దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక బృందం శుక్రవారం రైవాడ జలాశయాన్ని సందర్శించింది. గౌరవ్ భగత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బోటులో ప్రయాణించి సర్వే నిర్వహించింది. బోటులో అమర్చిన ల్యాప్‌టాప్‌తో పాటు కెమెరాల ఆధారంగా సర్వేను చేపట్టారు. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో రైవాడ జలాశయం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.252 కోట్లతో గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపారు.
1990లో వచ్చిన భారీ వరద దృష్ట్యా ఎటువంటి తుపాన్లు సంభవించినా ఎదుర్కొనేలా కొత్త స్పిల్‌వే గేట్లు అమర్చాలని డ్రిప్ పథకంలో ప్రతిపాదించారు. జలాశయం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు సాంకేతిక అధికారుల బృందం ఇక్కడికి వచి్చంది.
అధునాతన సాంకేతికత ఆధారంగా జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం, ఎంతమేర పూడిక ఉంది, జలాశయం విస్తీర్ణం, జలాశయం గర్భంలో ఎక్కడైనా నిర్మాణాలు జరిగాయా తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు.15 రోజులపాటు ఈ సర్వే జరుగుతుందని, అనంతరం సర్వే రిపోర్టును ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. వీరికి జలాశయం డీఈ సత్యంనాయుడు, జేఈలు నంద కిశోర్, రవిప్రకాష్ తదితరులు జలాశయ స్థితిగతులను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment