సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీట్టిమట్టం 854 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు ఆర్‌ఎంసీ (రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ)కి ఏపీ ఈఎన్‌సీ సి. నారాయణరెడ్డి కోరారు. కనీస నీటిమట్టానికంటే దిగువ నుంచి నీటిని దిగువకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం ఆర్‌ఎంసీ భేటీ జరిగింది. కన్వీనర్ ఆర్కే పిళ్‌లై, బోర్డు సభ్యులు ఎల్బీ ముయన్‌తంగ్, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్‌కో డైరెక్టర్ ఎమ్వీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్‌సీ, జెన్‌కో డైరెక్టర్ వరుసగా రెండో సమావేశానికీ గైర్హాజరయ్యారు. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను నారాయణరెడ్డి కమిటీకి వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులని.. అంతకంటే దిగువ స్థాయి నుంచి నీటిని దిగువకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించవచ్చునని తేల్చిచెప్పారు.
సీడబ్ల్యూసీ ఆమోదించిన మేరకు..
కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు సాంకేతిక అనుమతిచ్చిన సమయంలో కేంద్ర జలసంఘం ఆమోదించిన ప్రకారం కృష్ణా డెల్టాకు, సాగర్ ఎడమ, కుడి కాలువలకు నీటిని విడుదల చేయాలని ఆర్‌ఎంసీని ఈఎన్‌సీ నారాయణరెడ్డి కోరారు. అదే రీతిలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీలకు హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు.
కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో.. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం వరద జలాలను మళ్లించినా.. వాటిని నికర జలాల్లో (కోటా) కలపకూడదని పునరుద్ఘాటించారు.
ఆ అధికారం ట్రిబ్యునల్‌దే..
పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో సాగర్‌కు ఎగువన 45 టీఎంసీలను అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కల్పించిందని ఆర్‌ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై గుర్తుచేశారు. వాటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామంటూ ఆయన చేసిన ప్రతిపాదనపై నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఆ అంశం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని.. దానిపై నిర్ణయాధికారం ట్రిబ్యునల్‌దేనన్నారు. ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను విన్నాక పిళ్లై స్పందిస్తూ.. 6న మూడో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. దానికి తెలంగాణ అధికారులు గైర్హాజరైతే.. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ దృష్టికి తీసుకెళ్లి.. తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment