టీడీపీ నేతలకు భంగపాటు
- ఎస్పీ సెంథిల్‌కుమార్ జిల్లాకు రాక రేపు
- 31న బాధ్యతల స్వీకరణ !
నెల్లూరు(క్రైమ్): జిల్లా ఎస్పీగా సెంథిల్‌కుమార్ నియామకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలకు భంగపాటు ఎదురైనట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ బుధవారం నెల్లూరుకు రానున్నారు. గురువారం ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. ఆయనను నెల్లూరు ఎస్పీగా బదిలీ చేస్తూ ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం బాధ్యతల నుంచి రిలీవ్ అయిన వారు వారం రోజుల్లోపు నియమించిన చోట విధుల్లో చేరాలి.
ఈ నెల 21న సెంథిల్‌కుమార్ అనంతపురం ఎస్పీ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. నెల్లూరులో 22న రిలీవ్ అయిన నవదీప్‌సింగ్‌గ్రేవాల్ సోమవారం విజయనగరం వెళ్లారు. అయితే సెంథిల్‌కుమార్ బాధ్యతలు చేపట్టే విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయనకు ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. అనంతపురంలో ఆయన రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతల సిఫార్సులను కూడా ఖాతరు చేయని అధికారిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయన నెల్లూరు ఎస్పీగా నియమితులు కావడంతో జిల్లా టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది.
అనంతపురం నాయకుల ద్వారా ఎస్పీ గురించి తెలుసుకుని ఆయన నియామకాన్ని ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సెంథిల్‌కుమార్ స్థానంలో సూర్యనారాయణరావు పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ నేతల ఒత్తిళ్లు ఫలించాయని, సూర్యనారాయణరావు ఎస్పీగా బాధ్యతలు చేపడతారని ప్రచారం జరిగింది. సెంథిల్‌కుమార్ కూడా రిలీవ్ అయిన వారం తర్వాత కూడా బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆయన నియామకం ఆగిందని భావించారు.
వీటిన్నింటికి ఫుల్‌స్టాప్ పెడుతూ ఆయన గురువారం బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసుశాఖలోని పలువురు అధికారులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. విధినిర్వహణలో బాధ్యతారాహిత్యం, అక్రమాలను సెంథిల్‌కుమార్ సహించరనే పేరుండడంతో హడలిపోతున్నారు.