
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) ఈనెల 23న సమావేశమవుతోంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో పెండింగ్ డిజైన్లను సమీక్షించనుంది. క్షేత్రస్థాయి పర్యటన, సమీక్షల్లో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్లపై సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా డిజైన్ల ఆమోదంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకుంటుంది.
2018, 2019లలో గోదావరి వరద ఉధృతి వల్ల దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించే ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. వీటిని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై డీడీఆర్పీ భేటీలో చర్చిస్తారు. అత్యంత కీలకమైన ఈ రెండు డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదిస్తే.. పోలవరం జలాశయం పనులు మరింత వేగవంతమవుతాయి.