రూ.6 కోట్లతో టెండర్లు ఖరారు
మార్పుల అనంతరం జాబితా సిద్ధం
సమీప గ్రామాల్లోనూ ఏర్పాటుకు నిర్ణయం
మొదలైన పనులు
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు విజయవాడ నగర పరిధిలోని 23 ప్రాంతాల్లో పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు టెండర్లు ఖరారయ్యాయి. నగరం, శివారు ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించినా.. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అనువుగా ఉండేందుకు గాను కానూరు, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, రాయనపాడు, తుమ్మలపాలెం, గొల్లపూడి, గన్నవరం ప్రాంతాల్లో కూడా పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.2 కోట్ల మేరకు బడ్జెట్‌ను పెంపుదల చేశారు. మొత్తం రూ.6 కోట్లతో పుష్కర నగర్‌లను తీర్చిదిద్దనున్నారు. ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక్కడి నుంచే వెళ్లాలి...
పుష్కరాలకు వచ్చే భక్తులు ముందుగా పుష్కర నగర్‌లకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ వారికి కావాల్సిన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. క్లోక్ రూం సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి ఘాట్ల వద్దకు వెళ్లి స్నానాలు చేసిన తరువాత తిరిగి అక్కడికే చేరుకోవాలి. ప్రయాణికుల సౌకర్యార్థం పుష్కర నగర్‌లలో బస్సు, రైల్వే టికెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వీటీపీఎస్ కెనాల్ వరకు, సీతమ్మ వారి పాదాల నుంచి కృష్ణలంక వరకు నాలుగు కిలోమీటర్ల మేర ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కిలోమీటర్‌లో రోజుకు ఆరు లక్షల మంది చొప్పున 24 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నది అధికారుల అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకొని పుష్కర నగర్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
పుష్కర నగర్‌లు ఇవే...
నగర పరిధిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 23 పుష్కర నగర్‌ల వివరాలివీ. పున్నమి ఘాట్, భవానీ ఘాట్, సీతమ్మ వారి పాదాలు, రాజీవ్‌గాంధీ పార్క్, పాత ఆర్టీసీ బస్టాండ్ (పోలీస్ కంట్రోల్ రూం ఎదురు), గుణదల రైల్వేస్టేషన్ సమీపంలో, వైవీరావు ఎస్టేట్స్, వైవీరావ్ ఎస్టేట్స్ ఎదురు ఖాళీ స్థలం, లారీ స్టాండ్ (భవానీపురం), దూరదర్శన్ సమీప ప్రాంతం, ఉడా పార్క్, కనకదుర్గ వార ధి, స్క్రూబ్రిడ్జి సమీపంలో, సిద్ధార్థ మహిళా కళాశాల, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (కానూరు), యనమలకుదురు ఘాట్ (పెనమలూరు), ట్రక్ టెర్మినల్ (ఇబ్రహీంపట్నం), వీటీపీఎస్ గ్రౌండ్ (ఇబ్రహీంపట్నం), సీడబ్ల్యూసీ గోడౌన్ (రాయనపాడు), దేవాదాయ శాఖ ఖాళీ స్థలం (తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం), హోల్‌సేల్ మార్కెట్ యార్డు (గొల్లపూడి), గూడవల్లిలోని ఖాళీ స్థలం (గన్నవరం).
పుష్కర నగర్‌లు 23
Published Tue, Jul 12 2016 1:31 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement