బాధితులకు వరం.. జీరో ఎఫ్‌ఐఆర్‌ | Zero FIR Useful For Victims | Sakshi
Sakshi News home page

బాధితులకు వరం.. జీరో ఎఫ్‌ఐఆర్‌

Published Thu, Nov 5 2020 8:04 PM | Last Updated on Mon, Nov 9 2020 7:15 PM

Zero FIR Useful For Victims - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అమలవుతున్న జీరో ఎఫ్‌ఐఆర్‌ పద్ధతి బాధితులకు వరంగా మారింది. తెలంగాణాలో దిశ ఘటన తరువాత మన రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు చర్యలు చేపట్టిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్ర హోంశాఖ సైతం జీరో ఎఫ్‌ఐఆర్‌ అమలు చేయాలని, చట్టంలో ఉన్న వెసులుబాటును అమలు చేయని పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం, వారి ఫిర్యాదుపై ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేయాలనే నిబంధన ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ నిబంధనలు ఏడాదిగా పక్కాగా అమలవుతున్నాయి. గతేడాది మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ కృష్ణాజిల్లా కంచికచర్లలో నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జీరో ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి 341 కేసులు నమోదయ్యాయి. గతేడాది 62 కేసులు, ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు 279 కేసులు నమోదు చేసినట్టు దిశ ప్రత్యేక అధికారి దీపికాపాటిల్‌ చెప్పారు. 

జీరో ఎఫ్‌ఐఆర్‌ ప్రాధాన్యత వెనుక
తెలంగాణలోని షాద్‌నగర్‌ గ్యాంగ్‌ రేప్‌ (దిశ ఘటన)తో జీరో ఎఫ్‌ఐఆర్‌ అంశం తెరమీదకు వచ్చింది. ఈ ఘటనలో ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. చట్టంలో జీరో ఎఫ్‌ఐఆర్‌ వెసులుబాటు ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. తమ కుమార్తె కనిపించడం లేదని ఆమె కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు అది తమ పరిధిలోనిది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. మిస్సింగ్‌ కంప్లెయింట్‌ ఇవ్వడానికి వెళితే తమ పరిధి కాదని పోలీసులు అనడంతో తాము రెండు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చిందని బాధితురాలి కుటుంబసభ్యులు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించిన శంషాబాద్‌ పీఎస్‌కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే దిశ మాదిరి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క అమ్మాయికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు జీరో ఎఫ్‌ఐఆర్‌ పద్ధతిని ఖచ్చితంగా అమలు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. 

జీరో ఎఫ్‌ఐఆర్‌ నిరాకరిస్తే పోలీసులపై క్రిమినల్‌ కేసు
బాధితులు ఫిర్యాదు చేసినా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు నిరాకరించే పోలీసులపై క్రిమినల్‌ (కేసు) చర్యలు తప్పవని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం హెచ్చరించింది. అన్యాయం జరిగిన చోటే ఫిర్యాదు చేసుకో.. మీ ప్రాంత పోలీస్‌ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేసుకో.. మా దగ్గరకు ఎందుకొచ్చావ్‌.. ఇవీ ఏళ్ల తరబడి పోలీసు స్టేషన్లలో పలువురు అధికారుల నోట కర్కశంగా వినిపించిన మాటలు. ఇప్పుడు రాష్ట్రంలో ఈ మాటలు వినిపించడంలేదు. బాధితులు ఏ ప్రాంతం వారైనా, ఎక్కడైనా సత్వర సహాయం కోసం సమీపంలోని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. బాధితులు వచ్చిన వెంటనే వారినుంచి వివరాలు తీసుకుని ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేసి కేసును సంబంధిత పోలీసు స్టేషన్‌కు పంపించాలి. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి నిరాకరించిన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (పోలీసు)పై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక‌్షన్‌ 166ఎ ప్రకారం క్రిమినల్‌ కేసు నమోదు చేయవచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు సహకరించని పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురవడంతోపాటు క్రిమినల్‌ కేసులో ఆరునెలల నుంచి రెండేళ్లపాటు శిక్షకు గురయ్యే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement