Eenadu Ramoji Rao Fake News On Polavaram Project - Sakshi
Sakshi News home page

మీ తప్పు ఒప్పుకునేదెప్పుడు బాబూ? 

Published Tue, Mar 7 2023 3:36 AM | Last Updated on Tue, Mar 7 2023 10:47 AM

Eenadu Ramoji Rao Fake News On Polavaram Project - Sakshi

ఓ రెండేళ్ల కిందటి ఫోటో ప్రచురించి తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు కొట్టేశారంటూ రాసిన ‘ఈనాడు’... ఆ తరువాతి రోజు అది తప్పని ఒప్పుకుంది. కాకపోతే కొట్టారని రాసిన కథ.. మొదటి పేజీలో బ్యానర్‌. పొరపాటైపోయిందంటూ వేసిన సవరణ... కనీకనిపించని విధంగా లోపలి పేజీల్లో ఓ సింగిల్‌ కాలమ్‌!!. 

పోలవరం వ్యవహారంలోనూ అంతే. ప్రపంచంలో ఎవ్వరూ కక్కుర్తిపడని రీతిలో కమీషన్ల కోసం చేయాల్సిన పనులన్నీ వెనక్కి నెట్టేసి...చేయకూడని పనులన్నిటినీ ముందుకు తెచ్చింది చంద్రబాబు నాయుడు. పైపెచ్చు ఆ పనుల్ని కూడా రామోజీ వియ్యంకుడు, యనమల బావమరిది... ఇలా బంధుగణానికి నామినేషన్‌ పద్ధతిలో సంతర్పణ చేసేశారన్నదీ నిజం. చంద్రబాబు అనుసరించిన ఈ డీపీటీ (దోచుకో పంచుకో తినుకో) విధానం వల్ల పోలవరం చంద్రబాబుకు ఏటీఎంగా మారిపోయిందని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీయే అన్నారంటే వీళ్లు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిని.. పోలవరం ప్రాజెక్టు యావత్తూ వెనక్కెళ్లిపోయింది. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ జాప్యానికి మానవ తప్పిదమే కారణమని ఎన్‌హెచ్‌పీసీ, డీడీఆర్‌పీ, నిపుణులు, అధికారులు పదేపదే చెప్పారు. ఆ మానవుడు చంద్రబాబేనని కూడా అందరికీ తెలుసు. కానీ రామోజీరావు ఒక్క ముక్క రాస్తే ఒట్టు!!. పైపెచ్చు తప్పంతా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిదేనన్నట్టుగా రాతలు?  

చంద్రబాబు పాపాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ పోలవరాన్ని పూర్తి చేయడానికి వడివడిగా అడుగులేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను... పనిగట్టుకుని మరీ విమర్శిస్తున్న ‘ఈనాడు’ కథనాల్లోని డొల్లతనం ఇదిగో... 

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం బహుళార్ధకసాధక ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కక్కుర్తితో నాడు చంద్రబాబు చేసిన పాపాల ఫలితం... ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఆ సవాళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ప్రణాళికాయుతంగా పూర్తి చేసేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వడివడిగా అడుగులేస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని, ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమిస్తూ ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తన నిధుల్లోంచి ఖర్చు చేసిన రూ.2,948.04 కోట్లను రీయింబర్స్‌ చేయడంలో కేంద్రం అలవికాని జాప్యం చేస్తోంది.

అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత ఇబ్బంది కలిగించేదే అయినప్పటికీ... వీలైనంతగా రాష్ట్ర ఖజానా నుంచే పోలవరానికి నిధులు విడుదల చేస్తూ ముందుకెళుతున్నారు. కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పాల్పడిన పాపాల వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం కోతకు గురైంది. దీని వల్లే పోలవరం పనులు ముందుకెళ్లకుండా ఆగిపోయాయి. లేదంటే 2021 నాటికే పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్‌ జగన్‌ పూర్తి చేసేవారనేది జలవనరుల శాఖ అధికారులు, నీటిపారుదలరంగ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్న మాట.

దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్, ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతాన్ని యథాపూర్వ స్థితికి తెచ్చేందుకు సీడబ్ల్యూసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల నిపుణులతో గత 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వారంతా ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. కాకపోతే ఆదివారం నాడు ఈ సమస్యకు డీడీఆర్పీ పరిష్కార మార్గం చూపించింది. దీంతో డయాఫ్రమ్‌ వాల్‌ను సరిదిద్ది, కోతకు గురైన ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతాన్ని యథాపూర్వ స్థితికి తెచ్చి... సత్వరమే ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. 

31 నెలలు తట్టెడు మట్టి కూడా పోయని టీడీపీ సర్కార్‌ 
► పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, వంద శాతం వ్యయాన్ని భరించి.. అన్ని అను­మతులు తెచ్చి తామే పూర్తి చేస్తామని కేంద్రం పార్లమెంటులో హామీనిచ్చింది. విభజన చట్టంలోనూ ఈ అంశాన్ని పొందుపరిచింది. ఆ మేరకు ప్రా­జెక్టును పూర్తి చేయడం కోసం పోలవరం ప్రాజె­క్టు అథారిటీని (పీపీఏ) 2014, మే 28న ఏ­ర్పాటు చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవా­లని నాటి టీడీపీ సర్కార్‌ను కోరుతూ వచ్చింది. 

► కేంద్రమే నేరుగా ప్రాజెక్టు కడితే జనానికి ప్రాజెక్టు వస్తుంది తప్ప తనకేమొస్తుందని భావించారు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తాను గనక తనకు నచ్చిన వారికి కాంట్రాక్టుకు ఇస్తే కావాల్సినంత కమీషన్లు వస్తాయని భావించారు. అందుకే పీపీఏతో ఒప్పందం చేసుకోకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.  

► చివరకు పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని కేంద్రాన్ని కోరారు. అలా గనక చేస్తే... తాను కేంద్రం వద్ద ప్రత్యేక హోదా మాట ఎత్తనని లోపాయికారీగా హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టేయడంతో... 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. 

► ఆ వెంటనే పోలవరం జలాశయం పనుల్లో రూ.3,302 కోట్ల విలువైన పనులను ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగ సంస్థకు  నామినేషన్‌ పద్ధతిపై కట్టబెట్టేశారు చంద్రబాబు నాయుడు. అంతేకాక మరో రూ.150 కోట్ల విలువైన ఎడమ కాలువలోని పనులను నాటి ఆర్థిక మంత్రి యనమల బావమరిది పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు నామినేషన్‌పై ఇచ్చేశారు. ఇలా పందేరాలు జరిగిపోయాక... 2016, సెప్టెంబరు 30న పనులు చేపట్టారు. అంటే అధికారం చేపట్టినప్పటి నుంచి 31 నెలలపాటు పోలవరంలో తట్టెడు మట్టి కూడా టీడీపీ సర్కార్‌ ఎత్తలేదన్న మాట.

► చంద్రబాబు నాయుడు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ప్రధానికి లేఖ రాయటం. నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్ఠాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్‌కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికీ అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్‌ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి.  

► కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారు? ఎందుకంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు. అన్నిటికీ ఒప్పేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారు కనక... కావలసినంత పిండుకోవచ్చన్నది ఆయన ఆలోచనల పిండితార్థం. 

► ఇక అస్మదీయులకు పనులు అప్పగించటంలోనూ బాబు తన చేతివాటాన్ని చూపించారు. ప్రాధాన్య పనులు పక్కనబెట్టేసి... అధికంగా లాభాలు వచ్చే మట్టి తవ్వకం, స్పిల్‌ వేలో కాంక్రీట్‌ పోయడం వంటి పనులు ముందుగా చేపట్టారు. భారీగా కమీషన్లు దండుకున్నారు.  

ప్రణాళికా రాహిత్యం వల్లే డయాఫ్రమ్‌వాల్‌కు దెబ్బ 
► గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ పనులు పూర్తి చేసి.. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు కట్టాలి. ఈలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని 20,946 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. ఆ తర్వాతే ప్రధాన(ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌–ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలి. కానీ.. చంద్రబాబు మాత్రం వరదను మళ్లించేలా అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌ పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యామ్‌ డయాఫ్రమ్‌ వాల్‌ను 2018 నాటికే చంద్రబాబు పూర్తి చేశారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు చేపట్టి... వాటిని పూర్తి చేయలేక... ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. దాంతో 2400 మీటర్లు వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఇరువైపులా వదిలిన ఖాళీ ప్రదేశాలు 800 మీటర్ల­కు కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది. 

► ఎక్కువ నీరు తక్కువ ఖాళీ లోంచి ప్రవహించాల్సి వచ్చినపుడు ఏం జరుగుతుంది? ఉద్ధృతి పెరుగుతుంది కదా!.  

► ఇదిగో... 2019, అక్టోబర్‌ 1న గోదావరికి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అది ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించాల్సి వచ్చింది. సెకనుకు 13 మీటర్ల వేగంతో వరద ఉద్ధృతంగా రావటంతో డయాఫ్రమ్‌ వాల్‌ ఘోరంగా దెబ్బతింది.

► ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి, స్పిల్‌ వే మీదుగా వరద నీటిని మళ్లించి ఉంటే.. అసలు డయాఫ్రమ్‌ వాల్‌ మీదికి అంత వరద వచ్చి ఉండేదే కాదు. అది దెబ్బతినే పరిస్థితే వచ్చేది కాదు.
► గోదావరి వరద ఉద్ధృతి వల్ల ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1  నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం 23 మీటర్ల నుంచి –12.00 మీ. వరకు అంటే దాదాపు 35  మీటర్ల మందంతో కోతకు గురైంది. గ్యాప్‌–2లో + 8 మీటర్ల నుంచి –12 మీటర్ల వరకు అంటే దాదాపు 20 మీటర్ల మందంతో, దిగువ కాఫర్‌ డ్యాంలో 36.5 మీటర్ల మందంతో గోదావరి గర్భం కోతకు గురైంది. గోదావరి వరద ఉద్ధృతికి స్పిల్‌ ఛానల్‌ లోని కాంక్రీటు బ్లాకులు(దిమ్మెలు) కొట్టుకుపోయాయి. 

► నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావు కనక చంద్రబాబు వారిని పట్టించుకుంటే ఒట్టు. ఐదేళ్లలో పునరావాసానికి బాబు సర్కారు కేవలం రూ.484 కోట్లు ఖర్చు పెట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించడంతో ... 2019లో కాఫర్‌ డ్యామ్‌ వల్ల గోదావరి వరద ఎగదన్నడంతో  నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 
చంద్రబాబు తప్పులు సరిదిద్దుతూ.. 

► చంద్రబాబు పాపాల ఫలితాన్ని సరిదిదిద్దుతూ పోలవరాన్ని ప్రణాళికాయుతంగా పూర్తి చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ యాక్షన్‌ ప్లాన్‌ రచించి.. అమలు చేస్తున్నారు.  

► కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ... ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. 48 గేట్లతో సహా స్పిల్‌ వేను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, పైలట్‌ ఛానల్‌లను పూర్తి చేసి.. 2021, జూలై 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున మళ్లించి చరిత్ర సృష్టించారు. 

► కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు చేపట్టిన పనుల వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. 2022, ఏప్రిల్‌లో విధానాన్ని ఖరారు చేయడంతో.. దాని ప్రకారం 2022, జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది. వరదలు తగ్గాక పనులు చేపట్టి ఫిబ్రవరి 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది. కాబట్టి ఇక గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా నిశ్చింతగా ప్రధాన డ్యామ్‌ పనులను చేపట్టవచ్చు. 

► ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని పంపులతో తోడివేస్తూ.. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చి, యథాస్థితికి తెచ్చే పనులను ప్రభుత్వం ముమ్మరం చేసింది. 

► టీడీపీ సర్కార్‌ ప్రణాళికారాహిత్యం, అవినీతితో చేపట్టిన పనుల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను ఎలా సరిచేయాలనే అంశంపై 15 నెలలుగా డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ, ఐఐటీ(తిరుపతి, చెన్నై, ఢిల్లీ) ప్రొఫెసర్లు, ఎన్‌హెచ్‌పీసీతో రాష్ట్ర ప్రభుత్వం మేధోమధనం చేస్తోంది. సీడబ్ల్యూసీ సూచన మేరకు డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యాన్ని తేల్చే బాధ్యతను ఎన్‌హెచ్‌పీసీకి ప్రభుత్వం అప్పగించింది. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 10 వరకూ నాలుగు రకాల పరీక్షలు చేసిన ఎన్‌హెచ్‌పీసీ.. కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్‌ వాల్‌ ఎడమ వైపున 188, కుడి వైపున 200 మీటర్ల పొడవున పూర్తిగా దెబ్బతిందని తేల్చింది. మరో రెండు చోట్ల 20 మీటర్ల లోతు వరకూ దెబ్బతిందని పేర్కొంది. 

► ఎన్‌హెచ్‌పీసీ నివేదిక ఆధారంగా శనివారం క్షేత్ర స్థాయిలో డయాఫ్రమ్‌ వాల్‌ను పరిశీలించిన డీడీఆర్పీ.. ఆదివారం దిద్దుబాటుకు మార్గదర్శకాలు జారీ చేసింది. కోతకు గురైన ప్రాంతంలో డయాఫ్రమ్‌వాల్‌కు సమాంతరంగా కొత్తగా నిర్మించి, పాత దానితో కలపడం... మిగతా చోట్ల ఐదు మీటర్ల లోతు నుంచి డయాఫ్రమ్‌ వాల్‌కు ఇరువైపులా బంకమట్టిని కూర్చి.. దానిపై ప్రధాన డ్యామ్‌ నిర్మించాలని మార్గనిర్దేశం చేసింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను ఇసుకతో పూడ్చి, వైబ్రో కాంపాక్షన్‌ ద్వారా యథాస్థితికి తేవాలని సూచించింది.  

► డీడీఆర్పీ సూచించిన మేరకు సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌ను పటిష్ఠవంతం చేయడం, ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాథాలను పూడ్చి.. ఆ తర్వాత ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసి.. పోలవరం ఫలాలను రైతులకు అందించే దిశగా సీఎం వైఎస్‌ జగన్‌ వడివడిగా అడుగులు వేస్తున్నారు. 

నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి 
సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడేళ్లలోనే రూ.1677 కోట్లు ఖర్చు పెట్టి 8446 కుటుంబాలకు  పునరావాసం కల్పించింది. రానున్న రెండు మూడు నెలల్లో  రూ.525 కోట్లతో మిగిలిన పునరావాసం పనులు పూర్తి చేసి, 9390 కుటుంబాలకు పునరావాసం కల్పించేలా అడుగులు వేస్తున్నారు. తద్వారా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని  నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తారు. 

ఇదీ... బాబు చేసిన ద్రోహం
► పోలవరం నిర్మాణ బాధ్యతలను అప్పగిస్తూనే 2016, సెప్టెంబరు 7న అర్ధరాత్రి నాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనలో.. 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగంలో మిగిలిన వ్యయాన్ని మాత్రమే భరిస్తామని మెలిక పెట్టారు. దానికి నాడు చంద్రబాబు అంగీకరించారు.

► 2016, సెప్టెంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్‌ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రం పెట్టిన మెలికకు చంద్రబాబు అంగీకరించారు.  

► 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభా­గం పనులకు అయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. 

► ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్‌ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరిలు నోరుమెదపలేదు.  

► 2014, ఏప్రిల్‌ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర  ప్రభుత్వానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ లేఖ రాసినా చంద్రబాబు స్పందించలేదు.  

► 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం 2014, ఏప్రిల్‌ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులు ఇవ్వాలంటూ 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు.  

► 2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.30,610 కోట్లు. ఇందులో ఇప్పటివరకూ చేసిన ఖర్చు రూ.20,702 కోట్లు మినహాయిస్తే ఇంక కేంద్రం ఇవ్వాల్సింది కేవలం రూ.9,908 కోట్లు మాత్రమే.  

► జాతీయ ప్రాజెక్టుల మార్గదర్శకాల ప్రకారం ప్రా­జెక్టు అంచనా వ్యయాన్ని ప్రతి మూడేళ్లకు ఒక సారి సవరించాలి. కానీ.. చంద్రబాబు వాటికి విరుద్ధంగా 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. 

► 2017–18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లుగా సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించింది. ఇందులో భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పన వ్యయమే రూ. 33,168.23 కోట్లు. కానీ.. 2013–14 ధరల ప్రకారం నిధులు ఇస్తే చాలని నాటి సీఎం చంద్ర­బాబు ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. 20­13–14 ధరల ప్రకారం చూస్తే ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ ఇంక రావాల్సింది కేవలం రూ. 9,908 కోట్లే. ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తవుతుందన్నది చంద్రబాబుకే తెలియాలి. 

► బాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోంది. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని గత 45 నెలలుగా ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్‌ శక్తి శాఖ మంత్రులను సీఎం జగన్‌ కోరుతూ వస్తున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement