కర్నూలు: కర్నూలు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) రఘురామిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసాధికారులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. కొత్త నియామకాలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నూలు జిల్లా ఎస్పీగా రవికృష్ణను నియమించింది. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవికృష్ణ ముఖ్యమంత్రి భద్రతా విభాగం ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం శాఖా పరమైన శిక్షణలో భాగంగా జైపూర్‌లో ఉంటున్నారు. పది రోజుల్లో శిక్షణ పూర్తి కానుంది. ఆ తర్వాత ఆయన కర్నూలులో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఈయన అదే జిల్లాలోని చింతపల్లి ఏఎస్పీగా మొదట విధుల్లో చేరారు. 2011లో ఎస్పీగా పదోన్నతి పొందారు.
శ్రీకాకుళంలో పని చేసేటప్పుడు మావోయిస్టులను జన జీవన స్రవంతిలోకి రప్పించడానికి ‘అమ్మ పిలుపు’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా కూడా పని చేశారు. ట్రాఫిక్ విధుల్లో పని చేసే సిబ్బంది నిజాయతీగా ఉండాలని, అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేయించారు. అలాగే వాహనాల్లో తల్లిదండ్రులు బయటికి వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ‘నాన్న కోసం’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 2011 నుంచి జూలై 2013 వరకు గుంటూరు అర్బన్ ఎస్పీగా సేవలందించారు.
ఈ సందర్భంగా ఆపరేషన్ అనాధలు, ఆపరేషన్ వీధి బాలలు, బాధితులకు భరోస, ఆపరేషన్ యాచకులు వంటి సేవా కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీధుల్లో ఉంటున్న యాచకులు, బాలల కోసం పునరావాసం కల్పించడం రాత్రి వేళల్లో పడుకోవడానికి ప్రత్యేకంగా షెల్టర్లు ఏర్పాటు చేయించడం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. సొంత శాఖలో పని చేస్తున్న సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని ఈయనకు పేరుంది.
కొత్త ఎస్పీ రవికృష్ణ
Published Thu, Jul 17 2014 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM
Advertisement