balrampur
-
యూపీలో వర్షాలకు 10 మంది బలి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్ల గోడలు కూలిన ఘటనలు, పిడుగుపాట్లతో 10 మంది చనిపోగా మరో 12 మంది గాయపడ్డారు. ఇటావా జిల్లా చంద్రపుర గ్రామంలో బుధవారం రాత్రి మూడు చోట్ల నివాసాల గోడలు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చిన్నారులు సహా ఏడుగురు మృత్యువాతపడగా మరో ముగ్గురు గాయపడ్డారు. ఇటావాలో 24 గంటల వ్యవధిలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం తెలిపింది. ఫిరోజాబాద్‌లో ఇళ్ల గోడలు కూలిన ఘటనల్లో ఒక చిన్నారి సహా ఇద్దరు చనిపోగా మరో 8 మంది గాయపడ్డారు. బలరాంపూర్ జిల్లా బర్గద్వా సయీఫ్ గ్రామంలో పిడుగుపాటుకు గురై ఒక బాలుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. అలీగఢ్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శనివారం వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. -
‘రోడ్డుపై మరణిస్తే చెత్త వ్యాన్‌లో తరలించారు’
లక్నో : రోడ్డుపై విగతజీవిగా పడిఉన్న వ్యక్తిని కరోనా వైరస్‌తో మరణించాడనే భయంతో మున్సిపల్ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలో విసిరిపడేసిన ఘటన యూపీలోని బలరాంపూర్‌లో వెలుగుచూసింది. మొబైల్ ఫోన్లో ఈ అనాగరిక చర్యను కొందరు చిత్రీకరించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. బలరాంపూర్‌కు చెందిన మహ్మద్ అన్వర్ (42) స్ధానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో గేట్ వద్దే కుప్పకూలి మరణించారు. వీడియో ఫుటేజ్‌లో దృశ్యాల ఆధారంగా మృతదేహం కిందపడిఉండగా, పక్కనే వాటర్ బాటిల్ కనిపించింది. మృతదేహం వద్ద పోలీసులు ఉండగా, పక్కనే అంబులెన్స్ అందుబాటులో ఉన్నట్టు కనిపించింది. పోలీసుల ఎదుటనే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముగ్గురు చెత్తను తరలించే వాహనంలోకి మృతదేహాన్ని విసిరిన ఘటన రికార్డయింది. ఈ ఘటన అమానుషమని బలరాంపూర్ పోలీస్ చీఫ్ దేవరంజన్ వర్మ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం దోషులపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. కరోనా వైరస్‌తో ఆ వ్యక్తి మరణించాడనే భయంతోనే మున్సిపల్ సిబ్బంది ఈ చర్యకు పాల్పడిఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్స్ ధరించి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించాల్సి ఉందని అన్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరు సరైంది కాదని తప్పుపట్టారు. దీనిపై సీనియర్ అధికారులతో విచారణ చేపట్టాలని ఆదేశించామని వెల్లడించారు. కాగా అన్వర్ మరణానికి కారణమేంటి, ఆయనకు కరోనా వైరస్ సోకిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. చదవండి : ‘ఇలాగైతే మళ్లీ లాక్డౌన్’ -
పెళ్లి కోసం 800 కిలోమీటర్ల ప్రయాణం.. చివరికి
బలరాంపూర్ : పెళ్లి కోసమని ఒక యువకుడు బైక్‌పై తన స్నేహితులతో కలిసి పగలు, రాత్రి తేడా లేకుండా దాదాపు 850 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇంకా 150 కిలోమీటర్లు వెళితే తన గమ్యాన్ని చేరుకుంటాననే సంతోషంలో ఉన్న యువకుడు క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ వింత ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన సోనూ కుమార్ చౌహాన్ అనే 24 ఏళ్ల వ్యక్తి పంజాబ్‌లోని లుధియానాలోని టైల్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించకముందు ఏప్రిల్ 15న సోనూ పెళ్లి నిశ్చయం అయింది. అయితే లాక్డౌన్ కారణంగా సోనూ పంజాబ్‌లోనే చిక్కుకుపోయాడు. (2 నెలల శిశువుకు కరోనా.. క్వారంటైన్లోకి వైద్య సిబ్బంది) ఈ నేపథ్యంలో పెళ్లి సమయం దగ్గరపడడంతో ఎలాగైనా వెళ్లాలని భావించాడు. నేపాల్ సరిహద్దులో ఉన్న మహారాజ్‌గంజ్ జిల్లాలో సోనూ పెళ్లి జరగనుంది. అయితే లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దవడంతో తమ సొంత బైకులపై దాదాపు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. సోనూ తన ముగ్గురు స్నేహితులతో కలిసి లుధియానా నుంచి రెండు బైక్‌లపై బయలుదేరారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దాదాపు 850 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇంకా 150 కిలోమీటర్లు చేరితే గమ్యస్థానం చేరుకుంటామనేలోపు ఆదివారం ఉదయం యూపీలోని బలరామ్‌పూర్ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. (మే 3 తర్వాత విమాన సర్వీసులు నడుస్తాయా!) కరోనా వైరస్ విస్తురిస్తున్న సమయంలో ఇలా ప్రయాణం చేయడమేంటని ఆగ్రహించిన పోలీసులు సోనూతో సహా మిగతా ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించారు. ఇదే విషయమై సోనూ చౌహాన్‌ను కదిలించగా.. 'ఈ సమయంలో ఇలాంటి ప్రయాణం చేయడం రిస్కే. కానీ పెళ్లి కావడంతో ఈ పని చేయాల్సి వచ్చింది. ఇంకో 150 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మా ఊరికి వెళ్లేవాడిని. కానీ పోలీసు అధికారులు అడ్డుకొని ఇప్పుడు నీ పెళ్లి కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారని' ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే విషయమై బలరాంపూర్ ఎస్పీ దేవ్ రాజన్ వర్మ మాట్లాడుతూ.. 'బలరాంపూర్ జిల్లా సరిహద్దుకు వద్దకు రాగానే సోనూ చౌహాన్‌తో పాటు మిగతా ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించాం. 14 రోజుల క్వారంటైన్ అనంతరం కరోనా పరీక్షలో నెగిటివ్ వస్తే వారిని వదిలేస్తాం.అంతవరకు క్వారంటైన్లో ఉండాల్సిందే' అంటూ స్పష్టం చేశారు. -
లీవ్ కావాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే
బలరామ్‌పూర్ : మనకు ఎప్పుడైనా లీవ్ కావాలంటే ఏం చేస్తాం ! వెంటనే మెయిల్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో సమాచారాన్ని అందిస్తాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీసులు మాత్రం తమకు లీవ్ కావాలంటే దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలని జిల్లా ఎస్పీ రంజన్ వర్మ కోరారు. బలరాంపూర్ జిల్లాలో పనిచేస్తున్న పోలీసులు అందుకోసం ప్రతిరోజు వీలైనన్ని ఇంగ్లీష్ దినపత్రికలను చదవడం అలవాటు చేసుకోవాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు, పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లో వర్క్‌షాప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. తన ఆదేశాల ప్రకారం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పలువురు పోలీసు అధికారులు డిక్షనరీలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. 'ఈ నిర్ణయం తీసుకోవడానికి నా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. సైబర్ క్రైమ్, నిఘా సంస్థల నుంచి మాకు వస్తున్న ఫిర్యాదులు అన్నీ ఇంగ్లీష్‌లోనే వస్తాయి. మా పోలీసులకు ఇంగ్లీష్ మీద కనీస పరిజ్ఞానం లేకపోవడంతో వచ్చిన ఫిర్యాదులను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు తేలింది. అందుకే మా పోలీసులు ఇంగ్లీష్ మీద కనీస అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో సెలవు కావాలంటే దరఖాస్తును తప్పనిసరిగా ఇంగ్లీష్‌లోనే పెట్టుకోవాలన్న కండీషన్ పెట్టినట్లు' ఎస్పీ రంజన్ వర్మ చెప్పుకొచ్చారు. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రంజన్ వర్మ విధుల్లో చేరినప్పటి నుంచి తాను పని చేసిన ప్రతీ చోట ఇంగ్లీష్‌ను నేర్చుకోవాలనే నిబంధనను అమలు చేసేవారు. ' ఇప్పుడిప్పుడే మా కానిస్టేబుళ్లు గూగుల్ సహాయంతో తమ లీవ్‌కు సంబంధించిన దరఖాస్తును ఇంగ్లీష్‌లోనే చేసుకుంటున్నారని, ఇది ఇతర ప్రాంతాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో అమలు అయ్యే విధంగా చూస్తానని' ఆయన తెలిపారు. రంజన్ వర్మ తీసుకున్న నిర్ణయం పట్ల పోలీసు ఉన్నతాధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసులకు దీన్ని అమలు చేసే విషయమై సీఎం యోగి ఆదిత్యానాథ్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు లక్నోకి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. -
స్కూల్లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్ షాక్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హైటెన్షన్ వైర్లు తలగడంతో 51 మంది విద్యార్థులు విద్యుదాఘాతానికి గురయ్యారు. బలరామ్పూర్లోని నయానగర్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోజూలాగే ఉదయం పది గంటల ప్రాంతంలో విద్యార్థులు చెప్పులు విడిచి గన్నీ సంచులపై చెట్లకు ఆనుకుని కూర్చోబోయారు. అయితే కాస్త తేమగా ఉండటంతో చెట్లకు ఆనుకున్న హైటెన్షన్ వైర్ల నుంచి కరెంట్ ప్రసరించింది. దీంతో అక్కడున్న పిల్లలు ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురయ్యారు. కొందరు పిల్లలు ఆర్తనాదాలు పెట్టగా, మరికొందరు ఏకంగా స్పృహ కోల్పోయారు. ఉపాధ్యాయులకు చెప్పులు విప్పే నిబంధన లేనందున వారంతా తప్పించుకోగలిగారు. పిల్లల తల్లిదండ్రుల సాయంతో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఘటనా స్థలంలోని ఉపాధ్యాయుడు రిచా సింగ్ మాట్లాడుతూ.. ‘కొన్ని క్షణాలపాటు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి లోనయ్యాం. మాలో ఒకరు అది విద్యుదాఘాతంగా గుర్తించటంతో విద్యుత్ సిబ్బందికి కాల్ చేశాం. 15 నిమిషాలకు గానీ వారు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత వారికి సమాచారం అందించగానే విద్యుత్ ప్రసారాన్ని నిలిపివేశారు’ అని తెలిపారు. జిల్లా న్యాయవాది కృష్ణ కరుణేష్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. గాయపడ్డ విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన కాంట్రాక్ట్ లైన్మెన్ను తొలగించడంతోపాటు, జూనియర్ ఇంజనీర్ ప్రియదర్శి తివారీపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి రాంప్రతాప్ వర్మ ఆసుపత్రిని సందర్శించి పిల్లల తల్లిదండ్రులకు భరోసానిచ్చారు. -
చీకటి చదువులు.. ఇంకెన్నాళ్లు?
రాయ్‌పూర్ : దేశవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. చత్తీస్‌ఘడ్‌లోని ఓ గ్రామంలో మాత్రం గత కొన్నేళ్లుగా విద్యార్థులు సవాళ్లు ఎదుర్కుంటున్నారు. చిమ్మచీకటిలో లాంతరు వెలుగుల మధ్య చదువుకోవాల్సిన పరిస్థితి వాళ్లది. బలరాంపూర్ జిల్లాలోని త్రిశూల్ గ్రామంలో పరిస్థితి ఇది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా కూడా ఈ గిరిజన గ్రామానికి కరెంట్ సరఫరా లేదు. జిల్లా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని అయినా కూడా పరిస్థితి మారలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నామని.. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అయితే గ్రామానికి 15 కి.మీ దూరంలో ఉన్న బీజేపీ ఎంపీ రాంవిచార్ నేతమ్ ఇంటికి మాత్రం నిత్యం కరెంట్ సరఫరా ఉండటాన్ని వారు ప్రస్తావించారు. మరోవైపు గ్రామంలో ప్రైమరీ ఎడ్యూకేషన్ ప్రారంభించినాకూడా సరైన రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరు కూడా పాస్ కాలేదు.. ఇప్పటివరకూ ఈ గ్రామంలో ఒక్కరు కూడా పదోతరగతి పాస్ అవ్వలేదని గ్రామస్థులు చెబుతుండగా, కరెంట్ లేకపోవడంతో సరిగ్గా చదవలేక ఫెయిల్ అవుతున్నట్లు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. త్వరలో సమస్యకు పరిష్కారం.. పొరుగునే ఉన్న బుండిపాకు గ్రామానికి కరెంట్ సరఫరా ప్రారంభించామని.. త్వరలోనే త్రిశూల్ గ్రామానికి కూడా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. -
బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం
ఛత్తీస్‌ఘడ్: బస్సు ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా, 48 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని బలరాంపూర్ జిల్లాలో బుధవారం రాత్రి 10.30 సమయంలో చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న బస్సు మోటార్ సైకిల్‌ను తప్పించడానికి ప్రయత్నించగా, అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి పడిపోయింది. జార్ఖండ్‌లోని గద్వా నుంచి రాయ్‌పుర్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయ బృందం ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
మోడీది అధికార దాహం
బల్రాంపూర్/ఫైజాబాద్: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై సోనియా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీ అధికార దాహంతో ఉన్నారని, ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే తనను తాను ప్రధానిగా భావిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ‘మోడీ అధికార వ్యామోహంతో ఊగిపోతున్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వచ్చేసినట్టుగా, ఆయన ప్రధాని అయిపోయినట్టుగా భావిస్తున్నారు’ అని సోనియా ఎద్దేవా చేశారు. ఈ మేరకు యూపీలోని బల్రాంపూర్, ఫైజాబాద్‌లలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మోడీపై సోనియా నిప్పులు చెరిగారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలనే విషయం నిర్ణయించాల్సింది ప్రజలేనన్న అంశాన్ని మోడీ విస్మరిస్తున్నారని చురకలంటించారు.