సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లుగా ఖరారు చేస్తూ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) పంపిన ప్రతిపాదనను మదింపు చేసి సోమవారం కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇస్తామని రివైజ్డ్ కాస్ట్ కమిటీ (ఆర్‌సీసీ) చైర్మన్ ఏఎస్ గోయల్ మంగళవారం తెలిపారు.
ఆ నివేదిక ఆధారంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు (పీఐబీ)కి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపుతుంది. పీఐబీ ఆమోద ముద్ర వేస్తే సవరించిన అంచనా వ్యయం మేరకు పోలవరం తొలి దశ పనులకు తాజా ధరల మేరకు కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది.
మూడో సారి సమావేశమైన ఆర్‌సీసీ
తొలి దశ అంచనా వ్యయంపై సీడబ్ల్యూసీ ప్రతిపాదనను మదింపు చేసేందుకు ఆర్‌సీసీ ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. మంగళవారం ఢిల్లీలో మూడోసారి సమావేశమైంది. ఆర్‌సీసీ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ కమిషనర్ (ఎస్పీర్) ఏఎస్ గోయల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన సీడబ్ల్యూసీ(పీపీవో) పుష్కర్‌సింగ్ కుతియాల్, కేంద్ర ఆర్థిక శాఖ (వ్యయ విభాగం) ప్రధాన సలహాదారు రిచా మిశ్రా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్య కార్యదర్శి రఘురాం, సీడబ్ల్యూసీ సీఈ (పీఏవో) యోగేష్ పైతంకర్ పాల్గొన్నారు.
పోలవరం సీఈ సుధాకర్‌బాబు ప్రత్యేక ఆహా్వనితుడిగా పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ సవరించిన అంచనా వ్యయం రూ.31,625.36 కోట్లని, ఇందులో రూ.16,119.56 కోట్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని రఘురాం వివరించారు. ఇంకా రూ.15,505.80 కోట్ల విలువైన పనులు మిగిలాయని తెలిపారు. తొలి దశ పనులకు రూ.12,911.15 కోట్లు మంజూరు చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారని ఆ శాఖ ప్రధాన సలహాదారు రిచా మిశ్రా గుర్తు చేశారు.
తొలి దశ పనుల పూర్తికి మంత్రి ఆమోదించిన వ్యయంకంటే అదనంగా రూ.2,594.65 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ తేల్చిందన్నారు. తొలి దశ పనులకు 2013–14 ధరల ప్రకారం ఎంత అవసరం, 2017–18 ధరల ప్రకారం ఎంత అవసరమన్నది మరింత విపులంగా శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment