బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడయ్యే పూర్తి అర్హతలు దేశం మొత్తమ్మీద రాహుల్ గాంధీకి మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగేలా ఆయనను ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా, పశ్చిమబెంగాల్ నుంచి గుజరాత్‌దాకా దేశమంతటా పార్టీకి అధ్యక్షుడిగా సమ్మతి సంపాదించే ఏకైక వ్యక్తి రాహులే. ఆయన చరిష్మాతో సరిపోలే వ్యక్తి మరొకరు లేరు. ఇంకెవరైనా ఉన్నారేమో మీరే చెప్పండి’ అన్నారు.
‘‘పార్టీ కోసం, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీపై పోరాటం కోసం, దేశ సమైక్యత కోసం అధ్యక్ష పదవికి రాహుల్‌ను ఒప్పిస్తామన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ తేదీలను ఆదివారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ భేటీలో ఖరారుచేయనున్నారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటినుంచి ఆ బాధ్యతలను తాత్కాలిక హోదాలో సోనియాగాంధీ
నిర్వర్తిస్తున్నారు.
తేదీలు ఖరారుకు నేడు సీడబ్ల్యూసీ భేటీ
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తేదీని ఖరారు చేయడానికి సీడబ్ల్యూసీ సోమవారం సమావేశం కానుంది. ఆజాద్ రాజీనామా, రాహుల్‌పై ఆయన తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంపై సభ్యులంతా విశ్వాసం ప్రకటించే అవకాశముంది. భేటీలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. వైద్య పరీక్షల సోనియా అమెరికా వెళ్లడం తెలిసిందే. రాహుల్, ప్రియాంక కూడా ఆమె వెంట వెళ్లారు అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ కొద్ది వారాలు ఆలస్యమవుతుందని, అక్టోబర్ నాటికి పూర్తి స్థాయి అధ్యక్షుడు పగ్గాలు చేపడతరాని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మొదలు కానుండడంతో అధ్యక్ష ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరుగుతాయని ఆ వర్గాలు వివరించాయి.
ఆజాద్‌వి తప్పుడు వ్యాఖ్యలు: పైలట్
న్యూఢిల్లీ: సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరస పరాజయాలకు రాహుల్ గాంధీ ఒక్కడినే బాధ్యున్ని చేయడం సరికాదని ఆ పార్టీ నేత సచిన్ పైలట్ అన్నారు. పార్టీని వీడుతూ, రాహుల్‌పై ఈ మేరకు గులాం నబీ ఆజాద్ చేసిన విమర్శలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆజాద్ లేఖను వ్యక్తిగత దూషణాస్త్రంగా అభివర్ణించారు. ‘‘బీజేపీ దుష్పాలనపై ‘భారత్‌జోడో యాత్ర’ పేరిట కాంగ్రెస్ పోరుబాట పడుతున్న తరుణంలో సొంత పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూ రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని ఆజాద్ లేఖ రాయడం అత్యంత విచారకరం’’ అని శనివారం వ్యాఖ్యానించారు. ‘ఐదు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో ఆజాద్ వేర్వేరు హోదాలను అనుభవించి, పార్టీకి అవసరమైన కీలక సమయంలో నిష్క్రమించడం, నిందించడం
దారుణం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment