మహిళ భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో బృహత్తర కార్యచరణ సిద్ధం చేసింది. ఇటీవల హైదరాబాద్‌లోని ఐదు డిగ్రీ కాలేజీల్లో ప్రయోగాత్మకంగా విద్యార్థుల నేతృత్వంలో నడిచే పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇవి మంచి ఫలితాలివ్వడంతో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిగ్రీ, పీజీ కాలేజీల్లో పబ్లిక్ సేఫ్టీ క్లబ్‌లను ప్రారంభించనున్నారు. దీనికోసం 33 జిల్లాల నుంచి 2,200 కాలేజీల ప్రిన్సిపాళ్లను నగరానికి విమెన్ సేఫ్టీ వింగ్ ఆహ్వానించింది. వీరందరితో బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో భారీ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీజీపీ మహేందర్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి చిత్ర రామచంద్రన్ తదితరులు హాజరవనున్నారు.
– సాక్షి, హైదరాబాద్
స్కూలు, జిల్లా, రాష్ట్రస్థాయి క్లబ్‌లు..
విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఇదే అతిపెద్ద కార్యక్రమం కావడం గమనార్హం. దీనిని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయాలని విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతిలక్రా నిర్ణయించారు. దీనికోసం స్కూలు, మండల, జిల్లా స్థాయిల్లో క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రవాణా, విద్యాశాఖ అధికారులు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరు ఈ క్లబ్‌లకు మార్గదర్శకంగా ఉంటారు. దీనికోసం రవాణా, విద్య, స్త్రీశిశు సంక్షేమ శాఖలతో పోలీసు శాఖ ముందుగానే సమన్వయం చేసుకుంది. డిగ్రీ, పీజీ విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు నుంచి జూన్ వరకు ఏయే కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించాలో విమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక సిలబస్ రూపొందించింది.
ఏమేం చేస్తారు?
- విద్యార్థులకు ఆత్మస్థైర్యం, సంకల్ప బలం పెంచే కార్యక్రమాల నిర్వహణ. ఆపదలో ఎలా వ్యవహరించాలి.. ఎవరిని సంప్రదించాలి.. అన్న విషయాల్లో శిక్షణ
- సామాజిక, మహిళా, శిశు, రోడ్డు భద్రతల్లో వినూత్న ఆవిష్కరణలకు వ్యాసాలు, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు. వేధింపులు, సైబర్ నేరాలు, వర కట్నం, గృహ హింసలపై చైతన్యం చేయడం
- పోలీస్‌స్టేషన్ల, భరోసా కేంద్రాల సందర్శన
- చిన్నారుల్లో గుడ్‌టచ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన.
జిల్లా సేఫ్టీ క్లబ్
స్కూలు/కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ఇందులో జిల్లా విద్యాశాఖాధికారి, ఇద్దరు మహిళా ప్రముఖులు, అడిషనల్ ఎస్పీ ర్యాం కు ఆఫీసర్, ఐదు పాఠశాలల నుంచి ప్రతినిధులు, ఆర్టీఏ నుంచి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, జిల్లా క్రీడా/యువజన అధికారి, స్వయం సహాయక బృంద నాయకురాలు ఉంటారు.
స్కూలు/ కాలేజీ స్థాయి సేఫ్టీ క్లబ్
ఇందులో ముగ్గురు పేరెంట్స్, 10 మంది విద్యార్థులు, ఒక లా అండ్ ఆర్డర్ మహిళా పోలీస్, ఒక ట్రాఫిక్ పోలీస్, గ్రామానికి చెందిన ఒక రాజకీయ నాయకురాలు సభ్యులుగా ఉంటారు. వీరంతా తొలుత విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి రక్షణ, రోడ్డు భద్రత, డయల్ 100, ట్రాఫిక్ రూల్స్, హాక్ ఐ, షీటీమ్‌ల పనితీరు, వారిని ఎలా సంప్రదించాలి తదితర వివరాలపై సమగ్ర అవగాహన కల్పిస్తారు. స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు కూడా వీరు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు.
రాష్ట్ర స్థాయి క్లబ్‌లు
జిల్లా స్థాయి సేఫ్టీ క్లబ్‌ల పనితీరును మదింపు చేసేందుకు రాష్ట్ర సేఫ్టీ క్లబ్‌లు ఉంటాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ/విద్యాశాఖ కమిషనర్ నామినేట్ చేసిన రీజనల్ జాయింట్ డైరెక్టర్, పాఠశాల విద్య కమిషనర్ నామినేట్ చేసిన మహిళా ప్రతినిధి, అడిషనల్ డైరెక్టర్ జనరల్ లేదా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంకు అధికారి, రవాణా శాఖ, రాష్ట్రస్థాయి యువజన క్రీడా ప్రతినిధి, మెప్మా నుంచి ఓ అధికారి ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment