ముందుచూపేది?
గుంటూరు నగరంలో కనిపించని నిఘా నేత్రాలు
ఏడాదిగా నిలిచిన సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ
కొద్ది రోజుల్లోనే కృష్ణా పుష్కరాలు ప్రారంభం
లక్షలాది మంది భక్తులు, యాత్రికులు వచ్చే అవకాశం
ప్రజా భద్రతపై దృష్టి సారించని అధికార యంత్రాంగం
గుంటూరు నగరంలోని ఉన్నతాధికారులకు ముందు చూపు కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజా భద్రతకు పెద్ద పీట వేయాల్సిన అధికారులు, చివరకు సీసీ కెమెరాల ఏర్పాటును సైతం పట్టించుకోకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. కృష్ణా పుష్కరాల నాటికైనా కళ్లు తెరిచి నిఘా నేత్రాల ఏర్పాటు చేయాల్సిన బాధ్యతనూ గుర్తుచేస్తున్నారు. - సాక్షి, గుంటూరు
గుంటూరు: నగరంలో ఎక్కడ ఏం జరిగినా మిన్నకుండిపోవాల్సిందే అన్నట్లు పరిస్థితులున్నాయి. ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, విద్యార్థినులపై ఉన్మాదుల దాడులు, సంఘవిద్రోహ శక్తుల కదలికలు ఇలా ఏం జరిగినా ఏం చేయలేం. కనీస సమాచారం సైతం తెలిసే అవకాశం గుంటూరు నగరంలో లేదు. దీనికి కారణం ఆయా కూడళ్లలో సీసీ కెమెరాలు లేకపోవడమే. ఎన్నో ఏళ్ల కిందట నగరంలోని కొన్ని సిగ్నల్స్ వద్ద ఏర్పాటుచేసిన కొద్దిపాటి సీసీ కెమెరాలు సైతం పనిచేయడం లేదు. అనుకోని సంఘటనలు జరిగినా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కేసుల విచారణలో కీలకంగా ఉండే సీసీ కెమెరాలు లేకపోతే ఎన్నో విధాలుగా నష్టాలు తప్పవని పలువురు అంటున్నారు.
అదిగో ఇదిగో అంటూ కాలయాపన...
నగరంలో గత ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. విజయవాడలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు పుష్కరఘాట్లు, కూడళ్ల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో గుంటూరులో పనిచేసిన అర్బన్ ఎస్పీ సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అప్పటి కమిషనర్ నాగవేణికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన కమిషనర్ ఓ సంస్థకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. దీనిపై పోలీసుల సూచనలు, సలహాలు మేరకు మాత్రమే పనిచేయాలని తేల్చారు. అప్పటి ఎస్పీ కొన్ని సూచనలు, ఆదేశాలతో కెమెరాలు ఏర్పాటుకు ఒప్పుకున్నారు. కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సదరు సంస్థతో కార్పొరేషన్ అధికారులు ఎంఓయూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత కమిషనర్‌గా వచ్చిన కన్నబాబు ఆ సంస్థకు కెమెరాలు ఏర్పాటు చేసేందుకు వర్క్‌ఆర్డర్ ఇవ్వలేదు. తిరిగి టెండర్లు పిలవాలని ప్రతిపాదించగా తమతో ఒప్పందం కుదుర్చుకొని వర్క్‌ఆర్డర్ ఇవ్వడంలేదని కోర్టుకు వెళ్లింది. అక్కడ నుంచి కెమెరాల ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది.
సమాధానం వేయని కార్పొరేషన్...
కోర్టుకు వెళ్లిన సంస్థకు వ్యతిరేకంగా కార్పొరేషన్ అధికారులు ఇప్పటి వరకు సమాధానం వేయలేదు. ప్రత్యేకంగా నగరపాలక సంస్థకు న్యాయవాది ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ప్రస్తుత ఎస్పీ సైతం కార్పొరేషన్‌కు కెమెరాల ఏర్పాటుపై రెండు సార్లు లిఖితపూర్వకంగా లేఖ రాశారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఆ సంస్థకు కెమెరాల ఏర్పాటు బాధ్యతను అప్పగించడమా.. లేక వేరే ఏమైనా నిర్ణయం తీసుకోవడమా అన్న అంశంపై స్పష్టత కోసం రాష్ట్ర పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినా తగిన ఫలితం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.