గతం కాదు.. ఇప్పుడు చూడండి
►కోడిపందాలపై జిల్లా ఎస్పీ శపథం
► ఆదేశాలు లెక్క చేయకపోతే రౌడీషీట్లు తెరుస్తాం
ఉండి : గతంలో కోడిపందాలపై ఎవరు ఎలా వ్యవహరించారో నాకు తెలియదు కాని నేను మాత్రం కచ్చితంగా ఆపి తీరుతా అని శపథం చేశారు జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్. సోమవారం ఉండి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోడిపందాలు, పేకాట తదితర దురలవాట్ల వల్ల చాలా కుటుంబాలు వీధిన పనడుతున్నాయన్నారు. అందుకే సంక్రాంతి పండగకు ముందుగానే జిల్లావ్యాప్తంగా సుమారు 600 బైండోవర్ కేసులు నమోదు చేశామని అన్నారు.
కోడిపందాలపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లాలో ఆరు ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయని చెప్పారు. పందాల నిర్వహణకు ఏర్పాట్లు చేసినా రౌడీషీట్లు తెరుస్తామని అన్నారు. పందాల నిర్వహణపై పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై ప్రతిరోజూ కేసులూ నమోదు చేస్తున్నామని తెలిపారు. కోడిపందాలపై రెండు నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ విడుదల చేస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా 167 సీసీ కెమెరాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసామన్నారు. హెల్మెట్ ధారణను భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. పోలీసుల బాధ పడలేకపోతున్నాం అని అనుకోకుండా కుటుంబాలను, జీవితాలను కాపాడుకుంటున్నాం అనే మంచి ఆలోచనతో హెల్మెట్ ధరించాలన్నారు. జిల్లాల్లో 2014లో రూ.2.80 కోట్లు, 2015లో రూ.3.70 కోట్ల సొత్తును రికవరీ చేశామని తెలిపారు.
రాష్ట్రాన్ని వణికించిన సైకో సూదిగాడి కోసం ఇంకా గాలింపు జరుపుతున్నామన్నారు. సీసీ కెమెరాలలో క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో నిందితుడిని పట్టుకోలేకపోయామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ అమర్‌నాథ్‌నాయుడు, సీఐ ఆర్‌జే జయసూర్య, ఎస్సై ఎం.రవివర్మ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.