నీళ్లు మోయడానికో భార్య
శాఖారాం భగత్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన మొదటిభార్య తూకీ ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించింది కూడా! సవతిగా రానున్న సఖ్రి నీటిని మోసుకొస్తే తను ఎంచక్కా ఇంటిపని, వంటపని చక్కబెట్టుకోవచ్చు. ఆరుగురు పిల్లల తల్లి కావడం ఒక్కటే తూకీ నీళ్లు మోసుకోలేకపోవడానికి కారణం కాదు, ఎంత దూరం నుంచి తేవాలి నీళ్లను! మూడు కిలోమీటర్ల దూరంలోని డ్యామ్ దగ్గరకు ఎక్కుకుంటూ దిగుకుంటూ పోవాలి. మోకాళ్లు బలంగా ఉంటేతప్ప సాధ్యం కాదు. అందుకే, సఖ్రికి వయసు పైబడ్డప్పుడు శాఖారాం మూడో భార్యగా ఒక విధవరాలైన భాగీని మనువాడాడు. దీనికి మొదటి ఇద్దరు భార్యల నుంచే కాదు, ఊరి పెద్దల నుంచి కూడా వ్యతిరేకత ఎదురుకాలేదు. ఎందుకంటే, మహారాష్ట్రలోని డెంగన్మాల్ గ్రామంలో ఇలాంటి ‘నీటి కాపురాలు’ అసాధారణం ఏమీకాదు. నీళ్లను మోయడానికే మరో భార్య(పానీవాలీ బాయీ)ను చేసుకున్నవాళ్లు మరికొందరూ కనిపిస్తారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇంటికి కావాల్సిన కనీసం 100 లీటర్ల నీటిని మోయడమే ‘పానీవాలీ బాయీ’ పని!
ముంబైకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెంగన్మాల్ మహారాష్ట్రలోని 8,000 నీటికరువు గ్రామాల్లో ఒకటి! ఇక్కడ దాదాపు 100 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుతం ఏడుపదుల వయసుకు చేరువవుతున్న శాఖారాం తన జీవితకాలంలో ఏనాడూ సమృద్ధిగా నీటిని చూడలేదు. అడపాదడపా కురిసే నాలుగు వానచినుకులతో పండే మెట్టపంటలు, పాడి వారి జీవనాధారం. మరి రోజువారీ అవసరాలకు కావాల్సిన నీరు ఎక్కణ్నించి రావాలి? వాళ్ల ఊరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బాస్తా నది ప్రవహిస్తుంది. ముంబైకి మంచినీటిని అందించే ఆ నదికి వేసిన పైపులైను డెంగన్మాల్‌ను తడపదు. వారానికోసారి వచ్చిపోయే వెయ్యిలీటర్ల ట్యాంకర్ బిందెల కొట్లాటలకు కారణమవడం తప్ప సాధించేది ఏమీవుండదు.
ఈ నీటి కటకట కారణంగానే ఇక్కడి మగవాళ్లకు పిల్లను కూడా సరిగ్గా ఇవ్వరు. ఇంకో కరువు గ్రామం నుంచి పెళ్లాడాల్సిందే! మరి రెండో భార్య ఎక్కణ్నుంచి వస్తుంది? భర్తలు వదిలేసినవాళ్లు, భర్తలు చనిపోయినవాళ్లు కేవలం నిలువ నీడ అనే ఊతంగా ‘పానీవాలీ బాయీ’గా ఉండటానికి సిద్ధమవుతారు. తలనొప్పులూ, మోకాళ్లనొప్పులూ, నొప్పుల వల్ల నిద్ర పట్టకపోవడమూ, మళ్లీ రేపటిని తలచుకుని నిద్ర పారిపోవడమూ... వీటన్నింటికీ అలవాటు పడిపోతారు. కనీసం వాళ్ల పిల్లల తరానికైనా తమ ఊరికి పైపులైను వస్తుందన్న ఆశతో బతుకులీడుస్తారు.