
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్ (పునాది)లో కోతకు గురైన కొంత భాగంలో డయాఫ్రమ్ వాల్, ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో పూడ్చాలని కేంద్ర జల్‌శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన కొంత భాగాన్ని, పోలవరం ప్రాజెక్టుకు దిగువన గోదావరి ఎడమ గట్టు (పురుషోత్తపట్నం గట్టు), కుడి గట్టు (పోలవరం గట్టు)లను పటిష్టం చేసే డిజైన్లను కొలిక్కి తెచ్చేందుకు వారంలోగా మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. ఈనెల 4న కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
డిజైన్లను పీపీఏ, సీడబ్ల్యూసీ సకాలంలో ఆమోదించకపోవడంతో పోలవరం పనుల్లో జాప్యం జరుగుతోందని సీఎం వైఎస్ జగన్ కేంద్ర మంత్రి షెకావత్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన షెకావత్.. పక్షం రోజుల్లోగా పెండింగ్ డిజైన్లను ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని సలహాదారు వెదిరె శ్రీరాంను ఆదేశించారు. పెండింగ్ డిజైన్లను కొలిక్కితేవడమే అజెండాగా గురువారం ఢిల్లీలో వెదిరె శ్రీరాం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ సర్కార్ గోదావరి వరదను మళ్లించేలా పోలవరం స్పిల్ వేను నిర్మించకుండానే.. ఈసీఆర్‌ఎఫ్ డయాఫ్రమ్ వాల్, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని చేపట్టి మధ్యలోనే వదిలేసింది.
2019, 2020లలో గోదావరి వరద ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఖాళీ ప్రదేశాల ద్వారా ప్రవహించింది. ఆ వరద ఉధృతికి దిగువ కాఫర్ డ్యామ్‌లో 440 మీటర్ల నుంచి 660 మీటర్ల వరకు 220 మీటర్ల పొడవు, 36 మీటర్ల లోతు మేర కోతకు గురైంది. కోతకు గురైన ప్రాంతాన్ని డయాఫ్రమ్ వాల్ నిర్మించి, ఇసుకతో నింపి, డెన్సిఫికేషన్ (సాంద్రీకరణ) చేస్తూ పూడుస్తామని ఈఎన్‌సీ నారాయణరెడ్డి ప్రతిపాదించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మించడంతోపాటు ఇసుక, జియోమెంబ్రేన్ బ్యాగ్‌లతో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చాలని డీడీఆర్పీ చైర్మన్, సభ్యులు చేసిన ప్రతిపాదనకు సలహాదారు వెదిరె శ్రీరాం ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment