పోలవరం తొలిదశకు లైన్‌ క్లియర్‌ | CWC Approval For Polavaram initial stage works | Sakshi
Sakshi News home page

పోలవరం తొలిదశకు లైన్‌ క్లియర్‌

Published Wed, Apr 6 2022 3:39 AM | Last Updated on Wed, Apr 6 2022 3:39 AM

CWC Approval For Polavaram initial stage works - Sakshi

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులను పూర్తిచేస్తే.. ఖరీఫ్‌లో కుడి, ఎడమ కాలువల ద్వారా గ్రావిటీపై 2.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించవచ్చునన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనతో కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఏకీభవించింది. కుడి కాలువ ద్వారా మళ్లించే నీటితో కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును ఖరీఫ్‌లో స్థిరీకరించవచ్చని.. రబీలో గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమర్థవంతంగా నీళ్లందించవచ్చునని తేల్చింది. ఎడమ కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి 23.44 టీఎంసీలను తరలించడం ద్వారా విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చవచ్చునని పేర్కొంది. ముందస్తుగా ఈ ఫలాలు పొందడానికి వీలుగా తొలిదశ పనుల పూర్తికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్‌ వోహ్రా చెప్పారు.

ఈ పనుల పూర్తికి ఏ మేరకు నిధులు అవసరమవుతాయోనన్న నివేదికతో ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయానికి ఒక అధికారిని రెండ్రోజుల్లోగా పంపాలని ఆయన సూచించారు. ఇందుకు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలు అంగీకరించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ (41.15 మీటర్ల కాంటూర్‌), తుది దశ (45.72 మీటర్ల కాంటూర్‌) పూర్తిచేస్తే తక్షణం ఒనగూరే ప్రయోజనాలు, పనుల పూర్తికి అవసరమైన నిధులపై వోహ్రా ఫిబ్రవరి 22న సమీక్షించారు. ఆ సమావేశంలో లేవనెత్తిన అంశాలపై మంగళవారం వర్చువల్‌ పద్ధతిలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈఓ చంద్రశేఖర్‌ అయ్యర్, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలిదశలో పనుల పూర్తికి అవసరమైన నిధులపై వోహ్రా సమీక్షించారు.  

నిధులివ్వాలని కేంద్రానికి ప్రతిపాదన 
పోలవరం ప్రాజెక్టు తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వ చేయడానికి వీలుగా పూర్తిచేయాల్సిన పనులు.. 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించడం.. ఆయకట్టుకు నీళ్లందించేందుకు డిస్ట్రిబ్యూటరీ పనుల కోసం రూ.10,911.15 కోట్లు అవసరమని గతంలో నివేదిక ఇచ్చామని వోహ్రాకు అధికారులు వివరించారు. వరద ఉధృతివల్ల ప్రధాన డ్యామ్‌ ప్రాంతం, డయాఫ్రమ్‌ వాల్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ కోతకు గురైన నేపథ్యంలో అదనంగా పనులు చేయాల్సి వస్తున్నందున వ్యయం పెరుగుతుందన్నారు. దీనిపై వోహ్రా స్పందిస్తూ.. తొలిదశ పనులకు తొలుత ప్రతిపాదించిన రూ.10,911.15 కోట్లతోపాటు.. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటానికయ్యే అదనపు వ్యయం, రెండోసారి సవరించిన అంచనా వ్యయం ప్రకారం అయ్యే వ్యయాలపై నివేదిక రూపొందించి.. రెండ్రోజుల్లోగా ఢిల్లీకి అధికారిని పంపాలని సూచించారు. వీటిని మదింపు చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని చెప్పారు. 

రైతులకు ముందస్తు ఫలాలు అందించడమే లక్ష్యం 
ఇక తొలిదశలో 41.15 మీటర్లలో నీటిని నిల్వచేస్తే.. ఎడమ కాలువలో 93.7 కి.మీ. వరకూ పుష్కర ఎత్తిపోతల ఆయకట్టు ద్వారా 1.41 లక్షల ఎకరాలకు.. కుడి కాలువలో 75.45 కిమీ వరకూ తాడిపూడి ఎత్తిపోతల ఆయకట్టులోని 1.57 లక్షల ఎకరాలకు వెరసి 2.98 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్లందించవచ్చునని అధికారులు ఇచ్చిన వివరణకు వోహ్రా సానుకూలంగా స్పందించారు. 45.72 మీటర్ల వరకూ పూర్తిచేశాక ఎడమ కాలువలో మిగిలిన 2.59, కుడి కాలువలో మిగిలిన 1.63 వెరసి 4.22 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చునని.. తద్వారా పోలవరం కింద 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చునని చెప్పారు. అలాగే, తొలిదశలో కుడి కాలువ ద్వారా మళ్లించే నీటితో కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు, ఎడమ కాలువ ద్వారా విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చవచ్చని.. గోదావరి డెల్టాలో రబీ పంటలకు సమర్థంగా నీళ్లందించవచ్చని రాష్ట్ర అధికారుల  ప్రతిపాదనతోనూ సీడబ్ల్యూసీ సభ్యులు వోహ్రా ఏకీభవించారు. పోలవరాన్ని 2023 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని రైతులకు ముందస్తుగా ఫలాలను అందించేలా తొలిదశను పూర్తిచేయడానికి నిధులు మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు వోహ్రా సానుకూలంగా స్పందించారు.

‘పోలవరం’ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ పనుల పరిశీలన
మరోవైపు.. పోలవరం ప్రాజెక్టు పనులను సీడబ్ల్యూ పీఆర్‌ఎస్‌ బృందం సభ్యులు మంగళవారం పరిశీలించారు. వీరిలో శాస్త్రవేత్త హనుమంతప్ప, అసిస్టెంట్‌ రీసెర్చ్‌ అధికారి షామిలి పాశ్వాన్, విష్ణు మీనా పనులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. గ్యాలరీలో ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బిగింపు ప్రక్రియ జరుగుతున్న తీరు, డిజైన్‌ ప్రకారం జరుగుతోందా లేదా అనే విషయాలను పరిశీలించారు.  వీరికి పనుల వివరాలను ఈఈ పి.ఆదిరెడ్డి, డీఈ లక్ష్మణరావు, మేఘ ఏజెన్సీ డీజీఎం రాజేష్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement