సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణకు ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో అనుమతి లభించదనే అంచనాలతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయా లను పరిశీలిస్తోంది. పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు అనుమతివ్వాలని ఈనెల 2వ తేదీనే దరఖాస్తు చేసినప్పటికీ బీజేపీ నేతలు అమిత్‌షా సభ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం లేదంటే ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) పరి సరాల్లోని ఖాళీ స్థలం ఎంచుకుని అక్కడ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు.
తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించాలనే వ్యూహంతో పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ, అక్కడ ఇప్పటివరకు అనుమతి లభించని కారణంగా మరో స్థలం వెతికే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. సభ ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీడబ్ల్యూసీకి సిద్ధం
మరోవైపు, ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేసింది. ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా టీపీసీసీ నిర్ణయించింది. గతంలో తిరుపతిలో నిర్వహించిన ప్లీనరీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు గాను పకడ్బందీగా ముందుకెళుతోంది.
ఇందుకోసం మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇన్‌చార్జి ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, రాష్ట్ర నాయకులు మధుయాష్కీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించేందుకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం చేయనున్నారు.
నేడు కీలక భేటీ
ఇక, టికెట్ల ఖరారులో భాగంగా రాష్ట్రస్థాయిలో జరిగే కసరత్తుకు నేడు తెరపడనుంది. బుధవారం గాంధీభవన్ వేదికగా పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, మేవానీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. వీరంతా సమావేశమై పీఈసీ సమావేశంలో వచ్చిన నివేదికలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన అభ్యర్థుల తుది జాబితాను ఢిల్లీకి పంపనున్నారు.
అయితే, స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి ఈనెల 7వ తేదీనే పంపనున్నట్టు తెలుస్తోంది. అనంతరం సీఈసీ సమావేశమై అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. మొత్తంమీద గత 20 రోజులుగా పార్టీ అభ్యర్థిత్వాల కోసం జరుగుతున్న కాంగ్రెస్ కసరత్తు బుధవారం నాటితో రాష్ట్ర స్థాయిలో ముగియనుంది. మరోవైపు బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం కూడా నేడు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమా వేశంలో బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన హామీలను ఖరారు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment