Public Safety
-
మతంతో సంబంధం లేదు.. ఆ నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మత విశ్వాసాల కంటే ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లు, స్థలాల్లో బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ మంగళవారం విచారణ జరపింది.ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లౌకిక (సెక్యూలర్) దేశమని.. మతాలతో సంబంధం లేకుండా ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్తో చర్యలు అందరికీ ఒక్కటేనని పేర్కొంది. మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయని తెలిపిన ధర్మాసనం.. వీటికి ఆన్లైన్ పోర్టల్ కూడా ఉండాలని తెలిపింది. వాటిలో డిజటలైజ్ రికార్డులు అందుబాటులో ఉంచడం ప్రజలు అన్నీ తెలుసుకోగలరని వెల్లడించింది.గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉండటమే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవడానికి కారణమా అని ధర్మాసనం ఆయన్ను అడగ్గా.. ‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ముందే చట్టాన్ని అతిక్రమంచి ఉంటేనే చర్యలు తీసుకొంటాం’ అని తెలిపారు.అలాగే ఒకటీ రెండు సంఘటనల ఆధారంగా న్యాయస్థానం ఓ అంచనాకు రావద్దని కోరారు. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఉదంతాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ..‘ మనది సెక్యూలర్ దేశం. మా మార్గదర్శకాలు మతం, జాతి, వర్గాలకు అతీతంగా ఉంటాయి. అందరికీ వర్తిస్తాయి. ఇక ఆక్రమణల విషయానికి వస్తే మేము ఇప్పటికే చెప్పాం. రోడ్డు, ఫుట్‌పాత్, జలాశయం, రైలు పట్టాపై ఏదైనా మత సంబంధమైన నిర్మాణం ఉంటే అది దర్గా, గుడి, మసీదు, గురుద్వారా ఏదైనా.. ప్రజలకు ఆటంకంగా మారకూడదు. అక్రమ నిర్మాణాల విషయంలో మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటే చట్టం వర్తిస్తుంది’ అని వ్యాఖ్యానించింది. చదవండి:MUDA scam : సీఎం సిద్ధరామయ్య సతీమణి యూటర్న్యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో ఉండటమే వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడానికి ఆధారమా..? అని ఆయన్ను బెంచ్ ప్రశ్నించింది. దీనికి మెహతా స్పందిస్తూ.. ‘‘కచ్చితంగా కాదు. అత్యాచారం, ఉగ్రవాదం వంటి నేరాల్లో నిందితులైనా సంబంధం లేదు. ఒక్కరోజు ముందు నోటీసు జారీ చేసి ఇంటి గోడపై అంటించినా పరిగణలోకి తీసుకోం. ఇది ముందే జరిగిఉంటేనే చర్యలు తీసుకొంటాం’’ అని పేర్కొన్నారు. ఇక యూన్ రిపోర్టర్ సీనియర్ న్యాయవాది వ్రిందా గ్రోవర్ ఇళ్ల లభ్యతపై వాదనలు వినిపించగా.. దీనికి సొలిసిటర్ జనరల్ మెహతా అభ్యంతరం చేశారు.‘ఈ విషయాన్ని అంతర్జాతీయకరించాల్సిన అవసరం లేదని, మన రాజ్యాంగానికి, దేశ న్యాయస్థానాలకు తగినంత శక్తి ఉందన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ ఏజెన్సీ జోక్యం అవసరం లేదు’’ అని పేర్కొన్నారు.పిటిషనర్లలో ఒకరి తరఫు సీనియర్ న్యాయవాది సియు సింగ్ వాదిస్తూ.. బుల్డోజర్ చర్యను నేరాల నిర్మూలన చర్యగా ఉపయోగించకూడదనేది తన ఏకైక ఉద్దేశమని అన్నారు. మైనారిటీలపై బుల్డోజర్ చర్య చాలా తక్కువగా ఉంటుందని మెహతా అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘వారు ఒకరు ఇద్దరు లేరని.. 4.45 లక్షలు ఉన్నారని తెలిపింది.చివరగా.. కూల్చివేతలకున ఏరారోపణలు ఆధారం కూకూడదని, పౌర నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రమే కూల్చివేతలు జరగాలని కోర్టు స్పష్టం చేసింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న గతంలో జారీ చేసిన మధ్యంతరు ఉత్తర్వులను పొడిగించింది -
ప్రజల భద్రతలో ఆదిలాబాద్ జిల్లా టాప్
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల భద్రత విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో 5వ స్థానం దక్కింది. అలాగే రాష్ట్రంలో సురక్షిత జిల్లాగా మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి శనివారం ఒక నివేదికను విడుదల చేసింది. దీంతో జిల్లా పోలీసులకు ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ సర్వేలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, సైబర్‌క్రైమ్, హత్యలు, రోడ్డు ప్రమాదాలు, హింసాత్మక నేరాలు, వ్యక్తిగత భద్రత, తదితర అంశాలతో కూడిన 89 సూచికలను పరిగణనలోకి తీసుకున్నారు. కాగా, నాగలాండ్‌లోని మొఖోక్ జిల్లా 89.89 శాతం మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా 85 మార్కులతో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల పరంగా తెలంగాణకు 42 మార్కులు లభించాయి. రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా 81 మార్కులతో 2వ స్థానంలో నిలిచింది. భద్రత విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు మంచి ర్యాంకు దక్కడంపై జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దీంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని, పోలీసులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. -
ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం
-
మెహబూబా నిర్బంధం మరో 3 నెలలు
శ్రీనగర్: పీడీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మరో 3 నెలలు పొడిగించింది. గత ఏడాది ఆగస్టులో కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసిన సందర్భంగా ప్రజా భద్రత చట్టం కింద నిర్బంధంలోకి తీసుకున్న వారిలో మెహబూబా కూడా ఒకరు. ఆగస్టు 5వ తేదీ నాటికి ఆమె నిర్బంధకాలం ఏడాది పూర్తవుతుంది. దీంతో, మెహబూబా గృహ నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆమె తన అధికార నివాసం శ్రీనగర్‌లోని ఫెయిర్‌వ్యూ బంగళాలో ఉన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ చైర్మన్ సజ్జాద్ గనీ లోన్‌ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విషయాన్ని లోన్ కూడా ట్విట్టర్ ద్వారా నిర్ధారించారు. ఆయన కూడా దాదాపు ఏడాదిపాటు నిర్బంధంలో ఉన్నారు. పలువురు ప్రధాన రాజకీయ నేతలు సహా నేషనల్ కాన్ఫరెన్స్ అగ్ర నేతలు ఫరూఖ్ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. -
సేఫ్టీ 'షి'లబస్..
మహిళ భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో బృహత్తర కార్యచరణ సిద్ధం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఐదు డిగ్రీ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా విద్యార్థుల నేతృత్వంలో నడిచే పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవి మంచి ఫలితాలివ్వడంతో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల్లో పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభించనున్నారు. దీనికోసం 33 జిల్లాల నుంచి 2,200 కాలేజీల ప్రిన్సిపాళ్లను నగరానికి విమెన్ సేఫ్టీ వింగ్ ఆహ్వానించింది. వీరందరితో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులు హాజరవనున్నారు. – సాక్షి, హైదరాబాద్ స్కూలు, జిల్లా, రాష్ట్రస్థాయి క్లబ్‌లు.. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఇదే అతిపెద్ద కార్యక్రమం కావడం గమనార్హం. దీనిని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయాలని విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతిలక్రా నిర్ణయించారు. దీనికోసం స్కూలు, మండల, జిల్లా స్థాయిల్లో క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రవాణా, విద్యాశాఖ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు ఈ క్లబ్‌లకు మార్గదర్శకంగా ఉంటారు. దీనికోసం రవాణా, విద్య, స్త్రీశిశు సంక్షేమ శాఖలతో పోలీసు శాఖ ముందుగానే సమన్వయం చేసుకుంది. డిగ్రీ, పీజీ విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు నుంచి జూన్ వరకు ఏయే కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక సిలబస్ రూపొందించింది. ఏమేం చేస్తారు? - విద్యార్థులకు ఆత్మస్థైర్యం, సంకల్ప బలం పెంచే కార్యక్రమాల నిర్వహణ. ఆపదలో ఎలా వ్యవహరించాలి.. ఎవరిని సంప్రదించాలి.. అన్న విషయాల్లో శిక్షణ - సామాజిక, మహిళా, శిశు, రోడ్డు భద్రతల్లో వినూత్న ఆవిష్కరణలకు వ్యాసాలు, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు. వేధింపులు, సైబర్ నేరాలు, వర కట్నం, గృహ హింసలపై చైతన్యం చేయడం - పోలీస్స్టేషన్ల, భరోసా కేంద్రాల సందర్శన - చిన్నారుల్లో గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన. జిల్లా సేఫ్టీ క్లబ్ స్కూలు/కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ఇందులో జిల్లా విద్యాశాఖాధికారి, ఇద్దరు మహిళా ప్రముఖులు, అడిషనల్ ఎస్పీ ర్యాం కు ఆఫీసర్, ఐదు పాఠశాలల నుంచి ప్రతినిధులు, ఆర్టీఏ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, జిల్లా క్రీడా/యువజన అధికారి, స్వయం సహాయక బృంద నాయకురాలు ఉంటారు. స్కూలు/ కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్ ఇందులో ముగ్గురు పేరెంట్స్, 10 మంది విద్యార్థులు, ఒక లా అండ్ ఆర్డర్ మహిళా పోలీస్, ఒక ట్రాఫిక్ పోలీస్, గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకురాలు సభ్యులుగా ఉంటారు. వీరంతా తొలుత విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి రక్షణ, రోడ్డు భద్రత, డయల్ 100, ట్రాఫిక్ రూల్స్, హాక్ ఐ, షీటీమ్‌ల పనితీరు, వారిని ఎలా సంప్రదించాలి తదితర వివరాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు కూడా వీరు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. రాష్ట్ర స్థాయి క్లబ్‌లు జిల్లా స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు రాష్ట్ర సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ/విద్యాశాఖ కమిషనర్ నామినేట్ చేసిన రీజనల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్య కమిషనర్ నామినేట్ చేసిన మహిళా ప్రతినిధి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ లేదా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకు అధికారి, రవాణా శాఖ, రాష్ట్రస్థాయి యువజన క్రీడా ప్రతినిధి, మెప్మా నుంచి ఓ అధికారి ఉంటారు. -
పీఎస్ఏ : నిర్భంధంలోకి మరో కీలక నేత
న్యూ ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు చెందిన మరో కీలక నేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్ ని ప్రజా భద్రతా చట్టం కింద నిర్భధించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా షా ఫైజల్ గళమెత్తిన సంగతి తెలిసిందే. కాగా, 2009లో సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పిన షా ఫైజల్.. గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. జమ్మూ కశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ పార్టీని స్థాపించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిస్థితుల నేపథ్యంలో విదేశాలకు వెళ్తున్న ఫైజల్‌ను గతేడాది ఆగష్టు 14న ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకొని శ్రీనగర్‌కు తిప్పి పంపించారు. అనంతరం గృహ నిర్భంధంలో ఉంచారు. ఆర్నెళ్లపాటు నిర్భంధంలో ఉన్న ఫైజల్‌ను తాజాగా ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద మరోసారి అదుపులోకి తీసుకున్నారు. కాగా, పీఎస్ఏ కింద ఇప్పటికే జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతో పాటు పలువురు కశ్మీర్ నేతలను నిర్బంధంలోకి తీసుకున్నారు. పీఎస్ఏను అధికారికంగా జమ్మూ కశ్మీర్ ప్రజా భద్రతా చట్టం అని పిలుస్తారు. కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఫారూక్ అబ్దుల్లా తండ్రి, మాజీ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. పీఎస్ఏ కింద ఎలాంటి విచారణ లేకుండా.. రెండేళ్లపాటు నిర్బంధంలో ఉంచే వీలు ఉంటుంది. -
ఫరూక్‌ను చూస్తే కేంద్రానికి భయమా!?
సాక్షి, న్యూఢిల్లీ : గత నెల పదిహేను రోజులుగా గృహ నిర్బంధంలో ఉంచిన జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు ఫరూక్ అబ్దుల్లాపై కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా సోమవారం కశ్మీర్‌కే పరిమితమైన ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించింది. ఆయన్ని అరెస్ట్ చేసి, ఆయన ఇంటినే జైలుగా మార్చింది. ఆయన తరఫున దాఖలైన ‘హబియస్ కార్పస్’ పిటిషన్ విచారణకు రానున్న ఒక రోజు ముందు కేంద్రం ఈ చర్య తీసుకోవడం ప్రజాస్వామ్య వాదులకు ఆశ్చర్యం కల్గిస్తోంది. ఈ ప్రజా భద్రత చట్టం కింద ఎలాంటి విచారణ లేకుండా ఎవరినై రెండేళ్లపాటు జైల్లో ఉంచొచ్చు. ఫరూక్ అబ్దుల్లా తండ్రి షేక్ అబ్దుల్లా హయాంలో (1978లో) కలప స్మగ్లర్లను అణచివేయడం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే రానురాను కశ్మీర్ వేర్పాటువాదులను అణచివేసేందుకు దీన్ని ఉపయోగిస్తూ వచ్చారు. ముఖ్యంగా 1990, 2008, 2010, 2016లలో కశ్మీర్లో జరిగిన ఆందోళనలను అణచివేసేందుకు కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఆ సందర్భంగా దాదాపు ఆరువేల మందిని అరెస్ట్ చేసి వారిలో 327 మంది వేర్పాటువాదులపై చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. ఈ చట్టాన్ని సుప్రీం కోర్టు ‘లాలెస్ లా (చట్టరహిత చట్టం)’ అని వ్యాఖ్యానించింది. ఈ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో పది రోజుల వరకు కూడా పోలీసులు వెల్లడించాల్సిన అవసరం లేదు. 1989లో శ్రీనగర్‌లో జరిగిన అల్లర్ల దశ్యం ‘ప్రజా భద్రత’ పేరిట ఆ తర్వాత కూడా ఎలాంటి కారణం చూపకుండానే పొడిగించవచ్చు. అయితే నాలుగు వారల లోపల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోర్డు ముందు నిర్బంధితులను హాజరు పరిచి కేసును సమీక్షించాలి. ఈ బోర్డులో అర్హత కలిగిన జడ్జీలను లేదా అర్హత లేని జడ్జీలను కూడా నియమించవచ్చు. బోర్డులోని జడ్జీలు లేదా సభ్యుల వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. నిర్బంధితులకు తమ తరఫున న్యాయవాదులను నియమించుకునే అవకాశం కూడా లేదు. సాధారణంగా ‘జాతీయ భద్రత’ పేరిట ఎవరినైనా ఆరు నెలలపాటు నిర్బంధించవచ్చు. దీన్ని రెండేళ్లపాటు ఏకపక్షంగా పొడిగించవచ్చు. ఈ నిర్బంధాన్ని కోర్టు ఎన్నిసార్లు కొట్టివేసినా తాజా ఉత్తర్వుల ద్వారా నిర్బంధాన్ని ఎంతకాలమైనా పొడిగించవచ్చు. 20 ఏళ్లకుపైగా జైల్లో ఉన్న మసరత్ ఆలమ్ భట్ 1990 దశకంలో ముస్లిం లీగ్ నాయకుడు, వేర్పాటు వాది మసరత్ ఆలమ్ భట్‌పై 37 సార్లు ఈ ప్రజా భద్రతా చట్టాన్ని (పీఎస్ఏ)ను ప్రయోగించడంతో ఆయన ఏకంగా 20 ఏళ్లపాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. కలప దొంగల అణచివేత కోసం తీసికొచ్చిన ఈ చట్టం కింద రాజకీయ నాయకులతోపాటు కశ్మీర్ బార్ అసోసియేషన్ చైర్మన్ సహా న్యాయవాదులను, కశ్మీర్ వాణిజ్య మండలి సభ్యులు సహా వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వీరిలో ఎవరు ప్రజాందోళనలు నిర్వహించిన వారు కాదు, ప్రజా భద్రతకు ముప్పు తెచ్చిన వాళ్లు కాదు. ముదుసలి వయస్సులో ఫారూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయడం అంటే మున్ముందు ఆయన ఏ ముప్పు తెస్తాడో ఏమోనని కేంద్రం భయపడుతుండడమేనని ప్రజాస్వామ్య వాదులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘కొత్త’ వాళ్ల లెక్క ఇక పక్కా!
2007లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో బాంబు దాడికి పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు హబ్సిగూడలోని బంజారా నిలయం అపార్ట్మెంట్లో విద్యార్థుల ముసుగులో అద్దెకు దిగారు. ఈ ఘటన తర్వాత అద్దెకు ఉండే వారి వివరాలు పక్కాగా తెలుసుకోవాలని పోలీసు విభాగం సూచించినా అమలుకు నోచుకోలేదు. అనంతరం 2013లో ముష్కరులు అబ్దుల్లాపూర్‌మెట్‌లో షెల్టర్ తీసుకున్నారు. అక్కడి నుంచే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు పాల్పడి వెళ్లిపోయారు. ఇలా నగరంతో పాటు శివార్లలో ఆశ్రయం పొందుతూ అక్రమంగా గుర్తింపు కార్డులు పొందుతున్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తరచూ పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం చక్కదిద్దే చర్యలు చేపట్టింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో ఇలా... విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్న హైదరాబాద్, ఇతర జిల్లాలకు నిత్యం వందల మంది వలసలు వస్తున్నారు. ఇలా వచ్చిన వారు అద్దెకు ఇళ్లు తీసుకుని నివసించడంతో పాటు చిన్న చిన్న పనులు చేయడం, ఉద్యోగాలు నిర్వర్తించడం జరుగుతోంది. ఇలా అన్ని రాష్ట్రాలకూ చెందిన వారు వచ్చి ఉంటున్నప్పటికీ వారికి సంబంధించిన వివరాలు ఎక్కడా అందుబాటులో ఉండట్లేదు. ఈ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అసాంఘిక శక్తులకు కలసి వస్తున్నాయి. ప్రత్యేక ‘ఆపరేషన్స్’పై వస్తున్న ముష్కరమూకలు షెల్టర్ ఏర్పాటు చేసుకుని మరీ తమ ‘పని’పూర్తి చేసి వెళ్లిపోతున్నాయి. ఈ అసాంఘిక శక్తులు చిక్కిన తర్వాత జరిగే విచారణలోనే మకాంకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాలో అలా.. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే గోవాలో ఈ తనిఖీ పక్కాగా జరుగుతోంది. అక్క డ ఎవరైనా బయటి రాష్ట్రాల వారు వచ్చి అద్దెకు దిగితే యజమాని వారి వివరాలను సమీప పోలీసుస్టేషన్లో అందిస్తారు. ఠాణాల్లో ప్రత్యేకంగా టెనింట్స్ రిజిస్టర్ నిర్వహించే పోలీసులు ఆయా ఇళ్ల వద్దకు వెళ్లి అద్దెకు దిగిన వారిని పరిశీలిస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వారు అందించిన గుర్తింపు కార్డు ఆధారంగా స్వస్థలాల్లో తనిఖీలు చేస్తుంటారు. ఈ విధానం అక్కడి అసాంఘిక శక్తులకు చెక్ చెప్పడానికి ఉపకరించింది. ఇప్పుడేం చేస్తారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసించే, ఉద్యోగం చేసే వారి వివరా లు పక్కాగా నమోదు చేయించేలా పోలీసు విభాగం ఏర్పాట్లు చేయనుంది. ప్రజా భద్రతా చట్టంలో మార్పుచేర్పుల ద్వారా ప్రత్యేక పోర్టల్ అమలు చేయాలని యోచి స్తోంది. శీతాకాల లేదా వర్షాకాల శాసనసభ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టించాలని భావిస్తోంది. టెనింట్స్, ఎం ప్లాయీ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. పోర్టల్ పని చేస్తాదిలా.. ఇతర రాష్ట్రాల వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా యజమానులు/సంస్థలు వారి ఫొటోతో సహా గుర్తింపు కార్డులు, ఇతర వివరాలను ఈ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. స్పెషల్ బ్రాంచ్ అధీనంలో ఏర్పడే ప్రత్యేక విభాగం వీటిని పరిశీలిస్తుంది. అనుమానం వచ్చిన వారి వివ రాలను క్రాస్ చెక్ చేస్తుంటుంది. ఈ విధానం కచ్చితంగా అమలు చేయడంలో భాగంగా 2014లో అమల్లోకి వచ్చిన ప్రజా భద్రతా చట్టంలో కొన్ని మార్పుచేర్పులు చేయనుంది. వీటి ప్రకారం వివరాలు అప్లోడ్ చేయడంలో విఫలమైన, నిర్లక్ష్యం వహించిన యజమాని బాధ్యుడవుతాడు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం పోలీసు విభాగానికి ఉండనుంది. -
మానవ తప్పిదాల వల్లే విపత్తులు
-
ముందుచూపేది?
గుంటూరు నగరంలో కనిపించని నిఘా నేత్రాలు ఏడాదిగా నిలిచిన సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ కొద్ది రోజుల్లోనే కృష్ణా పుష్కరాలు ప్రారంభం లక్షలాది మంది భక్తులు, యాత్రికులు వచ్చే అవకాశం ప్రజా భద్రతపై దృష్టి సారించని అధికార యంత్రాంగం గుంటూరు నగరంలోని ఉన్నతాధికారులకు ముందు చూపు కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజా భద్రతకు పెద్ద పీట వేయాల్సిన అధికారులు, చివరకు సీసీ కెమెరాల ఏర్పాటును సైతం పట్టించుకోకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. కృష్ణా పుష్కరాల నాటికైనా కళ్లు తెరిచి నిఘా నేత్రాల ఏర్పాటు చేయాల్సిన బాధ్యతనూ గుర్తుచేస్తున్నారు. - సాక్షి, గుంటూరు గుంటూరు: నగరంలో ఎక్కడ ఏం జరిగినా మిన్నకుండిపోవాల్సిందే అన్నట్లు పరిస్థితులున్నాయి. ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, విద్యార్థినులపై ఉన్మాదుల దాడులు, సంఘవిద్రోహ శక్తుల కదలికలు ఇలా ఏం జరిగినా ఏం చేయలేం. కనీస సమాచారం సైతం తెలిసే అవకాశం గుంటూరు నగరంలో లేదు. దీనికి కారణం ఆయా కూడళ్లలో సీసీ కెమెరాలు లేకపోవడమే. ఎన్నో ఏళ్ల కిందట నగరంలోని కొన్ని సిగ్నల్స్ వద్ద ఏర్పాటుచేసిన కొద్దిపాటి సీసీ కెమెరాలు సైతం పనిచేయడం లేదు. అనుకోని సంఘటనలు జరిగినా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కేసుల విచారణలో కీలకంగా ఉండే సీసీ కెమెరాలు లేకపోతే ఎన్నో విధాలుగా నష్టాలు తప్పవని పలువురు అంటున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన... నగరంలో గత ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. విజయవాడలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు పుష్కరఘాట్లు, కూడళ్ల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో గుంటూరులో పనిచేసిన అర్బన్ ఎస్పీ సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అప్పటి కమిషనర్ నాగవేణికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన కమిషనర్ ఓ సంస్థకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. దీనిపై పోలీసుల సూచనలు, సలహాలు మేరకు మాత్రమే పనిచేయాలని తేల్చారు. అప్పటి ఎస్పీ కొన్ని సూచనలు, ఆదేశాలతో కెమెరాలు ఏర్పాటుకు ఒప్పుకున్నారు. కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సదరు సంస్థతో కార్పొరేషన్ అధికారులు ఎంఓయూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత కమిషనర్‌గా వచ్చిన కన్నబాబు ఆ సంస్థకు కెమెరాలు ఏర్పాటు చేసేందుకు వర్క్ఆర్డర్ ఇవ్వలేదు. తిరిగి టెండర్లు పిలవాలని ప్రతిపాదించగా తమతో ఒప్పందం కుదుర్చుకొని వర్క్ఆర్డర్ ఇవ్వడంలేదని కోర్టుకు వెళ్లింది. అక్కడ నుంచి కెమెరాల ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. సమాధానం వేయని కార్పొరేషన్... కోర్టుకు వెళ్లిన సంస్థకు వ్యతిరేకంగా కార్పొరేషన్ అధికారులు ఇప్పటి వరకు సమాధానం వేయలేదు. ప్రత్యేకంగా నగరపాలక సంస్థకు న్యాయవాది ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ప్రస్తుత ఎస్పీ సైతం కార్పొరేషన్‌కు కెమెరాల ఏర్పాటుపై రెండు సార్లు లిఖితపూర్వకంగా లేఖ రాశారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఆ సంస్థకు కెమెరాల ఏర్పాటు బాధ్యతను అప్పగించడమా.. లేక వేరే ఏమైనా నిర్ణయం తీసుకోవడమా అన్న అంశంపై స్పష్టత కోసం రాష్ట్ర పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినా తగిన ఫలితం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ప్రజా ఆస్తుల రక్షణే కర్తవ్యం
‘సోషియాలజీలో రోల్ ప్లే అనే అంశంపై ఒక పాఠం ఉంది. ఎవరి పని వారు చేసుకుంటేనే వ్యవస్థ సక్రమంగా నడుస్తుందన్నది దాని సారాంశం. పోలీసు శాఖకు కూడా ఇదే వర్తిస్తుంది. ఎవరో ఆదేశించారనో.. ఇంకెవరో ఒత్తిడి చేశారనో.. ప్రజలు ప్రశ్నిస్తారనో.. కాకుండా బాధ్యతతో కర్తవ్యం నిర్వర్తించడం ద్వారానే సత్ఫలితాలు సాధించగలుగుతాం.’ శ్రీకాకుళం క్రైం: ‘సహజంగా శ్రీకాకుళం ప్రశాంతమైన జిల్లా. కానీ సమాజంలో చోటు చేసుకుంటన్న ఆర్థికపరమైన మార్పులు.. అవసరాలు ఒకింత శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నాయి. అయితే వాటిని ఎదుర్కొనేందుకు ప్రజలకు భద్రత కల్పించేందుకు మేమెప్పుడూ సిద్ధంగానే ఉంటాం’.. అని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్(ఎస్పీ) ఎ.ఎస్.ఖాన్ చెప్పారు. టెక్కలిలో ఇటీవల జరిగిన వరుస సంఘటనలు కలచివేశాయని.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఆగంతకులు ఇక్కడ నేరాలకు పాల్పడి పరారవుతున్న గుర్తించామని.. ఇటువంటివారి ఆట కట్టించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. వేసవిలో జరిగే నేరాలు, పోలీసు శాఖ ఆధునికీకరణ ఆటో కార్మికుల ఆందోళన తదితర అంశాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్పీ సవివరంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. వేసవి కాలం తస్మాత్ జాగ్రత్త ఇటీవల జిల్లాలో జరుగుతున్న వరుస నేరాలపై దృష్టి సారించాం. బంగారంపై ఉన్న మక్కువతో మహిళలు అధికంగా నగలు ధరించి విందు వినోద శుభకార్యాలకు హాజరవుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని చోరులు రెచ్చిపోతున్నారు. అందుకే మహిళలు ఆభరణాలు ధరించి ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో చోరులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రజలు తమ కష్టార్జితాన్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా ఉండాలి. ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా చోరులకు అవకాశం కల్పిస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని టైటాన్ షోరూమ్‌లో జరిగిన లూటీ సంఘటనపై విచారణ వేగవంతం చేశాం. ఈ సంఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన చోరులు పాల్గొన్నట్టు గుర్తించాం. పెండింగ్ కేసుల విచారణపై ప్రత్యేక దృష్టి సారించాం. సిబ్బందిలో మార్పు రావాలి తమ ధన, మాన, ప్రాణాలకు ఇబ్బంది ఏర్పడినప్పుడు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రజల పట్ల పోలీసు సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫిర్యాదుదారుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలి. శాంతిభధ్రతలు, నేర నియంత్రణ, ట్రాఫిక్ తదితర విషయాల్లో హోంగార్డు నుంచి అధికారి స్థాయి వరకు బాధ్యతగా వ్యవహరింలి. ఆటోవాలాలు సహకరించాలి రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోలు జాతీయ రహదారిపై ప్రయాణించటం నేరం. నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి ఆటోలు జాతీయ రహదారిపై రాకపోకలు సాగించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇటీవల నరసన్నపేట, శ్రీకాకుళం శివారు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలే దీనికి నిదర్శనం. ఆందుకే రవాణా శాఖతో కలిసి పోలీసులు జాతీయ రహదారిపై సంయుక్త దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. జాతీయ రహదారిపై అండర్ పాసేజ్‌లు, ఓవర్ బ్రిడ్జిలు లేకపోవటం కూడ రోడ్డు ప్రమాదాలకు మరో కారణంగా గుర్తించాం. ఆటో యాజమానులను గుర్తించేందుకు జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్లను అనుసంధానిస్తూ ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేస్తాం. శ్రీకాకుళం పట్టణ పరిధిలో పార్కింగ్ ప్రాంతాలు, ముఖ్య కూడళ్లలో సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని నియంత్రించేందుకు బ్రిత్ ఎనలైజర్లు ప్రవేశపెట్టే విషయాన్ని మున్సిపల్ అధికారులతో చర్చించాం. కొత్త వాహనాలివే... రాత్రి పూట గస్తీ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కొత్త వాహనాలను, సిబ్బందిని సమకూర్చుతున్నాం. పాలకొండ, నరసన్నపేట, రాజాం, పలాస, కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, టెక్కలి ప్రాంతాల్లో కొత్త రక్షక్ వాహనాలను, జాతీయ రహదారిపై వాహనాల వేగ నియంత్రణ కోసం ఇన్ట్రాసెక్టర్ వాహనాలను రప్పించనున్నాం. ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణకు ఎనిమిదిమంది సిబ్బందిని పంపించాం. ప్రస్తుతం జిల్లాలో నాలుగు హైవే పెట్రోలింగ్ వాహనాలు ఉన్నాయి. మరో రెండు కొత్త వాహనాలు రానున్నాయి. డయల్-100 పేరిట రెండు కొత్త పెట్రోలింగ్ వాహనాలను తెప్పిస్తున్నాం. రాత్రి గస్తీని పటిష్టం చేసేందుకు నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను. రామలక్ష్మణ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, ఇలిసిపురం తదితర ప్రాంతాల్లో ఉన్న పోలీసు సబ్ కంట్రోల్ రూమ్‌లను అధునికీకరిస్తాం. -
ఇక ఇంటింటికీ పోలీస్
వరంగల్ క్రైం : ప్రజా రక్షణ కోసం ఇకనుంచి ఇంటింటికీ పోలీసుల సందర్శన ఉంటుందని వరంగల్ రూరల్ ఎస్పీ, అర్బన్ ఇన్చార్జి ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. దొంగతనాలను నిరోధించడానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ‘మీ కోసం పోలీసు’ సదస్సును హన్మకొండ పోలీసులు అమృత గార్డెన్స్‌లో గురువారం నిర్వహించారు. సదస్సుకు నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు. ఎస్పీ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. సదస్సులో పాల్గొన్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి.. ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వాలనే పద్ధతులపై హన్మకొండ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్ వివరించారు. అనంతరం ఎస్పీ చేతులమీదుగా ‘అప్రమత్తంగా ఉండండి-దొంగతనాలను నివారించండి’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్‌ను విడుదల చేసిన తర్వాత వలంటరీ బృందాలకు ప్రచార సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. దొంగతనాలను నిరోధించడంలో ప్రజల సహకారం తప్పనిసరి అని ఇందుకోసం ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. కార్యక్రమ నిర్వహణ కోసం యువత అవసరం ఎంతైనా ఉందని, ఇందులో వారిని భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లను వినియోగించడం ద్వారా శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యత పెంపొం దుతుందని అన్నారు. ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచి పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి శాంతిభద్రతల పరిరక్షణకు అనేక ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. హన్మకొండ ఠాణా పరిధిలోనే తొలిసారిగా ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రజా రక్షణ కార్యక్రమం ‘మీ కోసం పోలీసు’ తొలిసారిగా హన్మకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 20వేల కుటుంబాలను అప్రమత్తం చేయడంతోపాటు వారిని చైతన్యవంతులను చేసేందుకు స్టేషన్ సిబ్బంది, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వలంటీర్లతో 350 బృందాలను ఏర్పాటు చేయగా.. ఒక్కో బృందంలో ఇద్దరు వలంటీర్లు ఉంటారు. వీరు ఇంటింటికీ దొంగల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచితుల పట్ల వ్యవహరించాల్సి తీరు, వీటిపై ఎలా స్పందించాలనే తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. తర్వాత పోలీసు సూచనలతో కూడిన స్టిక్కర్ ఆ ఇంటికి అతికించి ఇంటి యజమానికి కరపత్రాన్ని అందజేస్తారు. కార్యక్రమంలో హన్మకొండ డీఎస్పీ శోభన్‌కుమార్, కేయూసీ, సుబేదారి ఇన్స్పెక్టర్లు దేవేందర్‌రెడ్డి, నరేందర్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌లాల్, ఎస్సై శ్రీనివాస్, పులి రమేష్, తాజొద్దీ, ఎన్సీసీ ఇన్చార్జి మహేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.