
సాక్షి, అమరావతి : పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించేందుకు శుక్రవారం(25న) రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని నిపుణుల కమిటీ భేటీ కానుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై ఏర్పడిన గొయ్యిలను ఎలా పూడ్చాలి? గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్‌ను ఎలా నిర్మించాలనే అంశాలపై చర్చిస్తారు.
పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ సూచనల మేరకు ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఢిల్లీ–ఐఐటీలో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ వీఎస్ రాజు, జర్మనీకి చెందిన బావర్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర జలసంఘం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులకు పంపారు. ఈ వివరాల ఆధారంగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గొయ్యిలను పూడ్చే విధానం, గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు.
ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలపై 25న నిర్వహించే వర్చువల్ సమావేశంలో చర్చించి, డిజైన్లను కొలిక్కి తేనున్నారు. కొలిక్కి తెచ్చిన ఈ డిజైన్లపై ఈ నెల 28 లేదా 29న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నిపుణుల కమిటీ రూపొందించిన విధానాల్లో మెరుగైన పద్ధతిని ఖరారు చేసి.. దాని ప్రకారం గొయ్యిలను పూడ్చటం, ప్రధాన డ్యామ్‌ను నిర్మించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment