సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన నేపథ్యంలో జీరో ఎఫ్‌ఐఆర్ మరోసారి చర్చకు వచ్చింది. పోలీసు స్టేషన్ పరిధులతో సంబంధం లేకుండా ఎఫ్‌ఐఆర్ బుక్ చేసి ముందు దర్యాప్తు ప్రారంభిస్తారు. అనంతరం కేసును సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేస్తారు. వాస్తవానికి ఇదేం కొత్త విధానం కాదు. ఇప్పటికే మనుగడలో ఉన్నదే. దిశ హత్య కేసు అనంతరం జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ మహేందర్‌రెడ్డి గత నెలాఖరునే మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.
త్వరలోనే ఈ విధానాన్ని అన్ని పోలీస్‌స్టేషన్లలో తప్పకుండా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రత్యేకించి యువతులు, బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారంటూ వచ్చిన ఫిర్యాదులపై ఏమాత్రం ఆలస్యం చేయవద్దని అందులో పొందుపరచనున్నారు. నేడో, రేపో ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఆదేశాలు చేరనున్నాయి.
ఈ ఏడాది 200పైనే..
జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని చాలా ఏళ్లుగా తెలంగాణ పోలీసులు పాటిస్తున్నారు. 2018లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధుల్లో దాదాపు 1,200 కేసులు ఈ విధానంలో నమోదయ్యాయి. అనంతరం దర్యాప్తు దశలో వాటిని ఇతర స్టేషన్లకు బదిలీ చేశారు. తాజాగా వరంగల్‌లోని సుబేదారిలో నమోదైన యువతి మిస్సింగ్ కేసుతో జీరో ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య ఈ ఏడాదిలో 200 దాటింది. గతంలో కేసుల బదిలీ ప్రక్రియ మాన్యువల్‌గా జరిగేది.
కానీ తెలంగాణ పోలీసులు ఈ కేసులో మాత్రం సీసీటీఎన్‌ఎస్ (క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టం) ద్వారా ఆన్‌లైన్‌లో ఈ ఎఫ్‌ఐఆర్‌ను బదిలీ చేయడం గమనార్హం. మహిళలు, యువతులు అదృశ్యమైన సందర్భంలో వెంటనే స్పందిస్తారు. విషయాన్ని సంబంధిత ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలకు వెంటనే సమాచారం చేరిపోతుంది. ఆ వెంటనే సీసీటీఎన్‌ఎస్ ద్వారా డీజీపీ కార్యాలయానికి కేసు వివరాలు చేరతాయి. ఇలాంటి కేసులను ఎస్పీ, కమిషనర్‌తోపాటు డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment