సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ తరలింపు పనులపై ఏపీ ప్రభుత్వం మరోసారి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్ ద్వారా గోదావరి జలాల్లో వాటాలు తేలే వరకు లేదా నీటి వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరే వరకు ఈ పనులకు ఎలాంటి అనుమతులు జారీ చేయరాదని డిమాండ్ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రోజుకు రెండు టీఎంసీల గోదావరి జలాలను తరలించే పనులకు 2018 జూన్ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. నీటి వాటాలు తేలేదాకా ఆ అనుమతులను పునఃసమీక్షించడంతో పాటు మూడో టీఎంసీ పనులకు అనుమతి ఇవ్వొద్దని కోరింది.
ఈ మేరకు ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తాజాగా గోదావరి బోర్డు చైర్మన్ ఎంకే సిన్హాకు లేఖ రాశారు. వాటాలు తేలకుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ)ను కేంద్రం ఏర్పాటు చేయాలని ఏపీ కోరింది.
డీపీఆర్‌ల పరిశీలనకు సుప్రీం అనుమతి నేపథ్యంలో లేఖ...
కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపు పనులకు పర్యావరణ అనుమతి లేకపోవడంతో గతంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ఆ ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలనను గోదావరి బోర్డు ఆపేసింది. డీపీఆర్ పరిశీలనకు గోదావరి బోర్డుకు ఇటీవల సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment