హైదరాబాద్: నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణ కేంద్రంగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర కొత్వాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికే పలువురు పోలీసు సిబ్బంది ఈ బాధ్యతలు చేపట్టారు. సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, దారి తీసే మార్గాలనూ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోనున్నారు. శుక్రవారం నుంచే ప్రముఖులు వస్తుండటంతో అటు శంషాబాద్ విమానాశ్రయంతో పాటు తాజ్ కృష్ణ పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు.
శాంతిభద్రతల విభాగంతో పాటు నగర భద్రత విభాగం, ట్రాఫిక్ వింగ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా పని చేస్తున్నారు. హోటల్‌లో బస చేసి ఉన్న వారి జాబితాలను సేకరించిన పోలీసులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన గలాభా నేపథ్యంలో మరింత అప్రమత్తయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజ్ కృష్ణతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోకి కేవలం అధీకృత వ్యక్తులనే అనుమతించాలని నిర్ణయించారు.
ప్రతి రోజూ మూడు నాలుగు సార్లు అణువణువూ బాంబు నిర్వీర్యం బృందాలు, స్నిఫర్ డాగ్స్ తనిఖీ చేయనున్నారు. ఇద్దరు డీసీపీ స్థాయి అధికారుల నేతృత్వంలో ఇద్దరు అదనపు డీసీపీలు, నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లు, 25 మంది సబ్–ఇన్‌స్పెక్టర్లు, 13 మంది ఏఎస్సైలు, 110 మంది కానిస్టేబుళ్ళు, నాలుగు ప్లటూన్ల సాయుధ బలగాలు మూడు షిఫ్టులో విధులు నిర్వర్తిస్తాయి. వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది సైతం అవసరమైన సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
సీడబ్ల్యూసీకి సిటీ ముస్తాబు
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో తరలివస్తున్న అతిరథ మహారథులకు నగరం స్వాగతం పలుకుతోంది. సమావేశాల వేదిక తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లే మార్గాలను సుందరంగా అలంకరించిన పార్టీ నాయకత్వం.. భారీ కటౌట్లు, జెండాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తింది. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో శని, ఆదివారాల్లో జరగనున్న భేటీకి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, ఖర్గే సహా అధినాయకత్వమంతా హాజరు కానుంది. పార్టీ రథ సారథులు నగరానికి కదిలి వస్తుండటంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాగా.. నగర శివారు తుక్కుగూడ వేదికగా జరిగే విజయభేరి సభకు నగర శివారు ప్రాంతాలు సైతం భారీగా ముస్తాబవుతున్నాయి. విజయభేరి బహిరంగ సభకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా జనసమీకరణకు పార్టీ కసరత్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment