సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి వెళ్లాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 3 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. గురువారం అసెంబ్లీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన అనంతరం ఢిల్లీ వెళ్లేలా ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కారణంగానే ఇదే రోజు జరగాల్సిన కలెక్టర్ల సదస్సు కూడా వాయిదా వేశారు. అందుకు అనుగుణంగా ఉదయం తన నివాసంలోనే సాగునీటి శాఖపై రివ్యూ చేశారు.
కానీ, అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేవంత్ షెడ్యూల్ మారిపోయింది. విద్యుత్‌పై చర్చ సందర్భంగా వాడీవేడిగా సభ సాగడంతో ఆయన అసెంబ్లీలోనే ఉండిపోయారు. ఒక దశలో సీఎం జోక్యం చేసుకొని విద్యుత్ ఒప్పందాలపై న్యాయ విచారణ చేస్తామని ప్రకటన కూడా చేశారు. ఈ ప్రకటన పూర్తయిన తర్వాత రేవంత్ ఢిల్లీ వెళతారనే చర్చ అసెంబ్లీ లాబీల్లో జరిగినా, సీఎం ఢిల్లీకి బయలుదేరలేదు.
అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను సీడబ్ల్యూసీకి రాలేనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌కు చెప్పి ఢిల్లీ పర్యటన విరమించుకున్నారని సమాచారం. అయితే సీడబ్ల్యూసీ సమావేశానికి ఎందుకు వెళ్లలేదన్న అంశం అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది.
కారణమేంటి?
సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లకపోవడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండడమే కారణమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బుధ, గురువారాల్లో రెండు కీలక అంశాలపై ప్రభు త్వం శ్వేతపత్రాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం సభలో లేకుండా పార్టీ సమావేశానికి వెళితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేని కారణంగానే సీఎం సభలో లేకుండా వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఎత్తిపొడిచే అవకాశం వచ్చి ఉండేదని, దీనికి తోడు కీలక రంగాలపై చర్చ జరుగుతున్న సందర్భంగా సీఎం సభలో లేకపోతే అధికార పక్షానికి కూడా సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందనే కారణంతోనే రేవంత్ ఢిల్లీ వెళ్లలేదని ప్రభుత్వ, పార్టీ వర్గాలంటున్నాయి.
అయితే, కేవలం అసెంబ్లీ సమావేశాలే కాదని, మరో ముఖ్యమైన పనిలో ఉన్న కారణంగానే సీఎం ఢిల్లీ వెళ్లలేదనే చర్చ కూడా జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో మంత్రి ఉత్తమ్ కూడా రేవంత్‌రెడ్డితో చాలా సేపు అసెంబ్లీ లాబీల్లోని సీఎం చాంబర్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ తర్వాతే రేవంత్ తన టూర్ రద్దు చేసుకున్నారనే చర్చ కూడా జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment