The second marriage
-
రెండో పెళ్లికి రెడీ
ఈడూ జోడూ బాగుంది. చూడచక్కగా ఉన్నారు... అని దర్శకుడు విజయ్–అమలా పాల్ల పెయిర్ని చూసి అనుకోనివాళ్లు లేరు. ప్రేమకు కులమతాలతో సంబంధం లేదంటూ.. ఈ ఇద్దరూ లవ్‌లో పడ్డారు. విజయ్ హిందు, అమల క్రిస్టియన్. రెండు పద్ధతుల్లోనూ 2014లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు కాపురం బాగానే సాగింది. ఆ తర్వాతే మనస్పర్థలు మొదలయ్యాయి. ఇంకేముంది? విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. అమలా పాల్ ఫుల్‌గా ప్రొఫెషన్లో మునిగిపోయారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీ అయిపోయారు. విజయ్ కూడా దర్శకుడిగా బిజీ. మరి.. పర్సనల్ లైఫ్ సంగతేంటి? ఆ విషయం గురించి అమలా పాల్ దగ్గర ప్రస్తావిస్తూ... పెళ్లి గురించి అడిగితే.. ‘‘తప్పకుండా చేసుకుంటా’’ అని స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఆన్సర్ ఇచ్చేశారు. ‘‘ నేనేం సన్యాసినైపోను. హిమాలయాలకు వెళ్లి మిగిలిన జీవితాన్ని గడపాలనుకోవడం లేదు. తప్పకుండా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. అది కూడా ప్రేమ వివాహం. సమయం వచ్చినప్పుడు నా మ్యారేజ్ గురించి అందరికీ తెలుస్తుంది’’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. ఈ సమాధానం గాసిప్పురాయుళ్లకు విందు అయింది. ‘ఆల్రెడీ అమలా పాల్ లైఫ్‌లో ఎవరో ఉన్నారు. ఆ వ్యక్తితో చనువుగా ఉన్నందువల్లే విజయ్ నుంచి విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ’ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. మరి.. అమలా పాల్ దీనికి కూడా సూటిగా సమాధానం ఇస్తారా? వెయిట్ అండ్ సీ. -
నీళ్లు మోయడానికో భార్య
శాఖారాం భగత్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన మొదటిభార్య తూకీ ఎంతమాత్రమూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించింది కూడా! సవతిగా రానున్న సఖ్రి నీటిని మోసుకొస్తే తను ఎంచక్కా ఇంటిపని, వంటపని చక్కబెట్టుకోవచ్చు. ఆరుగురు పిల్లల తల్లి కావడం ఒక్కటే తూకీ నీళ్లు మోసుకోలేకపోవడానికి కారణం కాదు, ఎంత దూరం నుంచి తేవాలి నీళ్లను! మూడు కిలోమీటర్ల దూరంలోని డ్యామ్ దగ్గరకు ఎక్కుకుంటూ దిగుకుంటూ పోవాలి. మోకాళ్లు బలంగా ఉంటేతప్ప సాధ్యం కాదు. అందుకే, సఖ్రికి వయసు పైబడ్డప్పుడు శాఖారాం మూడో భార్యగా ఒక విధవరాలైన భాగీని మనువాడాడు. దీనికి మొదటి ఇద్దరు భార్యల నుంచే కాదు, ఊరి పెద్దల నుంచి కూడా వ్యతిరేకత ఎదురుకాలేదు. ఎందుకంటే, మహారాష్ట్రలోని డెంగన్మాల్ గ్రామంలో ఇలాంటి ‘నీటి కాపురాలు’ అసాధారణం ఏమీకాదు. నీళ్లను మోయడానికే మరో భార్య(పానీవాలీ బాయీ)ను చేసుకున్నవాళ్లు మరికొందరూ కనిపిస్తారు. ఎలాంటి వాతావరణంలోనైనా ఇంటికి కావాల్సిన కనీసం 100 లీటర్ల నీటిని మోయడమే ‘పానీవాలీ బాయీ’ పని! ముంబైకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న డెంగన్మాల్ మహారాష్ట్రలోని 8,000 నీటికరువు గ్రామాల్లో ఒకటి! ఇక్కడ దాదాపు 100 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రస్తుతం ఏడుపదుల వయసుకు చేరువవుతున్న శాఖారాం తన జీవితకాలంలో ఏనాడూ సమృద్ధిగా నీటిని చూడలేదు. అడపాదడపా కురిసే నాలుగు వానచినుకులతో పండే మెట్టపంటలు, పాడి వారి జీవనాధారం. మరి రోజువారీ అవసరాలకు కావాల్సిన నీరు ఎక్కణ్నించి రావాలి? వాళ్ల ఊరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బాస్తా నది ప్రవహిస్తుంది. ముంబైకి మంచినీటిని అందించే ఆ నదికి వేసిన పైపులైను డెంగన్మాల్ను తడపదు. వారానికోసారి వచ్చిపోయే వెయ్యిలీటర్ల ట్యాంకర్ బిందెల కొట్లాటలకు కారణమవడం తప్ప సాధించేది ఏమీవుండదు. ఈ నీటి కటకట కారణంగానే ఇక్కడి మగవాళ్లకు పిల్లను కూడా సరిగ్గా ఇవ్వరు. ఇంకో కరువు గ్రామం నుంచి పెళ్లాడాల్సిందే! మరి రెండో భార్య ఎక్కణ్నుంచి వస్తుంది? భర్తలు వదిలేసినవాళ్లు, భర్తలు చనిపోయినవాళ్లు కేవలం నిలువ నీడ అనే ఊతంగా ‘పానీవాలీ బాయీ’గా ఉండటానికి సిద్ధమవుతారు. తలనొప్పులూ, మోకాళ్లనొప్పులూ, నొప్పుల వల్ల నిద్ర పట్టకపోవడమూ, మళ్లీ రేపటిని తలచుకుని నిద్ర పారిపోవడమూ... వీటన్నింటికీ అలవాటు పడిపోతారు. కనీసం వాళ్ల పిల్లల తరానికైనా తమ ఊరికి పైపులైను వస్తుందన్న ఆశతో బతుకులీడుస్తారు. -
ఆడపిల్లలు పుట్టారని రెండో పెళ్లి...
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఘనకార్యం నాగోలు: వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారని మొదటి భార్యను వేధించి రెండవ వివాహం చేసుకున్న ఓ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగిపై సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి కథనం ప్రకారం... సరూర్‌నగర్ వెంకటేశ్వరకాలనీకి చెందిన పి.నవీన్‌కుమార్ వనస్థలిపురంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఉద్యోగి. ఆసిఫ్‌నగర్‌కు చెందిన విజయలక్ష్మితో 12 ఏళ్ల క్రితం ఇతనికి పెళ్లైంది. వివాహ సమయంలో కట్నం కింద రూ.3.50 లక్షల నగదు, 25 తులాల బంగారం, కొన్ని వెండి ఆభరణాలు ఇచ్చారు. కొంతకాలం బాగానే ఉన్న నవీన్‌కుమార్ వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో విజయలక్ష్మిని మానసిక, శారీరక వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టాడు. దీంతో విజయలక్ష్మి తల్లి తమ రెండు ఎకరాల భూమిని కూతురు, అల్లుడు నవీన్‌కుమార్‌ల పేరిట రాసింది. ఆ భూమిని అమ్మేయాలని నవీన్‌కుమార్ మళ్లీ భార్యను వేధిస్తుండటంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా.. నవీన్‌కుమార్ గత డిసెంబర్లో గుడిమల్కాపురానికి చెందిన ఓ యువతిని యాదగిరిగుట్టలో రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న విజయలక్ష్మి భర్తను నిలదీయగా.. ‘‘ నా ఇష్టం.. నీ దిక్కున్న చోట చెప్పుకో’ అని అన్నాడు. దీంతో బాధితురాలు గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు నవీన్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.