లక్నో : రోడ్డుపై విగతజీవిగా పడిఉన్న వ్యక్తిని కరోనా వైరస్‌తో మరణించాడనే భయంతో మున్సిపల్ సిబ్బంది చెత్తను తరలించే వాహనంలో విసిరిపడేసిన ఘటన యూపీలోని బలరాంపూర్‌లో వెలుగుచూసింది. మొబైల్ ఫోన్‌లో ఈ అనాగరిక చర్యను కొందరు చిత్రీకరించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. బలరాంపూర్‌కు చెందిన మహ్మద్ అన్వర్ (42) స్ధానిక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన క్రమంలో గేట్ వద్దే కుప్పకూలి మరణించారు. వీడియో ఫుటేజ్‌లో దృశ్యాల ఆధారంగా మృతదేహం కిందపడిఉండగా, పక్కనే వాటర్ బాటిల్ కనిపించింది. మృతదేహం వద్ద పోలీసులు ఉండగా, పక్కనే అంబులెన్స్ అందుబాటులో ఉన్నట్టు కనిపించింది. పోలీసుల ఎదుటనే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముగ్గురు చెత్తను తరలించే వాహనంలోకి మృతదేహాన్ని విసిరిన ఘటన రికార్డయింది.
ఈ ఘటన అమానుషమని బలరాంపూర్ పోలీస్ చీఫ్ దేవరంజన్ వర్మ పేర్కొన్నారు. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం దోషులపై కఠిన చర్యలు చేపడతామని అన్నారు. కరోనా వైరస్‌తో ఆ వ్యక్తి మరణించాడనే భయంతోనే మున్సిపల్ సిబ్బంది ఈ చర్యకు పాల్పడిఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. పీపీఈ కిట్స్ ధరించి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించాల్సి ఉందని అన్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరు సరైంది కాదని తప్పుపట్టారు. దీనిపై సీనియర్ అధికారులతో విచారణ చేపట్టాలని ఆదేశించామని వెల్లడించారు. కాగా అన్వర్ మరణానికి కారణమేంటి, ఆయనకు కరోనా వైరస్ సోకిందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment