ఉత్కంఠకు తెర
18న ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్న సుమతి
సంగారెడ్డి క్రైం: జిల్లా ఎస్పీగా నియామకమైన బి.సుమతి ఈ నెల 18న బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు, బదిలీలు చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా జిల్లా ఎస్పీ శెముషీ బాజ్‌పేయ్‌ని బాలానగర్ డీసీపీగా నియమిస్తూ.. మెదక్ నుంచి బదిలీ చేశారు. గతంలో ఈమెను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఆమెను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.
రెండు నెలల క్రితమే ఎస్పీ బదిలీ అయినప్పటికీ పోస్టింగ్‌లు ఇవ్వడంలో జాప్యం జరిగింది. కౌంటర్ ఇంటలిజెన్స్‌లో ఎస్పీగా పనిచేస్తున్న సుమతిని రెండు నెలల క్రితమే మెదక్‌కు నియమించినప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా ఐపీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వడంతో రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 1984 బ్యాచ్‌కు చెందిన సుమతి వరంగల్ డీఎస్పీగా, మల్కాజ్‌గిరి ఏసీపీగా, సీఐడీ ఎస్పీగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించరని పేరు తెచ్చుకున్నారు.