సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంలో సాగు, తాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా ఖరారు చేసింది. నీటి సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు జలాశయంలో కనీస నీటి మట్టానికి ఎగువన నీటి నిల్వ ఉండేలా చూడాలని నిర్దేశించింది.
శ్రీశైలంలో విద్యుదుత్పత్తికంటే 75 శాతం లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను వాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు, తాగు నీటి అవసరాలను దెబ్బతీసేలా ఇతర అవసరాలకు అంటే విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోకూడదని స్పష్టం చేసింది.
ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ (నిర్వహణ నియమావళి)లో ఈ విషయాలను స్పష్టంగా చెబుతూ కృష్ణా బోర్డుకు సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్‌పైనా సీడబ్ల్యూసీ ముసాయిదా నివేదిక ఇచ్చింది. వీటిపై రిజర్వాయర్ల మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ)లో చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు.
మరోసారి ఆర్‌ఎంసీలో చర్చ
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తికి నియమావళి, రెండు ప్రాజెక్టుల రూల్ కరవ్స్, మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా వద్దా అనే అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు గతేడాది మే 10న కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీని ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు అప్పటి సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, జెన్‌కో డైరెక్టర్లు ఇందులో సభ్యులు.
ఆర్‌ఎంసీ ఆరు సార్లు సమావేశమై.. గతేడాది డిసెంబర్ 8న కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించి, అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. నివేదికపై సంతకం చేసేందుకు మాత్రం నిరాకరించారు. ఈ అంశంపై ఈనెల 10న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించి, ఆర్‌ఎంసీని పునరుద్ధరించారు. రూల్ కరŠవ్స్, విద్యుదుత్పత్తికి నియమావళి, వరద జలాల మళ్లింపుపై మరోసారి చర్చించి నెలలోగా నివేదిక ఇవ్వాలని బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ ఆర్‌ఎంసీని ఆదేశించారు.
వివాదాలకు చరమగీతం పాడటానికే
కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణం ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుదుత్పత్తి, వరద జలాల మళ్లింపే. ఆర్‌ఎంసీ నివేదికను బోర్డు సమావేశంలో మరో మారు చర్చించి 2023–24లో అమలు చేయడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని చైర్మన్ శివ్‌నందన్‌కుమార్ నిర్ణయించారు. గతంలో తరహాలోనే ఆర్‌ఎంసీ నివేదికపై ఈసారీ తెలంగాణ అధికారులు సంతకాలు చేయడానికి నిరాకరిస్తే.. కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment