సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ హ్యాండోవర్ చేసుకుందా? ఈసారి తెలంగాణలో గెలుపు అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయా? రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నామన్న భావన కల్పిస్తూనే చేయాల్సిందంతా అధిష్టానమే చేస్తోందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని తాజా పరిణామాలను గమనిస్తే.. అవుననే సమాధానమే వస్తోంది.
పార్టీ కమిటీల ఏర్పాటు నుంచి టికెట్ల కేటాయింపు వరకు అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే జరిగేలా ప్రణాళిక అమలవుతోందని, ఇటీవలి అన్ని పరిణామాలు టీపీసీసీకి పూర్తిస్థాయిలో సమాచారం లేకుండానే జరిగాయనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పుట్టి ముంచుతాయనే అభిప్రాయానికి వచ్చిన టెన్ జన్‌పథ్ వర్గాలు పూర్తిస్థాయిలో తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయని, అప్పుడప్పుడూ బెంగళూరు నుంచి అందే సంకేతాలు కూడా ఏఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు.
రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే..
రాష్ట్రాల్లోని ఇతర పార్టీల విషయంలో అవలంబించాల్సిన వైఖరిపై జాతీయ పార్టీలు సాధారణంగా ఆయా రాష్ట్రాల్లోని పార్టీ నేతల అభిప్రా యాలు తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కానీ వైఎస్సార్‌టీపీ నేత షర్మిలతో చర్చలు, వచ్చే ఎన్ని కల్లో కమ్యూనిస్టు పార్టీలతో పొత్తుల గురించి ఢిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్ర పార్టీ నేతలకు తెలియడం గమనార్హం. షర్మిల బెంగళూరులో డి.కె.శివకుమార్‌ను కలిసినప్పటి నుంచే ఆమె కాంగ్రెస్‌లో చేరతారన్న దానిపై ఊహాగానాలు సాగినప్పటికీ, దీనిపై నామమాత్రంగా కూడా రాష్ట్ర పార్టీ నేతలతో ఢిల్లీ పెద్దలు చర్చించకపోవడం గమనార్హం.
మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములైన సీపీఐ, సీపీఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా రాష్ట్ర పార్టీ అభిప్రాయంతో పనిలేకుండా ఏఐసీసీయే రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఠాక్రే కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపిన తర్వాతే విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసింది. ఇటీవల జరిగిన సంస్థాగత కమిటీల ఏర్పాటు విషయంలో కూడా తెలంగాణ నాయకత్వానికి తెలియకుండానే నిర్ణయాలు జరిగిపోవడం గమనార్హం.
పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్న దానిపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఫలానా నేతను టీపీసీసీ సిఫారసు చేసిందనే సమాచారం కూడా బయటకు వచ్చింది. కానీ ఎన్నడూ చర్చ జరగని ఇద్దరు నేతలకు అనూహ్యంగా సీడబ్ల్యూసీలో చోటు దొరికింది.
తమ పేర్లు ఎందుకు రాలేదా అని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు ఆరా తీస్తున్న సమయంలోనే వారికి మరో షాక్ తగిలింది. కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)ని ప్రకటించిన అధిష్టానం రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండానే తెలంగాణ నుంచి ఒకరికి అవకాశం కల్పించింది. అంతకంటే ముందు ఏర్పాటు చేసిన పార్టీ స్క్రీనింగ్ కమిటీలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతతో పాటు మరో నేతను నియమించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
‘సీడబ్ల్యూసీ’పై పీఈసీలో తీర్మానం!
గతంలో ఎన్నడూ లేని విధంగా సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణ విషయంలోనూ అధిష్టానమే నిర్ణయం తీసుకుని టీపీసీసీకి సమాచారం ఇచ్చిందని అంటున్నారు. ఆ సమాచారం మేరకే సీడబ్ల్యూసీ సమావేశాలతో ఎలాంటి సంబంధం లేని ప్రదేశ్ ఎన్నికల కమిటీ (పీఈసీ) సమావేశంలో.. సీడబ్ల్యూసీ సమావేశాలు రాష్ట్రంలో నిర్వహించాలనే తీర్మానం చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఈ తీర్మానం తర్వాత ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఒకసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సమావేశాల నిర్వహణపై ఆరా తీశారు.
ఆ తర్వాత ఉన్నట్టుండి సీడబ్ల్యూసీ సమావేశాల షెడ్యూల్‌ను ఏఐసీసీ ప్రకటించింది. అలాగే ఈనెల 18న సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్న విషయాన్ని కూడా నేరుగా అధిష్టానమే ప్రకటించింది. కేవలం సోనియాగాంధీ పాల్గొనే సభ, ఆ సభలో ప్రకటించాల్సిన ఐదు గ్యారంటీ కార్డు స్కీంల గురించి మాత్రమే టీపీసీసీకి ముందస్తు సమాచారం ఉందని, మిగిలిన అంశాల్లో ఏఐసీసీ నిర్ణయం తీసుకుని టీపీసీసీకి చేరవేసిందనే చర్చ జరుగుతోంది.
ఎందుకిలా?
తెలంగాణ వ్యవహారాలను పూర్తిగా అధిష్టానం టేకోవర్ చేయడంపై గా>ంధీభవన్ వర్గాల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ నేతల మధ్య పాతుకుపోయిన అనైక్యత ఇప్పట్లో సర్దుకునే అవకాశం లేదనే భావనతోనే ఏఐసీసీ రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పరిణామంపైనా తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలపై హస్తినలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే టీపీసీసీకి సమాచారం ఇస్తున్నారని కొందరు నేతలు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు గొడవలు, భిన్నాభిప్రాయాలు సహజమే అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవి తారస్థాయికి చేరాయని, ఎన్నికల్లో గెలుపు అంచనాలున్న పరిస్థితుల్లో తాము రంగంలోకి దిగడమే మంచిదనే నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలో జరుగుతున్న ప్రతి చిన్న పరిణామంపైనా ఢిల్లీకి నివేదికలు వెళుతున్నాయని, ఈ నివేదికల నేపథ్యం కూడా ఏఐసీసీ ఆజమాయిషీకి కారణమని తెలుస్తోంది.
రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే.. అంతా హైకమాండ్ కంట్రోల్‌లోకి..
Published Tue, Sep 12 2023 1:27 AM | Last Updated on Tue, Sep 12 2023 3:35 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment