
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ‘స్క్రీనింగ్’ పరీక్ష మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయడం కత్తి మీద సాములా మారిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుమారు 70 నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఆశావహులు పోటీ కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. ఆయా చోట్ల గెలవగలిగేవారిని గుర్తించడంపై కీలక నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మంగళవారం జరగనున్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశం కీలకంగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట అభ్యర్థుల ఎంపికకు, తిరస్కరణకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు, ఏ ప్రాతిపదికలను అనుసరిస్తారన్నది రాష్ట్ర కాంగ్రెస్ కేడర్‌లో చర్చనీయాంశంగా మారింది.
ముగ్గురి చొప్పున ఎంపిక చేసి..
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన నేపథ్యంలో.. వాటిని వడపోసేందుకు ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) మంగళవారం సమావేశం అవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా దరఖాస్తులను పరిశీలించి.. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురి పేర్లను, సమస్యాత్మకంగా ఉన్న చోట్ల గరిష్టంగా ఐదుగురి పేర్లను ఎంపిక చేయనుంది.
పీఈసీ సమావేశం ముగిశాక వీలైనంత త్వరగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించి.. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి రెండు లేదా మూడు పేర్లను ఖరారు చేయనున్నారు. అనంతరం ఆశావహుల జాబితాను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపిస్తారు. ఆ కమిటీ సమావేశమై ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి పేరును ఎంపిక చేస్తుంది. ఈ జాబితాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి పంపుతుంది.
సీడబ్ల్యూసీ ఆమోదం లభించాక అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తామని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు 15–20 రోజుల వరకు ఱసమయం పడుతుందని.. సెప్టెంబర్ మూడో వారానిల్లా తొలి విడత జాబితా వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. మరోవైపు అభ్యర్థుల ప్రకటన వచ్చే లోగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. సెప్టెంబర్ 17న పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అవుతుందని, ఆ తర్వాత అభ్యర్థుల తొలి జాబితా ఉంటుందని చెప్తున్నాయి.
నాయకత్వ లేమి ఎఫెక్ట్!
అభ్యర్థిత్వం కోసం 10–12 నియోజకవర్గాల్లో గరిష్టంగా రెండు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. కొడంగల్, మధిర, హుజూర్‌నగర్, మంథని, సంగారెడ్డి వంటి నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. అంటే పార్టీ కీలక నేతలున్న చోట్ల దరఖాస్తులు పెద్దగా రాలేదు. ఇప్పుడు ఇదే ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సభ్యులకు సవాల్‌గా మారనుంది. భారీగా దరఖాస్తులు వచ్చిన చోట్ల మూడే పేర్లను మాత్రమే సూచించాల్సి ఉంటుంది. వారి నుంచే అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.
అయితే మిగతా దరఖాస్తుదారులను ఏ ప్రాతిపదికన తిరస్కరిస్తారు? ఎంపి చేసే ముగ్గురిని ఏ కారణాలతో ఓకే చేస్తారన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీపీసీసీ కీలక నేత ఒకరు మాట్లాడుతూ ‘‘దరఖాస్తులు ఎక్కువ ఉన్నాయని, పార్టీలో ప్రజాస్వామ్యం బాగున్నందునే ఇన్ని దరఖాస్తులు వచ్చాయనేది పైకి చెప్పుకునే మాట. కానీ 70 స్థానాల్లో విచ్చలవిడిగా దరఖాస్తులు వచ్చాయంటే.. అక్కడ నాయకత్వ లేమి ఉందని, నియోజకవర్గ స్థాయిలో ప్రభావితం చూపేవారు సరిగా పనిచేయడం లేదని అర్థమవుతోంది. ఈ ప్రతికూల పరిస్థితులను పీఈసీ సమావేశం ఎలా గట్టెక్కిస్తుందో చూడాలి’’ అని పేర్కొనడం గమనార్హం.
అసలు టాస్క్ మొదలు
కాంగ్రెస్ అభ్యర్థుల కోసం దరఖాస్తుల స్వీకరణ సాగిన తీరును పరిశీలిస్తే.. మంగళవారం జరిగే పీఈసీ సమావేశంలో దరఖాస్తుల షార్ట్‌లిస్ట్ ప్రక్రియ పెద్ద టాస్క్ కానుందని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 18 నుంచి 25 వరకు జరిగిన దరఖాస్తుల స్వీకరణలో మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 1,016 దరఖాస్తులు వచ్చాయి. వీటిని జిల్లాలు, నియోజకవర్గాల వారీగా విభజించి చూస్తే.. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి, నియోజకవర్గ స్థాయిలో స్పష్టతలేని చోట్ల నుంచి, సరైన నాయకత్వం లేనిచోట్ల నుంచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్టు తేలింది.
కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గానికి ఏకంగా 38 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. గోషామహల్‌లో 19 రాగా.. అశ్వారావుపేట, సనత్‌నగర్, మిర్యాలగూడ, సికింద్రాబాద్ వంటి చోట్ల కూడా ఎక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాలు 70 వరకు ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment