సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం పైనే ఉందని సీఎంకె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఆరు దశాబ్దా లుగా నీళ్లు లేక తెలంగాణ తీవ్ర అన్యాయానికి గురైందని, దీన్ని సవరించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. కొత్తగా ఏర్పాటైన తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో సమన్యాయం జరిగేలా.. ప్రస్తుతమున్న ట్రిబ్యునల్‌తో నీటి కేటాయింపులు చేయించాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకునే సామ ర్థ్యాన్ని పెంచేలా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనులు... పునర్వ్యవస్థీకరణ చట్టానికి పూర్తి విరుద్ధంగా, తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసేలా ఉన్నాయని, ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని కోరారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ శుక్రవారం రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు 14 పేజీల లేఖ రాశారు. రాత్రి 11 గంటలకు ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖలో ఇంతవరకు కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మరోమారు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 6న అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగనున్న నేపథ్యంలో... సీఎం ముందుగానే లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ ప్రజల మనో నివేదనం..
కృష్ణా, గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరును, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని ఎండగడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా కేసీఆర్ లేఖ రాశారు. అత్యున్నతస్థాయి పాలనా యంత్రాంగం, జల వనరులశాఖ నిపుణులు, అధికారులతో కూడిన బృందం 48గంటలపాటు శ్రమించి సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ఉత్తరాన్ని రూపొందించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ, జాతీయ, అంతర్ రాష్ట్ర జలన్యాయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, 60 ఏండ్లుగా తెలంగాణకు జరిగిన అన్యాయాలను పునఃపరిశీలించి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఎత్తిచూపుతూ కేంద్రానికి ఈ లేఖను ఎక్కుపెట్టారు.
కేంద్రం తాత్సారం...
అంతర్ రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 సెక్షన్–3 కింద తెలంగాణ ఫిర్యాదును ఏడేండ్లుగా ట్రిబ్యునల్‌కు నివేదించకుండా కేంద్రం తాత్సారం చేయడాన్ని సీఎం కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు. కేంద్రం నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను తెలంగాణ ఇప్పటిదాకా పొందలేకపోయిందని, రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీని సుగమం చేసే బదులు.. కేంద్రం వైఖరి వివాదాలకు ఆజ్యం పోసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ ఫిర్యాదును సెక్షన్–3 క్రింద నివేదించాలని కేంద్రాన్ని కోరారు.
పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా జలాలను కృష్ణా బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు పెద్దఎత్తున తరలించుకుపోతుంటే కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఏం చేస్తున్నదని నిలదీశారు. పోతిరెడ్డిపాడును 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరించడాన్ని, రోజుకు 3 టీఎంసీలు తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటున్న చర్యలను కేఆర్‌ఎంబీ నిరోధించలేకపోవడాన్ని కేసీఆర్ ఈ లేఖలో ఎత్తిచూపారు.
పోతిరెడ్డిపాడును ఆపండి..
వాస్తవంగా పోతిరెడ్డిపాడు ద్వారా 11,150 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకే అనుమతి ఉంది. కానీ, ఏపీ కుట్రపూరితంగా దాని సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు పెంచిందని లేఖలో సీఎం కేంద్రం దృష్టికి తెచ్చారు. ఇదే అక్రమమంటే... దీన్ని 80వేల క్యూసెక్కులకు విప్తరించడం పూర్తిగా అక్రమం. శ్రీశైలం అట్టడుగు స్థాయి నుంచి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పనులను మొత్తంగా రూ.24 వేల కోట్లతో చేపట్టింది. వీటిపై కేంద్రం, బోర్డుకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. పనులను నిలుపుదల చేయడంలో బోర్డు విఫలమైంది. ఈ పనులను తక్షణమే ఆపాలని సీఎం కోరారు. 2019– 20వ ఏడాదిలో 179 టీఎంసీల కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా పెన్నా బేసిన్‌కు తరలించారు. ఇది పూర్తిగా అక్రమమైనా బోర్డు పట్టించుకోలేదు.
కావున తక్షణమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలి. పోతిరెడ్డిపాడు నుంచి అక్రమ నీటి తరలింపును ఆపడానికి కేంద్రం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీశైలం దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు అవసరమైన సాగునీటితో పాటు, హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చూడాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వాటా జలాల మేరకే ప్రాజెక్టులు చేపట్టామని, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది తెలంగాణ హక్కులను హరించడమేనని, కావున ఏపీ ప్రాజెక్టులను అంగీకరించమన్నారు. ఈ విషయంలో కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలన్నారు.
అవన్నీ పాతవే...
తెలంగాణ రాష్ట్రం గోదావరిపై నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడాన్ని ఈ లేఖలో కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించిన 967.94 టీఎంసీలలో నుంచే ఈ ప్రాజెక్టుల ద్వారా నీటిని వినియోగించుకుంటున్నామని, ఇవేవీ కొత్తవి కావని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదు, పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం సహా వారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై నుంచి దృష్టిని మరలించడానికి వేసిన ఎత్తుగడగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులేవీ కొత్తవి కావని, అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించినవేనని సీఎం కేసీఆర్ ఆధారాలతో సహా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment