పుష్కరనగర్‌ల ఏర్పాటుకు కరువైన ప్రభుత్వ స్థలాలు
ప్రైవేటు స్థలాల కోసం అధికారుల అన్వేషణ
రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా
అమరావతి : కృష్ణా పుష్కరాలు అనగానే గుర్తొచ్చేది విజయవాడ నగరమే. కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికే తరలివస్తారు. ఈ ఏడాది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. గోదావరి పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో కృష్ణాపుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా భక్తుల రాకపోకలకు, వసతికి అనుకూలంగా పుష్కర నగర్‌లను ఏర్పాటు చేయాలని భావించింది. అయితే పుష్కరనగర్‌లు ఏర్పాటు చేసేందుకు విజయవాడలో ప్రభుత్వ స్థలాలు కరువయ్యాయి. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. స్థలాల కోసం అన్వేషణ ప్రారంభించారు.
2 కోట్ల మంది వస్తారని అంచనా
పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణాపుష్కరాలు గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. గత కృష్ణాపుష్కరాలకు 1.30 కోట్ల మంది భక్తులు విజ యవాడ తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి పుష్కరాలకు రెండు కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడలో 15 నుంచి 20 వరకు పుష్కర నగర్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి కోసం విజయవాడ నగరపాలక సంస్థ రూ.40 కోట్లు కేటాయించింది.
నలుదిక్కుల నుంచి....
కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం 1500 బస్సులు నడపాలని భావిస్తోంది. అన్ని పుష్కరనగర్‌ల నుంచి ఘాట్ వరకు ఉచితంగా బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడలోకి ప్రవేశిస్తాయి. రాజమండ్రి, విశాఖపట్నం, ఏలూరు, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి వచ్చే భక్తులు రామవరప్పాడు మీదుగా, తెలంగాణ, ఛత్తీస్‌ఘట్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి మైలవరం, తిరువూరు, నూజివీడు మీదుగా విజయవాడుకు చేరుకుంటాయి. చెన్నై, రాయలసీమ, ప్రకాశం, గుంటూరు నుంచి వచ్చే వాహనాలు తాడేపల్లి మీదుగా నగరానికి చేరతాయి. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఆయా మార్గాల్లోనే పుష్కర నగర్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పుష్కరఘాట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే వీటిని ఏర్పాటు చేస్తారు. సుమారు ఐదు వేల మంది భక్తులు వసతి పొందేలా ఒక్కొక్క పుష్కరనగర్ ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. ఒక్కొక్క దానికి సుమారు రెండు నుంచి మూడు ఎకరాల స్థలం అవసరమని అంచనా. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, రామవరప్పాడు, సిద్ధార్థ కళాశాల ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లేవు. ఒకవేళ ఉన్నా వాటి విస్తీర్ణం పుష్కరనగర్ ఏర్పాటుకు చాలదు. ప్రభుత్వ స్థలాలు కరువవడంతో ప్రైవేటు స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు స్థలాలు కూడా అందుబాటులో లేకపోవడం, ఉన్న చోట్ల ఎక్కువ మొత్తంలో యజమానులు అద్దె డిమాండ్ చేస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.