Bhagat
-
రైవాడ జలాశయాన్ని సందర్శించిన సాంకేతిక బృందం
దేవరాపల్లి (అనకాపల్లి జిల్లా): ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక బృందం శుక్రవారం రైవాడ జలాశయాన్ని సందర్శించింది. గౌరవ్ భగత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం ప్రత్యేక బోటులో ప్రయాణించి సర్వే నిర్వహించింది. బోటులో అమర్చిన ల్యాప్‌టాప్‌తో పాటు కెమెరాల ఆధారంగా సర్వేను చేపట్టారు. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం (డ్రిప్)లో రైవాడ జలాశయం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు రూ.252 కోట్లతో గతంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు పంపారు. 1990లో వచ్చిన భారీ వరద దృష్ట్యా ఎటువంటి తుపాన్లు సంభవించినా ఎదుర్కొనేలా కొత్త స్పిల్‌వే గేట్లు అమర్చాలని డ్రిప్ పథకంలో ప్రతిపాదించారు. జలాశయం స్థితిగతులపై సమగ్ర సర్వే చేపట్టాలన్న సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు సాంకేతిక అధికారుల బృందం ఇక్కడికి వచి్చంది. అధునాతన సాంకేతికత ఆధారంగా జలాశయంలో ప్రస్తుత నీటి నిల్వ సామర్ధ్యం, ఎంతమేర పూడిక ఉంది, జలాశయం విస్తీర్ణం, జలాశయం గర్భంలో ఎక్కడైనా నిర్మాణాలు జరిగాయా తదితర అంశాలపై సర్వే చేస్తున్నారు.15 రోజులపాటు ఈ సర్వే జరుగుతుందని, అనంతరం సర్వే రిపోర్టును ఢిల్లీలోని సెంట్రల్ వాటర్ కమిషన్‌కు అందజేస్తామని బృంద సభ్యులు తెలిపారు. వీరికి జలాశయం డీఈ సత్యంనాయుడు, జేఈలు నంద కిశోర్, రవిప్రకాష్ తదితరులు జలాశయ స్థితిగతులను వివరించారు. -
నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే
షహీద్ భగత్‌సింగ్ పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి రాజమహేంద్రవరం కల్చరల్: చెరసాలలే చంద్రశాలలుగా, అరదండాలే విరిదండలుగా నాటి త్యాగధనులు భావించారు.నేడు దేశభక్తులు లేరు.. దేశముదుర్లే కనిపిస్తున్నారు అని తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అన్నారు. సర్ ఆర్ధర్ కాటన్ మెమోరియల్ సోషల్ సర్వీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశ్రాంతపేపర్ మిల్లు అధికారి ఎస్బీచౌదరి రచించిన‘షహీద్ భగత్‌సింగ్’పుస్తకావిష్కరణ సభలో ఎండ్లూరి ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలునాయుడు ‘షహీద్ భగత్‌సింగ్ ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. భగత్ సింగ్, స్వామి వివేకానంద, ఆదిశంకరాచార్యులు జీవించినది కొద్ది కాలమే అయినా మానవాళికి వారు చేసిన సేవలు లెక్కపెట్టలేమన్నారు. గ్రంథకర్త ఎస్బీ చౌదరి మాట్లాడుతూ మంచి మనుషులే సమాజంలో నిజమైన మైనారిటీలన్నారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ అరిపిరాల నారాయణరావు మాట్లాడుతూ ఉరితీయకముందు భగత్‌సింగ్‌ను నాటి పోలీస్ అధికారులు చిత్రహింసలకు గురిచేశారన్నారు. స్వాగతవచనాలు పలికిన మహమ్మద్ఖాదర్ఖాన్ ‘జీవితాన్ని ప్రేమిస్తాం–మరణాన్ని ప్రేమిస్తాం, మేం మరణించి–ఎర్రపూల వనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం, నిప్పురవ్వల మీద నిదురిస్తాం’ అన్న కవితను చదివారు. వ్యక్తిత్వవికాసనిపుణుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ గ్రంథకర్త కృషిని కొనియాడారు. కోడూరి రంగారావు, ఎర్రాప్రగడ రామకృష్ణ, పెరుమాళ్ల రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లు మోయడానికో భార్య
శాఖారాం భగత్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన మొదటిభార్య తూకీ ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించింది కూడా! సవతిగా రానున్న సఖ్రి నీటిని మోసుకొస్తే తను ఎంచక్కా ఇంటిపని, వంటపని చక్కబెట్టుకోవచ్చు. ఆరుగురు పిల్లల తల్లి కావడం ఒక్కటే తూకీ నీళ్లు మోసుకోలేకపోవడానికి కారణం కాదు, ఎంత దూరం నుంచి తేవాలి నీళ్లను! మూడు కిలోమీటర్ల దూరంలోని డ్యామ్ దగ్గరకు ఎక్కుకుంటూ దిగుకుంటూ పోవాలి. మోకాళ్లు బలంగా ఉంటేతప్ప సాధ్యం కాదు. అందుకే, సఖ్రికి వయసు పైబడ్డప్పుడు శాఖారాం మూడో భార్యగా ఒక విధవరాలైన భాగీని మనువాడాడు. దీనికి మొదటి ఇద్దరు భార్యల నుంచే కాదు, ఊరి పెద్దల నుంచి కూడా వ్యతిరేకత ఎదురుకాలేదు. ఎందుకంటే, మహారాష్ట్రలోని డెంగన్మాల్ గ్రామంలో ఇలాంటి ‘నీటి కాపురాలు’ అసాధారణం ఏమీకాదు. నీళ్లను మోయడానికే మరో భార్య(పానీవాలీ బాయీ)ను చేసుకున్నవాళ్లు మరికొందరూ కనిపిస్తారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇంటికి కావాల్సిన కనీసం 100 లీటర్ల నీటిని మోయడమే ‘పానీవాలీ బాయీ’ పని! ముంబైకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెంగన్మాల్ మహారాష్ట్రలోని 8,000 నీటికరువు గ్రామాల్లో ఒకటి! ఇక్కడ దాదాపు 100 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుతం ఏడుపదుల వయసుకు చేరువవుతున్న శాఖారాం తన జీవితకాలంలో ఏనాడూ సమృద్ధిగా నీటిని చూడలేదు. అడపాదడపా కురిసే నాలుగు వానచినుకులతో పండే మెట్టపంటలు, పాడి వారి జీవనాధారం. మరి రోజువారీ అవసరాలకు కావాల్సిన నీరు ఎక్కణ్నించి రావాలి? వాళ్ల ఊరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బాస్తా నది ప్రవహిస్తుంది. ముంబైకి మంచినీటిని అందించే ఆ నదికి వేసిన పైపులైను డెంగన్మాల్ను తడపదు. వారానికోసారి వచ్చిపోయే వెయ్యిలీటర్ల ట్యాంకర్ బిందెల కొట్లాటలకు కారణమవడం తప్ప సాధించేది ఏమీవుండదు. ఈ నీటి కటకట కారణంగానే ఇక్కడి మగవాళ్లకు పిల్లను కూడా సరిగ్గా ఇవ్వరు. ఇంకో కరువు గ్రామం నుంచి పెళ్లాడాల్సిందే! మరి రెండో భార్య ఎక్కణ్నుంచి వస్తుంది? భర్తలు వదిలేసినవాళ్లు, భర్తలు చనిపోయినవాళ్లు కేవలం నిలువ నీడ అనే ఊతంగా ‘పానీవాలీ బాయీ’గా ఉండటానికి సిద్ధమవుతారు. తలనొప్పులూ, మోకాళ్లనొప్పులూ, నొప్పుల వల్ల నిద్ర పట్టకపోవడమూ, మళ్లీ రేపటిని తలచుకుని నిద్ర పారిపోవడమూ... వీటన్నింటికీ అలవాటు పడిపోతారు. కనీసం వాళ్ల పిల్లల తరానికైనా తమ ఊరికి పైపులైను వస్తుందన్న ఆశతో బతుకులీడుస్తారు.