సాక్షి,ఢిల్లీ: పార్టీ పవర్‌లో ఉన్న హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంపై కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం(జూన్8) ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
‘అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ సరైన ఫలితాలు సాధించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మంచి ఫలితాలు లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగలేదు. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లు రాణించలేదు. ఇలాంటి రాష్ట్రాలపై త్వరలోనే ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తాం. అర్జెంటుగా వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది.
సాంప్రదాయంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదు. ఎన్నికల్లో ఇండియా కూటమి మంచి ఫలితాలు సాధించింది. ఇండియా కూటమి భవిష్యత్తులో కొనసాగాలి.
ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలి. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన నమ్మకం నిలబెట్టుకోవాలి. నిరంకుషత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గత పదేళ్ల పాలనను ప్రజలు తిరస్కరించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు, సీట్లు పెరిగాయి’అని ఖర్గే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment