‘సోషియాలజీలో రోల్ ప్లే అనే అంశంపై ఒక పాఠం ఉంది. ఎవరి పని వారు చేసుకుంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుందన్నది దాని సారాంశం. పోలీసు శాఖకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎవరో ఆదేశించారనో.. ఇంకెవరో ఒత్తిడి చేశారనో.. ప్రజలు ప్రశ్నిస్తారనో.. కాకుండా బాధ్యతతో కర్తవ్యం నిర్వర్తించడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలుగుతాం.’
శ్రీకాకుళం క్రైం: ‘సహజంగా శ్రీకాకుళం ప్రశాంతమైన జిల్లా. కానీ సమాజంలో చోటు చేసుకుంటన్న ఆర్థికపరమైన మార్పులు.. అవసరాలు ఒకింత శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నాయి. అయితే వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలకు భద్రత కల్పించేందుకు మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం’.. అని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ) ఎ.ఎస్.ఖాన్ చెప్పారు. టెక్కలిలో ఇటీవల జరిగిన వరుస సంఘటనలు కలచివేశాయని.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఆగంతకులు ఇక్కడ నేరాలకు పాల్పడి పరారవుతున్న గుర్తించామని.. ఇటువంటివారి ఆట కట్టించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో జరిగే నేరాలు, పోలీసు శాఖ ఆధునికీకరణ ఆటో కార్మికుల ఆందోళన తదితర అంశాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ సవివరంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
వేసవి కాలం తస్మాత్ జాగ్రత్త
ఇటీవల జిల్లాలో జరుగుతున్న వరుస నేరాలపై దృష్టి సారించాం. బంగారంపై ఉన్న మక్కువతో మహిళలు అధికంగా నగలు ధరించి విందు వినోద శుభకార్యాలకు హాజరవుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని చోరులు రెచ్చిపోతున్నారు. అందుకే మహిళలు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చోరులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రజలు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా చోరులకు అవకాశం కల్పిస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని టైటాన్ షోరూమ్‌లో జరిగిన లూటీ సంఘటనపై విచారణ వేగవంతం చేశాం. ఈ సంఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన చోరులు పాల్గొన్నట్టు గుర్తించాం. పెండింగ్ కేసుల విచారణపై ప్రత్యేక దృష్టి సారించాం.
సిబ్బందిలో మార్పు రావాలి
తమ ధన, మాన, ప్రాణాలకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజల పట్ల పోలీసు సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. శాంతిభధ్రతలు, నేర నియంత్రణ, ట్రాఫిక్ తదితర విషయాల్లో హోంగార్డు నుంచి అధికారి స్థాయి వరకు బాధ్యతగా వ్యవహరింలి.
ఆటోవాలాలు సహకరించాలి
రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోలు జాతీయ రహదారిపై ప్రయాణించటం నేరం. నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి ఆటోలు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇటీవల నరసన్నపేట, శ్రీకాకుళం శివారు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలే దీనికి నిదర్శనం. ఆందుకే రవాణా శాఖతో కలిసి పోలీసులు జాతీయ రహదారిపై సంయుక్త దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. జాతీయ రహదారిపై అండర్ పాసేజ్‌లు, ఓవర్ బ్రిడ్జిలు లేకపోవటం కూడ రోడ్డు ప్రమాదాలకు మరో కారణంగా గుర్తించాం. ఆటో యాజమానులను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేస్తాం. శ్రీకాకుళం పట్టణ పరిధిలో పార్కింగ్ ప్రాంతాలు, ముఖ్య కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని నియంత్రించేందుకు బ్రిత్ ఎనలైజర్లు ప్రవేశపెట్టే విషయాన్ని మున్సిపల్ అధికారులతో చర్చించాం.
కొత్త వాహనాలివే...
రాత్రి పూట గస్తీ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కొత్త వాహనాలను, సిబ్బందిని సమకూర్చుతున్నాం. పాలకొండ, నరసన్నపేట, రాజాం, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, టెక్కలి ప్రాంతాల్లో కొత్త రక్షక్ వాహనాలను, జాతీయ రహదారిపై వాహనాల వేగ నియంత్రణ కోసం ఇన్‌ట్రాసెక్టర్ వాహనాలను రప్పించనున్నాం. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణకు ఎనిమిదిమంది సిబ్బందిని పంపించాం. ప్రస్తుతం జిల్లాలో నాలుగు హైవే పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయి. మరో రెండు కొత్త వాహనాలు రానున్నాయి. డయల్-100 పేరిట రెండు కొత్త పెట్రోలింగ్ వాహనాలను తెప్పిస్తున్నాం. రాత్రి గస్తీని పటిష్టం చేసేందుకు నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. రామలక్ష్మణ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, ఇలిసిపురం తదితర ప్రాంతాల్లో ఉన్న పోలీసు సబ్ కంట్రోల్ రూమ్‌లను అధునికీకరిస్తాం.
ప్రజా ఆస్తుల రక్షణే కర్తవ్యం
Published Sun, Mar 8 2015 3:00 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement