సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కార్ ఉల్లంఘనలకు అంతులేకుండా పోతోంది. నిబంధనలను మళ్లీ యథేచ్ఛగా బేఖాతరు చేస్తూ ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. గతేడాది అవసరం లేకున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో నీటినిల్వ కనీస మట్టం కంటే దిగువన ఉన్నప్పుడే ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేసి.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా కడలిపాలు చేసింది.
ఈ ఏడాది కూడా అదే రీతిలో నీటి దోపిడీ చేస్తోంది. కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపేసిన తెలంగాణ సర్కార్.. ఏఎమ్మార్పీ ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తోంది. ఈ వ్యవహారంపై కృష్ణా బోర్డుకు కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి.. ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ శ్రీనివాసరెడ్డిలు ఫిర్యాదు చేశారు.
వరద వస్తున్నా పెరగని నీటిమట్టం
శ్రీశైలంలో సాగు, విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయించింది. కృష్ణా బోర్డు రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ దాన్ని ఆమోదించింది. నీటి సంవత్సరం ప్రారంభమైన రోజునే అంటే ఈనెల 1న స్థానికంగా కురిసిన వర్షాలవల్ల శ్రీశైలంలోకి 862 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటి నిల్వ 816.8 అడుగుల్లో 38.63 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో..
► కృష్ణా బోర్డు నుంచి కనీసం అనుమతి తీసుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ ఈనెల 1న 800 క్యూసెక్కులను తరలించింది.
► ఈనెల 2న 561 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 483 క్యూసెక్కులను తరలించింది.
► ఈనెల 9న శ్రీశైలంలోకి 4,618 క్యూసెక్కులు చేరితే.. 339 క్యూసెక్కులను..
► ఈ నెల 10న 2,798 క్యూసెక్కులు చేరితే 1,300 క్యూసెక్కులను.. 11న 4,157 క్యూసెక్కులు చేరితే.. 1,266 క్యూసెక్కులను తెలంగాణ తరలించింది.
► తెలంగాణ దోపిడీతో శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతున్నా నీటి మట్టం పెరగడంలేదు.
సాగర్ కుడి కాలువ నీరు నిలిపివేత
ఇక నాగార్జునసాగర్‌లో సాగునీటికి కనీస నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం 534.9 అడుగుల్లో 177.87 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువపైనే అవి ఆధారపడతాయి. ఈ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది.
తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లా సీఈ శ్రీనివాసరెడ్డి కృష్ణా బోర్డుకు, సాగర్ సీఈకి లేఖ రాశారు. కానీ.. ఈనెల 1 నుంచి కుడి కాలువకు నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది.
మరోవైపు.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఈనెల 1న 2,000, 2న 2,000, 3న 218, 6న 218, 7న 500, 8న 500, 9న 854, 10న 1,000, 11న 1,000 క్యూసెక్కుల చొప్పున ఏఎమ్మార్పీ నుంచి తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తోంది. ఈ అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని కర్నూల్ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరామని తెలిపారు.
శ్రీశైలం నీటిని తోడేస్తున్న తెలంగాణ
Published Mon, Jun 13 2022 4:20 AM | Last Updated on Mon, Jun 13 2022 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment