14 కాలేజీల్లో సొంతంగా ప్రవేశాలు! | Own entrance of 14 colleges | Sakshi
Sakshi News home page

14 కాలేజీల్లో సొంతంగా ప్రవేశాలు!

Published Mon, Jun 19 2017 1:46 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

Own entrance of 14 colleges

- ఆన్‌లైన్‌ ప్రవేశాల పరిధిలో లేని ప్రముఖ డిగ్రీ కాలేజీలు
- వాటిలో చేరిన విద్యార్థుల ఫీజులపై గందరగోళం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రముఖ డిగ్రీ కాలేజీలు సొంత ప్రవేశాలు చేపట్టాయి. యూనివర్సిటీ నిర్ధారించిన ఫీజు తమకు సరిపోదంటూ 14 కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించి సొంత ప్రవేశాలు చేపట్టేందుకు అనుమతి తెచ్చుకున్నాయి. రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు వార్షిక ఫీజు ఉన్న ఆ కాలేజీలు ఇప్పటికే ప్రవేశాలను పూర్తి చేయగా మరో 28  కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇటు యాజమాన్యాలు, అటు డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల కమిటీ.. దరఖాస్తులను స్వీకరించాలని పేర్కొన్న కోర్టు.. ప్రవేశాలను మాత్రం తుది తీర్పు ఇచ్చే వరకు ఖరారు చేయవద్దని సూచించింది.

30 వేల వరకు సీట్లు కలిగిన ఆ కాలేజీల్లో ప్రవేశాలకు యాజమాన్యాలు విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా, అదే కాలేజీల్లో చేరేందుకు విద్యాశాఖ చేపట్టిన ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15న ప్రకటించిన మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ఆయా కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 7,500 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించింది. అయితే కోర్టు తీర్పు రావాల్సి ఉన్నందున వాటిని ప్రకటించలేదు. ఒకవేళ కోర్టు తీర్పు కాలేజీలకు అనుకూలంగా వస్తే వాటి యాజమాన్యాలే ఆ 30 వేల సీట్లను భర్తీ చేసుకుంటాయి. తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే ఆన్‌లైన్‌ ప్రవేశాల ద్వారా వాటిలో సీట్లను ప్రవేశాల కమిటీ కేటాయిస్తుంది. 
 
వారి ఫీజు సంగతేంటి?
ఇప్పటికే ప్రవేశాలు చేపట్టిన 14 కాలేజీల్లో చేరిన దాదాపు 15 వేల మంది విద్యార్థులకు, కోర్టు తీర్పు రావాల్సిన 28 కాలేజీల్లో చేరే 30 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశం ఏంటన్నది ప్రభుత్వం తేల్చాల్సి ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే ఆన్‌లైన్‌ ప్రవేశాలను కాదని ఆయా కాలేజీల్లో చేరినందున ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం కుదరదని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి.  సొంతంగా ప్రవేశాలు చేపట్టిన 14 కాలేజీలు, కోర్టు కేసులో ఉన్న 28 కాలేజీల జాబితాను డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల (దోస్త్‌) వెబ్‌సైట్‌లో ఉన్నత విద్యా మండలి అందుబాటులో ఉంచింది. అవి కాకుండా 1,089 కాలేజీల్లో 1,40,033 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రవేశాల కమిటీ ఇటీవల సీట్లను కేటాయించింది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement