కాళేశ్వరం సీఈ లేఖ ఇచ్చాకే సంతకం చేశా
సీడీఓ రిటైర్డ్ సీఈ నరేందర్‌రెడ్డి వెల్లడి
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రశ్నలకు సమాధానం
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు అధిపతిగా ఈఎన్‌సీ ఉండాలి. సీడీఓ కింద హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్ విభాగాలకు వేర్వేరు సీఈలు పనిచేయాలి. డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సీడబ్ల్యూసీకి పంపించడా నికి ముందు హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్, డిజైన్స్‌కి సంబంధించిన నిబంధనలన్నీ అమలు చేసినట్టు ధ్రువీకరిస్తూ చెక్‌లిస్టుపై సీడీఓ ఈఎన్‌సీ సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో సీడీఓ ఈఎన్‌సీ లేరు.
చెక్‌లిస్టుపై సంతకం చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ (హైదరాబాద్) హరి రామ్.. నన్ను కోరగా..హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్స్ విభాగాలు నా పరిధిలోకి రానందున సంతకం చేసేందుకు నిరాకరించా. బరాజ్‌ల డిజైన్లన్నీ సిద్ధమయ్యాక సంతకం ఎందుకు పెట్టడం లేదు? సమస్యేమిటి? అని నాటి సీఎం (కేసీఆర్), ఇరిగేషన్ మంత్రి (హరీశ్‌రావు) ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని సీడీఓ విభాగం రిటైర్డ్ సీఈ డి.నరేందర్‌రెడ్డి.. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్‌కు తెలిపారు.
హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాలకు పూర్తిగా తనదే బాధ్యత అని అంగీకరిస్తూ హరిరామ్ లేఖ ఇచ్చాకే తాను చెక్‌లిస్టుపై సంతకం చేశానని చెప్పారు. అయితే డిజైన్లు సీడబ్ల్యూసీకి సమర్పించడానికి ముందు ఈ లేఖను తొలగించారని ఇటీవల తనకు తెలిసిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా కమిషన్ గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో నరేందర్‌రెడ్డికి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది.
ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద సంపాదించిన హరిరామ్ లేఖను నరేందర్‌రెడ్డి కమిషన్‌కు ఆధారంగా అందజేశారు. ఎల్ అండ్ టీ ఇచ్చిన డిజైన్లను మక్కికి మక్కీగా కాపీ ఎందుకు చేశారు? మెదడును ఎందుకు వినియోగించలేదు? అని కమిషన్ నిలదీయగా, ఆయన పైవిధంగా స్పందించారు. కమిషన్ సంధించిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
మేడిగడ్డ డిజైన్ల రూపకల్పనలో ఎల్ అండ్ టీ పాత్ర
‘మేడిగడ్డ బరాజ్ డిజైన్ల రూపకల్పనతో తమకు సంబంధం లేదని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ పేర్కొనడం పూర్తిగా అవాస్తవం. డిజైన్ల ప్రతిదశలో ఎల్ అండ్ టీ పాలుపంచుకుంది. నాటి సీఎం (కేసీఆర్) సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో పనిభారం తీవ్రంగా ఉందనే చర్చ జరగగా, మేడి గడ్డ బరాజ్ డిజైన్లు, డ్రాయింగ్స్‌కు రూపకల్పన చేస్తామని ఎల్ అండ్ టీ సీఎండీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
ఆ సంస్థతో కలిసి సీడీఓ ఇంజనీర్లు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను రూపొందించారు. ఎల్ అండ్ టీ, సీడీఓ మధ్య ఈ–మెయిల్ ద్వారా జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలతో రూపొందించిన 600 పేజీల బుక్‌లెట్ సీడీఓ వద్ద ఆధారంగా ఉంది. (రుజువుగా కొన్ని మెయిల్స్‌తో కూడిన పత్రాలను కమిషన్‌కు అందజేశారు).
కాళేశ్వరం నిర్మించాలన్న నిర్ణయం ఎవరిదో తెలియదు
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలన్న ఆలోచన ఎవరిదో నాకు తెలియదు. సీఎం వద్ద జరిగిన సమావేశాలకు ఎన్నడూ సీడీఓ ఇంజనీర్లను పిలవలేదు. డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పనకే సీడీఓ పాత్ర పరిమితం. బరాజ్‌ల 3డీ మోడల్ స్టడీస్‌ను సీడీఓ డిజైన్లు ఇచ్చిన తర్వాతే చేయాలి. నాటి ప్రభుత్వం, సీఎం, మంత్రి వెంటబడడంతో సీడీఓ డిజైన్లు ఇవ్వడానికి ముందే 3డీ మోడల్ స్టడీస్‌ను తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ (టీఎస్‌ఈఆర్‌ఎల్) నిర్వహించింది.
2డీ మోడల్ స్టడీస్ ఫలితాలు మాత్రమే డిజైన్ల తయారీకి ముందు మాకు అందాయి. బరాజ్ నుంచి వరద సెకనుకు 6 మీటర్ల వేగం (షూటింగ్ వెలాసిటీ)తో బయటికి దూసుకొస్తుందనే అంచనాలతో డిజైన్లను రూపొందించాం. కానీ సెకనుకు 15–16 మీటర్ల వేగంతో ప్రయాణి స్తున్నట్టు నిర్ధారణ జరిగింది.
నిర్మాణ, నిర్వహణ లోపంతోనే బరాజ్‌లు విఫలం
నిర్మాణంలో నాణ్యతా లోపం, నిర్మాణం పూర్తైన తర్వాత వర్షాలకు ముందు, తర్వాత నిర్వహణ, పర్యవేక్షణ చేపట్టకపోవడం, గేట్ల నిర్వహణలో కోడ్ పాటించకపోవడం, మేడిగడ్డ బరాజ్‌లో బుంగలు ఏర్పడితే నాలుగేళ్ల పాటు పూడ్చివేయ కపోవడం వంటి కారణాలతోనే బరాజ్‌లు విఫలమయ్యాయి..’ అని నరేందర్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment