
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో ఈ యాత్రను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా ఇందులో కలసి పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖరారు కోసం బుధ, గురువారాల్లో స్క్రీనింగ్ కమిటీ భేటీ జరపాలని టీపీసీసీ నిర్ణయించింది.
ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో భాగంగా స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన ఎంపీలు ఉత్తమ్, రేవంత్ ఢిల్లీలోనే ఉండటంతో.. అక్కడే రెండు రోజుల పాటు కసరత్తు పూర్తి చేసి.. అభ్యర్థుల షార్ట్ లిస్ట్ జాబితాను ఏఐసీసీకి ఇవ్వాలని భావించారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన ఓటింగ్ ప్రక్రియతో ఎంపీలు ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. వారు లోక్‌సభ నుంచి వచ్చాక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు ఠాక్రే, భట్టి తదితరులతో కలసి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బీఆర్‌ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టాలని తీర్మానించారు. అక్టోబర్ తొలివారంలో మొదలుపెట్టి, 10–12 రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టాలని.. యాత్ర రూట్‌మ్యాప్, షెడ్యూల్‌ను త్వరలో ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇక గురువారం తిరిగి స్క్రీనింగ్ కమిటీ సమావేశమై అభ్యర్థుల ఖరారు కసరత్తు పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.
కమిటీలోకి మరో ఇద్దరు..
స్క్రీనింగ్ కమిటీలోకి మరో ఇద్దరు నాయకులను తీసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలను స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా నియమించినట్టు గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment