సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు ప్రక్రియలో ‘సర్వే’ల అంశంతో పీటముడి పడుతోంది. సర్వేల ప్రాతిపదికగానే టికెట్లు కేటాయిస్తామని ఏఐసీసీ, టీపీసీసీ నేతలు ముందునుంచీ చెప్తూనే ఉన్నా.. అలా చేస్తే ఇబ్బందికరమేనన్న వాదన పార్టీ నేతల్లో వినిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీలో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో 60 స్థానాలపై ఏకాభిప్రాయం వచ్చిందని, ఆయా స్థానాల్లో ఒక్కో పేరునే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి పంపాలని నేతలు నిర్ణ యించారు.
మరో 30–35 సీట్లపై ఏకాభిప్రాయం రాలేదు. ఈ స్థానాల్లో సర్వేల్లో వెల్లడైన బలాబలాల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేయాలని కొందరు నేతలు ప్రతిపాదించగా.. ఈ ప్రతిపాదన సరికాదని మరికొందరు నేతలు పేర్కొంటున్నట్టు తెలిసింది. కొత్తగా వచ్చిన నాయకులను సర్వేల ఆధారంగా కొన్నిచోట్ల మాత్రమే ఖరారు చేయవచ్చని, మిగతా చోట్ల సర్వేలతోపాటు పార్టీకి విధేయత, ఇతర కోణాలనూ సరిచూసుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని కోరినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో సర్వేలను పునఃపరిశీలించడంతోపాటు ఆశావహు లతో మాట్లాడి, టికెట్లు ఇవ్వలేని నేతలను బుజ్జగించేందుకు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే ఈనెల 25న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఆ భేటీ ముగిశాక ఈ నెల 28న లేదా 29న స్క్రీనింగ్ కమిటీ మరోమారు భేటీ అవుతుందని, అది ఢిల్లీలోనే జరిగే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ భేటీ తర్వాత మెజార్టీ స్థానాలపై ఏకాభిప్రాయం తీసుకుని, సీఈసీ ఆమోదంతో ఒకేసారి జంబో జాబితా విడుదల చేస్తామని అంటున్నాయి. కొంత ఆలస్యమైనా ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడమే మేలనే అభిప్రాయంతో ఏఐసీసీ పెద్దలు ఉన్నారని వివరిస్తున్నాయి. ఈ క్రమంలో జాబితాల విడుదల వాయిదా పడే అవకాశమూ ఉందని పేర్కొంటున్నాయి. ఇక కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న నేతలు ఢిల్లీలో నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
ప్యారాచూట్లకు టికెట్లా?
స్క్రీనింగ్ కమిటీలో జరిగిన చర్చ ప్రకారం ప్యారాచూట్లకు ఈసారి కూడా పెద్ద సంఖ్యలోనే టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపై కాంగ్రెస్‌లోని సీనియర్ ఆశావహులు రగిలిపోతున్నారు. ప్యారాచూట్లకు టికెట్లు ఇవ్వబోమని, పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమిస్తామని అగ్రనేత రాహుల్‌గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్న తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఉప్పల్, గద్వాల, దుబ్బాక, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్ సహా పలుచోట్ల ప్యారాచూట్లకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి సర్వేలు ఎలా అనుకూలంగా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలంగా ఉండటంతోనే సర్వేలు అనుకూలంగా చూపుతున్నాయని.. అందువల్ల పార్టీలో ముందునుంచీ ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
వీరేశం చేరిక వాయిదా!
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరే కార్యక్రమం వాయిదా పడింది. ఆయన శనివారమే రాహుల్ లేదా ఖర్గే సమక్షంలో పార్టీలో చేరుతారని భావించారు. కానీ ఆ ఇద్దరు నేతలు అందుబాటులో లేనందున వీరేశంతోపాటు వెళ్లిన ఆయన ప్రధాన అనుచరులు మాత్రం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
అయితే ఈనెల 29న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరేశంతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం.
అవకాశాన్ని బట్టి అగ్రనేతలు అందుబాటులో ఉంటే ఢిల్లీలోనే చేరికల కార్యక్రమం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కాగా వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ సంపత్ కుమార్, వ్యాపారవేత్త పి.శ్రీనివాస్‌రెడ్డి తదితరులు శనివారం ఢిల్లీలో రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
కాంగ్రెస్‌లో ‘సర్వే’ల పీటముడి!
Published Sun, Sep 24 2023 1:51 AM | Last Updated on Sun, Sep 24 2023 6:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment