సాక్షి, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల సూచనలు, సలహాలు తీసుకుని పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ దిశానిర్దేశం చేశారు.
తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని పది రోజుల్లోగా ఖరారు చేసి, పనులకు నిధుల సమస్య లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించి, గడువులోగా పూర్తి చేయడానికి ఈ సీజన్‌లో చేపట్టాల్సిన పనులను ఖరారు చేసేందుకు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
డ్యామ్ డిజైర్ రివ్యూ ప్యానల్ (డీడీర్పి) చైర్మన్ ఏబీ పాండ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ కుశీ్వందర్ సింగ్ వోరా, పీపీఏ చైర్మన్ శివ్‌నందన్‌కుమార్, సభ్య కార్యదర్శి రఘురాంతో పాటు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని వివరించారు.
నిపుణుల కమిటీ కోసం పీపీఏ టెండర్లు
ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య గోదావరి వరదల ఉద్ధృతికి కోతకు గురైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చేందుకు చేస్తున్న పనులను వివరించారు. ఒక స్టోన్ కాలమ్ 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండగా 2.30 గంటలు పడుతోందని, దీని వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు.
స్టోన్ కాలమ్స్ వేయడంలో సహకరించేందుకు, డిజైన్లను రూపొందించేందుకు వేస్తామన్న నిపుణుల కమిటీని ఇప్పటిదాకా నియమించలేదని రాష్ట్ర అధికారులు చెప్పారు. డయాఫ్రమ్ వాల్‌లో జాయింట్లను అతికించడంలో కూడా నిపుణుల సలహాలు, సూచనలు అవసరమన్నారు. డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్ వేయడంలో దేశంలో నిపుణుల కొరత ఉన్నందున, టెండర్ నోటిఫికేషన్ జారీ చేశామని పీపీఏ ఛైర్మన్ చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు కమిటీగా ఏర్పడి ఈ టెండర్‌లో పాల్గొంటారన్నారు.
ఆ టెండర్‌ను ఖరారు చేసి నిపుణుల కమిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆలోగా డయాఫ్రమ్ వాల్, స్టోన్ కాలమ్స్, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ నిర్మాణం సహా హెడ్ వర్క్స్‌లో చేయాల్సిన పరీక్షలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో చేయించి, నివేదిక సిద్ధంగా ఉంచాలని సీడబ్ల్యూసీ చైర్మన్ వోరా ఆదేశించారు. ఆ పరీక్షల కోసం స్వీడన్‌కు చెందిన ఆఫ్రిన్ అనే సంస్థతో కాంట్రాక్టు సంస్థ మేఘా ఇప్పటికే ఒప్పందం చేసుకుందని అధికారులు వివరించారు.
నిపుణుల కమిటీ సలహాతోనే డయాఫ్రమ్ వాల్
ఆఫ్రిన్ సంస్థ పరీక్షల నివేదిక ఆధారంగా పీపీఏ ఖరారు చేసే నిపుణుల కమిటీ స్టోన్ కాలమ్స్‌ను వేగంగా వేయడంపై సలహాలు ఇస్తుంది. ఆ పరీక్షల నివేదిక ఆధారంగా దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, దానికే మరమ్మతలు చేయాలా లేదంటే సమాంతరంగా కొత్త వాల్ నిర్మించాలా అనే అంశంపై సూచనలు చేయనుంది. వాటి ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకోనుంది. సీడబ్ల్యూసీ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్ వాల్ డిజైన్లను నిపుణుల కమిటీ రూపొందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment