ఆడపిల్లలు పుట్టారని రెండో పెళ్లి...
బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి ఘనకార్యం
నాగోలు: వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని మొదటి భార్యను వేధించి రెండవ వివాహం చేసుకున్న ఓ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిపై సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి కథనం ప్రకారం... సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన పి.నవీన్‌కుమార్ వనస్థలిపురంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో ఉద్యోగి. ఆసిఫ్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మితో 12 ఏళ్ల క్రితం ఇతనికి పెళ్లైంది. వివాహ సమయంలో కట్నం కింద రూ.3.50 లక్షల నగదు, 25 తులాల బంగారం, కొన్ని వెండి ఆభరణాలు ఇచ్చారు. కొంతకాలం బాగానే ఉన్న నవీన్‌కుమార్ వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో విజయలక్ష్మిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు.
దీంతో విజయలక్ష్మి తల్లి తమ రెండు ఎకరాల భూమిని కూతురు, అల్లుడు నవీన్‌కుమార్‌ల పేరిట రాసింది. ఆ భూమిని అమ్మేయాలని నవీన్‌కుమార్ మళ్లీ భార్యను వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా.. నవీన్‌కుమార్ గత డిసెంబర్‌లో గుడిమల్కాపురానికి చెందిన ఓ యువతిని యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విజయలక్ష్మి భర్తను నిలదీయగా.. ‘‘ నా ఇష్టం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అని అన్నాడు. దీంతో బాధితురాలు గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నవీన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.