సాగర సంగమంపై ప్రత్యేక దృష్టి | A special focus on the confluence of the sea | Sakshi
Sakshi News home page

సాగర సంగమంపై ప్రత్యేక దృష్టి

Published Wed, May 18 2016 4:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

A special focus on the confluence of the sea

కోడూరు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పవిత్ర కృష్ణా సాగరసంగమ ప్రాంతంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి, కృష్ణా పుష్కరాలకు తీర్చిదిద్దాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ అధికారులతో కలిసి సంగమ ప్రాంతాన్ని పరిశీలించారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు సంగమ అందాలు తిలకించి, పుణ్యస్నానాలు ఆచరించేందుకు సదుపాయాల కల్పనపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

విజయవాడలోని దుర్గా ఘాట్ తరువాత భక్తుల తాకిడి సంగమ ప్రాంతానికే ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ‘సాగరసంగమం’ పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడనున్నట్లు చెప్పారు. పాలకాయతిప్ప కరకట్ట దగ్గర నుంచి సముద్రం వద్ద ఉన్న డాల్ఫిన్ భవనం వరకు రహదారి విస్తరణ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.

రహదారి మార్గంమధ్యలో ఉన్న వంతెనను మరింత పెద్దగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సముద్రం వద్ద నుంచి సంగమ ప్రాంతం వరకు రూ.2 కోట్ల వ్యయంతో రహదారిని నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. సంగమంలో ఊహకందని లోతు ఉంటుందని, ప్రత్యేక బారికేడింగ్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

సంగమం వరకు నూతన టెక్నాలజీని ఉపయోగించి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయలు, శానిటేషన్‌పై అధికారులు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసి, తనకు పంపాలని కోరారు.
 
పుష్కర నగర్..
సంగమం వద్ద ఏర్పాటుచేయనున్న పుష్కరనగర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచిం చారు. తొలుత పాలకాయతిప్ప వద్ద రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. హంసలదీవిలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. పండితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

అసిస్టెంట్ కలెక్టర్ సలోమి సూడాన్, ఎస్పీ విజయకుమార్, పీఆర్ ఎస్‌ఈ సూర్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శేషుకుమార్, ఈఈ మురళీకృష్ణ, విద్యుత్ డీఈ వెంకటేశ్వరరావు, ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ షేక్ ఖాదర్‌భాషా, తహశీల్దార్ ఎం.వి.సత్యనారాయణ, ఎంపీడీవో గౌసియాబేగం, జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, కేడీసీసీ బ్యాంక్‌డెరైక్టర్ ముద్దినేని చంద్రరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
 
వారధి నిర్మాణం పనులను వేగవంతం చేయాలి
కదివిసీమ ప్రజలు మచిలీపట్నం చేరుకునేందుకు కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం-భవానీపురం’ వారధి నిర్మాణం పనులు వేగవంతం చేసి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు.ఎ ఆర్‌అండ్‌బీ అధికారులు, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం  వారధి నిర్మాణ ప్రాంతాన్ని అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

కరకట్ట దగ్గర నుంచి నది వరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. గాంట్రీ సహాయంతో పనులు నిర్వహించకుండా మట్టి తొల డంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూలీల సంఖ్య పెంచి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.
 
కలెక్టర్ అసంతృప్తి
ఇప్పటి వరకు ఒక్క గడ్డర్ మాత్రమే పూర్తిచేయడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంట్రీ లాంచింగ్ సిస్టమ్‌ను ప్రారంభించకుండా పనులు ఎలా ముందుకు సాగుతాయని ఇంజినీర్లను ప్రశ్నించారు. వారధి నిర్మాణ విషయాలను ఎప్పటికప్పుడు తమకు పంపాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. భవానీపురం వైపు జరుగుతున్న పనులను కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement