చే వ్యవహారాన్ని తనకను కూలంగా నడిపిందని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వవర్గాలు భావించడం సహజం. ముఖ్యమైన నదులన్నీ పలు రాష్ట్రాల మధ్య ప్రవహిస్తూ, తరచూ వివాదాలు రగిలే సమాఖ్య రాజ్యంలో ఇప్పటివరకు జాతీయ జలవిధానం లేకపోవడమే దారుణం. రాజకీయ అవకాశవాదమే ఇందుకు కారణమనేది మేధావివర్గం విమర్శ.

నదీజలాల వినియోగం తమ చెప్పుచేతల్లో ఉండాలని, అంతర్రాష్ట్ర వివాదాలను, తద్వారా తలెత్తే ప్రజల మనోభావాలు- ఉద్విగ్న తల్ని తమ తమ రాజకీయ అవసరాలకు ఎరగా వాడుకునే ఎత్తుగడతోనే పార్టీలు ‘స్వతంత్ర నదీలోయ ప్రాధికార సంస్థ’ల ఏర్పాటుకూ మోకాలడ్డు తున్నాయనేదొక విమర్శ. సమస్య తీవ్రతను, అంటే నీటి పంపకాలతో పాటు ఏయేటి కాయేడు లభ్యత-వినియోగావకాశాల్ని ట్రిబ్యునల్ సహజ న్యాయ సూత్రాల ప్రకారం పరిశీలించడం లేదని దిగువ రాష్ట్రాలు అరోపిస్తున్నాయి. ఎగువనున్న మహారాష్ట్ర-కర్ణాటకతో కలిపి కాకుండా, కేవలం తెలంగాణ- ఏపీల మధ్యే వివాదం పరిష్కరించుకొమ్మని చెబితే తాము కొత్త వ్యూహాలు అనుసరించాల్సి వస్తుందని రెండు తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఫలి తంగా తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త స్పర్థలకు, వివాదాలకు ఆస్కారమేర్పడు తోంది. క్యారీ ఓవర్ కింద వంద టీఎమ్సీలు, పోలవరం-పట్టిసీమ ప్రాజె క్టులు కడుతున్నందున, ఇదివరకటి ఒప్పందం ప్రకారం తమకు వాటాగా రావా ల్సిన తొంభయ్ (45+45) టీఎమ్సీలు, మొత్తం 190 టీఎమ్సీలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని తెలంగాణ ప్రభుత్వం, వారి ఈ యత్నాల్ని అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఎత్తుగడల్లో ఉన్నాయి.
 
అన్ని విధాలా పునరాలోచన అవసరం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రస్తుత వ్యవహారం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిందే అనడం సబబే! అయితే, ఇక్కడ ఒక విషయాన్ని ఎగువ రాష్ట్రాలతో పాటు ట్రిబ్యునల్ కూడా పెడచెవిని పెట్టింది. నదీజలాల పంపిణి అన్నది ఫక్తు అన్నదమ్ముల ఆస్తి పంపకాల వంటిదనే వాదన తప్పు! ఎలా అంటే, ఓ కుటుంబంలోని ఉమ్మడి సంపద ఏ రూపంలో ఉన్నా, ఒకసారి పంపిణీ ద్వారా... తదనంతర కాలంలో పరస్పరం సంబంధం లేని విధంగా వేర్పరచగల ఆస్తి అది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు వాటాదారుల మధ్య కూడా పంపిణి చేయొచ్చు. ఉదాహరణకు: నలుగురు సోదరుల్లో ఇద్దరు ముందే విడిపోయినా, చివరి ఇద్దరు కొన్నేళ్లు కలిసుండి, తాజాగా వారిద్దరూ విడిపోతామంటే.... చివరి పంపిణీ వారిద్దరి మధ్యే పరిమితమౌతుంది. కానీ, నదీజలాలు అలా కాదు. వేరుపడ్డ తర్వాత కూడా సంబంధముండే వ్యవహారాలుంటాయి. తెలుగు రాష్ట్రాలు లేవనెత్తు తున్న అభ్యంతరాల్లో రెండు ముఖ్యమైన అంశాలున్నాయి. ఒకటి: రాష్ట్ర పునర్విభజన తర్వాత కొనసాగింపు పొందిన ట్రిబ్యునల్ పరిశీలనాంశాల పరిధిలో అంతర్రాష్ట్ర వివాద పరిష్కారంతో పాటు నదిలో ‘తక్కువ నీటి ప్రవాహం ఉన్నపుడు’ నీటి నిర్వహణ నిబంధనావళి (ఆపరేషనల్ ప్రోటో కాల్)ని ఖరారు చేయడం.

అందుకే ప్రాజెక్టుల వారీ కేటాయింపుల అంశం ముందుకొచ్చింది. ఎగువ రెండు రాష్ట్రాల్లో జలాల స్థూల కేటాయింపులు జరిపి, కింది రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులంటే, సమతూకం లేకుండా ఆపరేషన్ ప్రోటోకాల్ ఎలా ఆచరిస్తారు? అన్నది తెలుగు రాష్ట్రాల అభ్యంతరం. ఈ విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఏపీ న్యాయవాది ఎ.కె. గంగూలీ సమర్థంగా వినిపించే యత్నం చేసినా ట్రిబ్యునల్ పట్టించుకున్నట్టు లేదు. రెండు: ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం ఎగువ రాష్ట్రాలు తమ రిజర్వాయర్లలో నీటిని నింపుకుంటూ వెళితే... సీజన్ ఆలస్యమైనప్పుడు, వర్షాలు తక్కువగా కురిసినప్పుడు దిగువ రాష్ట్రాల పరిస్థితేమిటి? కోటా నింపుకునే వరకు దిగువకు చుక్క నీరొదలరు. ఇందుకు ట్రిబ్యునల్ చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమిటి? శూన్యం. సీజన్ల వారీగా నీటి లభ్యతను బట్టి అన్ని రాష్ట్రాల మధ్య దామషా పద్ధతినైనా పంపకాలు జరపాలి. ఇదిలేని దుస్థితి వల్లే అక్టోబర్ వరకు కిందికి నీటిని వదలటం లేదు.

ఇక.. నికర జలాలనో! మిగులు జలాలనో! దిగువ రాష్ట్రాలకు ఎన్ని టీఎమ్సీలు కేటా యిస్తే మాత్రం ఏమిటి ప్రయోజనం? దిగువన సాగే జరగదు కదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మారిన వాతావరణ, భౌగోళిక, నిర్వహణా పరిస్థితుల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్ని కలిపి తాజాగా ఆలోచన చేయాలన్నది ఆ విజ్ఞప్తి వెనుక భావన. ఒక నది బేసిన్ నుంచి ఇతర నదీపరీవాహక ప్రాంతా లకు కూడా ఎగువ రాష్ట్రాల్లో యథేచ్ఛగా నీటి మళ్లింపులు జరుగుతున్నందున పునరాలోచన, తాజా పరిశీలన అవసరమని దిగువ రాష్ట్రాలంటున్నాయి. ఇందుకు పూర్తి భిన్నమైన వాదన కూడా ఉంది. గాలిలాగే నీరు కూడా మాన  వాళి మనుగడకు ప్రకృతి ప్రసాదించిన సహజవనరు. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగానే ఎక్కడి నీటిపై అక్కడి వారికి హక్కులు సంక్రమిస్తాయనే వాదనని ఇటీవల మానవహక్కుల కార్యకర్తలు, సంస్థలు ముందుకు తెస్తున్నాయి. వారు వినియోగించుకోగా మిగిలినవి నది దిగువకు వస్తాయనేది ఒక ఆలోచన. దీంతో, నది దిగువ ప్రాంతపు హక్కులు, నికర జలాలు, మిగులు జలాలు, దామాషా వాటాలు... తదితర పదజాలానికి కాలం చెల్లిందనేది వారి అభిప్రాయం. నది దిగువ ప్రాంతపు హక్కులనే వాదనను వరల్డ్‌వాటర్ ఫోరమ్ కూడా కొట్టివేసిందని వారు ఉటంకిస్తున్నారు.
 
ప్రత్యామ్నాయ మార్గాలే పరిష్కారం
కృష్ణా తొలి ట్రిబ్యునల్ బచావత్ (‘ఏ’స్కీమ్)లోనే నదీలోయ ప్రాధికార సంస్థ (ఆర్వీయే)ల ఏర్పాటు ప్రతిపాదన ఉంది. రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాక ‘బి’ స్కీమ్‌కు వెళ్లారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఆర్వీయే బిల్లు తేవాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాటిని కేంద్ర జలవనరుల మంత్రి నేతృత్వంలో ఉంచాలని ముసాయిదాలో ప్రతిపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, మళ్లీ అంతా రాజకీయమే! అలా కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా తేవాలి. అవసరాన్ని బట్టి సుప్రీంకోర్టు మాత్రమే జోక్యం చేసుకోవాలి. పాలకుల ఆలోచనల్లోనూ మార్పు రావాలి. పెద్ద పెద్ద ప్రాజె క్టులు మాత్రమే పరిష్కారంకాదు. అత్యధిక ప్రాజెక్టులున్న మహారాష్ట్రలోనే కరవులెక్కువ, రైతు ఆత్మహత్యలెక్కువ. హనుమంతరావు వంటి నిపుణులు చెబుతున్నట్టు సంప్రదాయక ప్రత్యామ్నాయాలపై శ్రద్ధ పెట్టాలి. వాన నీటిని ఎక్కడికక్కడ నిలపాలి. ఉపరితల, భూగర్భ జలమట్టాల్ని మెరుగుపరచాలి.

తేమ పెంచే- పరిరక్షించే ప్రక్రియల్ని బలో పేతం చేయాలి. రెండు దశాబ్దాల కింద, 1996 మే నెల, ‘రాజ్యం-సంక్షేమం’ అంశంపై విశాఖపట్నంలో జరిగిన సెమినార్లో దివంగత మేధావి కె. బాలగోపాల్ చెప్పిన మాట మననం చేసు కోవాలి. ‘‘గాలిలాగే నీరు ప్రకృతి వనరు. అందరికీ సమానంగా అందు బాటులో ఉండాలి. ఇదొక మౌలిక ప్రజాస్వామ్య సూత్రమని నేననుకుం టాను. ఈ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నా అంచనా ఏంటంటే, అన్నిరకాల నీటివనరుల్నీ కలిపి అందరూ వాడుకునేటట్టయితే.. ప్రతి ఎక రాకూ ఒక పంటకు నీరివ్వచ్చు. ఈ మాట కొన్ని ప్రాంతాల వాళ్లకి పెద్ద విషయం అనిపించకపోవచ్చు. కానీ, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ మాటంటే వాళ్లెంత ఆనందపడతారో! ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపిస్తుంది. నీళ్లు అనే వనరును పంచకోవడం ఒక ప్రజాస్వామిక సూత్రంగా అన్ని ప్రాంతాల వాళ్లు- ఒక ప్రాంతానికి వ్యతిరేకం, ఇంకొక ప్రాంతానికి అను కూలం అని కాదు- ఒప్పుకోవాలి’’

దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement